మనం అనుకున్నవి జరగక పోవడమే జీవితం అంటే..
కొత్త వైరుధ్యాల కురుక్షేత్రంలో గీతోపదేశమివ్వడానికి కృష్ణుడి లౌఖ్యమూ పనిచేయ్యదూ,
కర్ణుడి విధేయత్వమూ పనిచెయ్యదు..!!
అమాయకత్వమూ, మాయ, ఏమీ పనిచెయ్యవు. మానవ జీవితం ఒక ఒత్తిడితో కూడుకున్నది
మనసు తీసే ఓ కూనిరాగం అది..!
ఒక శిఖరాన్ని ఎక్కినంతసేపు చాలా హుషారుగా వుంటుంది. తీరా అంచుదాకా ఎక్కినప్పుడు నీ మనసు నీరు కార్చేస్తుంది. దీనినే మనం నిరాశ అంటుంటాం. అలాంటప్పుడు మనలోని ఒక తాత్వికుడు మాట్లాడుతాడు. ఇలా చెయ్యకుండా వుండాల్సింది కదా అని!! ఈ రోజుల్లో మనకు లోచూపు, అంతర్ముఖీనతా, రిఫ్లెక్స్విటీ అనే జీవన మూల్యాలు తగ్గుముఖం పడుతున్నాయి. మన అలోచనా పరిధి యెంత విశాలంగా వుంటే మన జీవితం అంత అద్బుతంగా వుంటుంది. జీవితం అనేది అత్యంత గంభీరమైన సత్యాల భోగట్టా.
వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలుపెట్టాలి అని అంటారు తావోయిజాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన చైనా తత్వవేత్త లావొట్టు గారు.
ఇక నా జీవితంలోకి వెళ్తే..
అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి
చేసింది ఒకటి చేస్తున్నది ఇంకోటి..
2003 పది పరీక్షలు రాసి ఇంటర్ లో ఏ గ్రూప్ తీసుకోవాలి అనే ఆలోచనలతో సతమతమౌతున్న రోజులవి..
అప్పు డప్పుడే మార్కెట్ లోకి కొత్తగా కంప్యూటర్స్ వస్తున్నాయి.. Mercury బోర్డు windows 95 ఓ.ఎస్, 128 ఎం.బి రామ్, 500 ఎం.బి. హార్డ్ డిస్క్, సిడి డ్రైవ్ & ఫ్లాపీ డ్రైవ్ ఇలా వుండేది.. అప్పట్లో అదే అప్డేటెడ్ వర్షన్ మరి.. కాసేపు ఖాళీ దొరికితే ఆ కంప్యూటర్ ముందు కూర్చుని ఏవేవో నొక్కెసే వాడిని..నేను ఓనమాలు కూడా నేర్చుకోని రోజులవి.. కానీ ఒక కోరిక వుండేది.. దీన్ని మొత్తం పీకేసి లోపలేముందో తెలుసుకొని మళ్ళి మొత్తం సెట్ చెయ్యాలని.. ఆ కోరికే నన్ను హార్డ్వేర్ వైపు లాక్కెళ్ళింది.. అంతటితో ఆగలేదు.. అప్పటిలో అను అనే తెలుగు సాఫ్ట్వేర్ మార్కెట్ లో హల్చల్ చేస్తుండేది.. ఇప్పటికి కూడా అదే తెలుగులో టైపు చెయ్యడానికి ముఖ్య దిగ్గజం.
దాన్ని నేర్చుకోవాలంటే చాలా కష్టం.. అప్పట్లో ఏ అక్షరం టైపు చేస్తే ఏది వస్తుందో తెలుసుకునే మోడల్ పేపర్ లేదు.. (మీరు ఇప్పుడు సునాయాసంగా కొట్టే తెలుగు టైపు కాదది.. ఇంగ్లీష్ లో స్పెల్ కొడితే తెలుగులోకి మారడానికి.. దానికి అవన్నీ పని చెయ్యవు) ఉదాహరణకు డోయ్ అనే కీబోర్డ్ లో “అ” అనే అక్షరం రాయాలంటే షిఫ్ట్ పట్టుకొని D అనే అక్షరాన్ని కొట్టాలి.. ఇలా ఒత్తులు, పొల్లులు, దీర్ఘాలు, అన్నీ ఒక్కో డిఫరెంట్ అక్షరాలతో ముడిపడి వుంటాయి.. అన్నీ గుర్తుపెట్టుకోవాలి అంటే అప్పట్లో అది ఒక సవాలుగా ఉండేది .. ఏది కొడితే ఏది వస్తుందో మోడల్ కి పేపర్ కూడా వుండేది కాదు.. నా స్నేహితులు నన్ను అది నేర్చుకొని చూపించు అని నాతో పందెం కట్టారు.. రెండు నెలల నుంచి 3 నెలలు సమయం పట్టేది అందరికీ నేర్చుకోవాలంటే.. నేను కేవలం రెండు వారాల్లో చాలా వేగంగా తెలుగులో టైపు చెయ్యడం నేర్చేసుకున్నాను.. ఒక్కో అక్షరం కొడుతూ పేపర్ మీద రాసుకుంటూ వాటిని గుర్తు పెట్టుకుంటూ, మళ్ళి సాధన చేస్తూ ఎంతో పట్టుదలతో నేర్చుకున్నాను.. నాతో పందెం కట్టిన వారినే కాదు.. అక్కడ తెలుగు టైపు చేసే మాస్టర్స్ కి కూడా ఒక సవాలు విసిరేలా ఆశ్చర్యపరిచాను..
ఇక ఇంటర్ చదువుతూనే పార్ట్ టైం జాబు చేసేవాడిని.. డబ్బులు కోసం కాదు.. కంప్యూటర్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి.. ఓ సంస్థలో పార్ట్ టైం గా పని చేస్తూనే బోలెడంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాను.. యాహు మెసెంజర్ హాకింగ్, జిమెయిల్ హాకింగ్, డాకుమెంట్ passwords హాకింగ్, ఇలా ఒక్కటేంటి.. ఫోటో షాప్ లో వీడియో ఎడిటింగ్, ఇమేజ్ ఎడిటింగ్, లోగో డిసైన్, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్నీ నేర్చుకున్నాను.. కంప్యూటర్ ను పూర్తిగా ఒక్కో పార్టు గా పీకేసి మళ్ళి యధావిధిగా పెట్టెయ్యడం పరిపూర్ణంగా నేర్చుకున్నాను.. సమస్య తలెత్తినా పరిష్కరించడం కూడా నేర్చుకున్నాను..
అలానే ఇంటర్ రెండవ సంవత్సరం అది.. కరాటే అంటే చిన్నతనం నుంచి ప్రాణం వుండేది.. ఒక ముస్లిం మాస్టర్ నాకు నేర్పించడానికి ముందుకు వచ్చారు.. వైట్, ఎల్లో. ఆరంజ్, బ్రౌన్ బెల్టు దాకా చేరుకున్నాను.. ఖటినమైన శిక్షణ తీసుకున్నాను.. బ్లాక్ బెల్ట్ కొట్టాలనే కోరిక మాత్రం అలానే ఉండిపోయింది.. కేవలం నా మాస్టర్ చనిపోయిన కారణం చేత.. ఆయన చనిపోయాక కరాటే వదిలేసాను..చాలా రోజులు పట్టింది బయటకు రావడానికి నాకు..
దాని తరువాత డిగ్రీ.. బేకారి గాడిలా మారిపోయా.. తిరుగుళ్ళు, తిరుగుళ్ళు ఇదే పొద్దులస్తుమానం.. మా ఊరి క్రికెట్ సామ్రాజ్యానికి నేనో తలమానికం గా మారిపోయా.. టోర్నమెంట్లు, డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఆడటాలు ఇలా కొన్ని రోజులు సాగింది.. డిగ్రీ అవ్వగానే నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న .. కానీ నాకు ఒక క్లారిటీ వుంది.. మల్టీమీడియా విత్ మాయా .. వెబ్ డిసైనింగ్, యానిమేటర్ అవ్వాలని కల.. అందుకోసం నేను, నా స్నేహితులు కలిసి బెంగుళూరు వెళ్ళాము.. ఎంతో కష్టపడి కోర్స్ నేర్చుకున్నాము. తీరా మేము బయటకు వచ్చేసరికి ఆ కోర్సుకు వాల్యూ లేకుండా వున్నవాల్లనే పీకేసే పరిస్థితికి వచ్చింది.. నోట మాట రాలేదు. ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు మరోపక్క.. ఆకాశాన్ని చూసి గట్టిగా అరిచే క్షణాలు నా జీవితంలో అప్పటినుంచే మొదలయ్యాయి..!!
అక్కడే బెంగుళూరు లో మాకు దూరం బంధువులు అయిన వారి ఇంట్లోనే నేను ఉండేవాడిని.. కానీ వారి ప్రేమ నిజంగా గొప్పది.. నన్ను చాలా బాగా చూసుకునేవారు.. వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఎందుకని చాలాసార్లు భోజనం చేసేవాడిని కాను.. బయట స్నేహితులతో తిన్నాను అని అబద్దం చెప్పేవాడిని.. బెంగుళూరు లో అప్పట్లో చాలా చలిగా వుండేది.. ఇంట్లో అందరం పడుకోవడానికి సౌకర్యం గా వుండేది కాదు.. అది చాలా చిన్న ఇల్లు.. అందుకని నేను మేడమీడకు రగ్గు తెచ్చుకొని పడుకునే వాడిని.. రాత్రంతా వణుకుతూ.. కొన్ని రోజులు నన్ను అలా చూసి వాళ్ళు నాతోపాటే వచ్చి మేడ మీద పడుకునే వారు. ఈ ఒక్క మాటచాలు వారికి నాపై వున్న ప్రేమాభిమానాలు చెప్పేందుకు.. బెంగుళూరు లో ఒక్క రోజుమొత్తం ఎక్కడినుంచి అయినా తిరగడానికి పాస్ ఇచ్చే వారు.. అది కొనుక్కుని ఫ్రీ గా ఏ బస్సు అయినా ఎక్కి తిరగవచ్చు.. అలా మూడు నెలలు వీధి కుక్కకన్నా భయంకరంగా తిరిగాను వుద్యోగం కోసం.. ఎక్కిన ప్రతీ మెట్టు తోసేసింది.. వెనుతిరిగిన ప్రతీ సారి అక్కడ నన్ను నేను కోల్పోయే వాడిని..
ఇక అక్కడనుంచి నెల్లూరు కి వచ్చేసాను.. డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ (DRDA) సంస్థ వారు నన్ను, నా స్కిల్స్ ని నచ్చి నాకు వుద్యోగం ఇచ్చారు.. ప్రైవేటు గా.. అక్కడి అధికారుల దగ్గర చాలా ఉన్నత శిఖరాలను అందుకున్నాను.. నన్ను, నా పనితనాన్ని ఎంతో గౌరవించే వారు.. కానీ గుర్తించేవారు కాదు.. నిర్మొహమాటంగా వారికి ఆ విషయం చెప్పి వచ్చేసాను..
మళ్ళి మాములే.. జాబు ట్రైల్స్ .. కొన్ని రోజులు తిరగగా తిరగగా రిజిస్ట్రేషన్ డిపార్టుమెంటు లో ప్రైవేటు గా డాక్యుమెంట్ రైటర్ జాబు ఒకటి వుందని తెలిసింది.. నాకు ఆ ఫీల్డ్ అస్సలు తెలియదు.. కానీ ఉదయాన్నే వెళ్లాను.. నాలా అక్కడ మరో 20 మందిదాకా వున్నారు.. ఇంత కరువాసిపోయి వున్నారేంట్రా ఒక్కొక్కరు అనుకుంటూ నీరసంగా పక్కన వున్నా కుర్చీలో కూలబడ్డ.. ఒక్కొక్కరిని పిలవడం మొదలెట్టారు.. లోనకెళ్ళి 20 నిమిషాలు తరువాత ఒక్కొక్కరు తిరిగి వస్తున్నారు.. వచ్చిన వాడిని అడిగాను.. ఏముంది రా సామి లోపల పోయినవాడు డల్ గా వస్తుండు అని అడిగా.. తెలుగు టైపు చెయ్యాలంట అదికూడా వారు చెప్పే డాక్యుమెంట్ బాషలో వాళ్ళు చెప్పిన నిమిషాల వ్యవధిలో తప్పులు, తడికలు లేకుండా టైపు చెయ్యాలన్నారు.. నువ్వు చేశావా అని అడిగితే నాకు అసలు తెలుగు టైపింగ్ ఏ రాదు. ఇంగ్లీష్ అయితే చేస్తానన్నాను... వెంటనే వెళ్లి రా అన్నారు అని వాడి ఆవేదన వ్యక్తం చేసాడు.. వాడు వెళ్ళిపోతున్నందుకు బాధ పడాలో, నాకు తెలుగు టైపింగ్ వచ్చినందుకు ఆనంద పడాలో, నాలా ఇంకా అక్కడ చాలామంది వున్నందుకు భయపడాలో అర్ధం కాకుండా వున్నాను..
ఒక్కొక్కరిగా పిలుస్తూ నా వంతు వచ్చింది.. నేను లోపలకు వెళ్ళి వాళ్ళు చెప్పిన సమయంలో టైపు చెయ్యడం మొదలెట్టాను.. నిజానికి నేను వాళ్ళు చెప్పిన సమయంలో ముగించలేకపోయాను కారణం ఒక్కటే.. నేను టైపు నేర్చుకోలేదు.. నేరుగా కంప్యూటర్ పట్టుకున్నాను.. అందువల్ల ఆ సమయం లోపల ఎంత వరకు టైపు చెయ్యగలనో అంతే చేసి వచ్చేసాను.. నాకు తెలుసు ఖచ్చితంగా నాకు రాదని.. ఎందుకంటె అక్కడ వున్నవారంతా టైపులో higher వాళ్ళు.. సమయానికన్నా ముందే పూర్తి చేసి వచ్చేశారు.. కానీ వేచి చూద్దాం అని అక్కడే వున్నాను.. ఓ వ్యక్తి బయటకు వచ్చి మీరంతా వెళ్ళొచ్చు.. మీరు ఒక్కరే ఉండొచ్చు అని నావైపు చూస్తూ అన్నాడు.. నా వెనుక ఎవరన్నా వున్నారేమో అని వెనక్కు తిరిగాను ఎవరూ లేరు.. లేదు మిమ్మల్నే.. మీరు లోపలకు రండి అంటూ ఆహ్వానించాడు .. లోపలకు వెళ్ళి కూర్చున్నాను.. మీరు మేము చెప్పిన సమయానికన్నా పూర్తి చెయ్యలేకపోయినా కూడా మిమ్మల్ని తీసుకోవడానికి కారణం మీ టైపింగ్ లో ఒక్క తప్పు కూడా లేదు. మిగతావాళ్ళు వేగంగా చేసినా కూడా చాలా తప్పులు వున్నాయి.. అందుకే మిమ్మల్ని తీసుకున్నాము. మీరు ఇప్పుడే జాయిన్ అయిపోండి.. లంచ్ టైం కూడా అయింది ఒకేసారి తినేసి వచ్చి మీ సీట్ లో కూర్చోండి అన్నారు..
ఏమి అర్ధం కాలేదు.. సరే అని బయటకు వచ్చాను.. నిజానికి ఒక్కసారి వెళ్ళడానికి సరిపడే చార్జి డబ్బులే నా వద్ద వున్నాయి.. దానికి మించి ఇంకేమన్నా వున్నాయేమో అని జేబులన్నీ వెతికాను.. మరో రెండు రూపాయలు కనిపించాయి.. ఇంటికెళ్ళి తిని వచ్చేంత సమయమూ లేదు.. ఎన్నో రోజుల కష్టం ఈ వుద్యోగం.. వదులుకోదలుచుకోలేదు .. సాల్ట్ బిస్కెట్స్ రెండు ఒక్కొక్కటి రూపాయి.. అవి తిని ఫుల్ గా నీరు తాగి నా సీట్ లో కూర్చున్నాను.. ఇచ్చిన వర్క్ మొత్తం పూర్తి చేసి ఇంటికెళ్ళి అమ్మకు చెప్పాను.. ఆ కళ్ళలో ఆనందం చూసి ఇక ఆకలి కూడా అనిపించలేదు.. పొద్దున్నుంచి పడ్డ శ్రమ మొత్తం ఒక్కసారిగా ఎగిరిపోయింది.. అలా నేను స్నేహితులతో పందెం కట్టి నేర్చుకున్న విద్యే నాకు ఈనాటికీ భోజనం పెడుతుంది.. అన్నీ మనం అనుకున్నవి జరగవు.. ముఖ్యంగా ఒక దిగువ మధ్యతరగతి వాడి ఇంట్లో అస్సలు జరగవు.. నా జీవితంలో ఇలాంటి మలుపులు ఎన్నో వున్నాయి..మీకోసం మీలో మార్పు కోసం మచ్చుకు కొన్ని రాసాను..
మనం చేసే ప్రతీ పనిని గౌరవిస్తూ ముందుకు వెళ్ళడమే అసలైన జీవితం.. ఈ కల నెరవేరకపోతే మరో కల కనండి. అదీ కాకపోతే మరోటి.. అంతే కాని డీలాపడి మాత్రం కూర్చోకండి.. సమయం లేకున్నా ఇదంతా రాసింది మీలో మార్పు కోసమే..ఆత్మహత్యలు లాంటివి చేసుకోక జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోండి..అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ..
Written by: Bobby Aniboyina