మదిలో మెదిలే అనేకానేక ప్రవాహ సంద్రంలో.... (కరుణ, శాంత, రౌద్ర, వీరాద్భుత, హాస్య, శృంగార, భయానక, బీభత్సములు, నవరసములు, రతి, శోక, నిర్వేద, క్రోధోత్సాహా, విస్మయ, భయ, జుగుప్సలు, నవ, స్థాయి, భవములు) ఇలా కొన్నిటిని ఏర్చి, కూర్చి సమాజహితానికి ఓ అక్షర ఖడ్గంగా మార్చే సంకల్పమే నా ఈ అక్షరారణ్యం ....
Wednesday, March 18, 2026
మౌన విలాపం...
ఆమెను
అర్థం చేసుకోవడం కష్టం అంటారు!
కానీ
ఆమె చెప్పేది వినడానికి
ఎవరు సిద్దంగా ఉన్నారని
ఎప్పుడైనా ఆలోచించారా?
వేకువనుంచే,
గడియారం ముల్లుతో పోటీ పడుతూ,
ఇంటి నాలుగు గోడల మధ్య
తనను తాను తక్కువ చేసుకునే
నిశ్శబ్ద యజ్ఞం ఆమెది!
పిల్లల అల్లరిని, వంటగది వేడిమిని,
అంతులేని బాధ్యతలను
తన చిరునవ్వు వెనుక దాచుకుని
ఒక స్థితప్రజ్ఞురాలిగా కాలంతో
నిరంతరం యుద్ధం చేస్తూనే ఉంటుంది!
సూర్యుడు పడమర గడప తొక్కే వేళకు..
ఆమె కళ్లల్లో ఓ ఎదురుచూపుల ఆర్ద్రత!
పగలంతా మోసిన తన మౌన భారానికి,
మనసులో దాచుకున్న వేలాది ముచ్చట్లను..
తనవాడు... ఓ శ్రోత అవుతాడన్న చిన్న ఆశ!
వచ్చిన భర్త కళ్లల్లో తన అలసటకు
ఉపశమనం వెతుక్కుంటుంది,
తన లోపలి భావాల సముద్రాన్ని
అతని పలకరింపు అనే తీరంపై
కుమ్మరించాలని తహతహలాడుతుంది!
కానీ..
ఆమె ఆశించిన ఆశ మౌనంగా ఆవిరైన చోట,
అక్కున చేర్చుకునే ఆత్మీయత కోరుకున్నచోట
పరాధ్యానం అనే నిర్లిప్తత ఎదురైన వేళ,
ఆమె నిరీక్షణ రెక్క తెగినపక్షిలా గాయమై,
చెప్పుకోవాలనుకునే మాటలు, లోలోన ఉక్కిరిబిక్కిరై..
ఓ అగ్నిపర్వతంలా మారిన వేళ,
చిరాకు, కోపంతో తనలోని భావ ప్రవాహం
ఒక్కసారిగా అతడిపై పడే ఓ నిస్సహాయ ఆక్రందన ఆమెది!
పాపం..
మగవాడు! ఆ ఆగ్రహం వెనుక ఉన్న
ఆత్మీయ భావాన్ని పసిగట్టలేక,
ఆ కోపం వెనుక దాగిఉన్న ఆమె చల్లని కన్నీటిని చూడలేక..
"ఆడవాళ్లు అంతుచిక్కని అద్భుతం" అని
ఒక చిన్న ముద్ర స్త్రీ జాతిపై వేసి మెల్లిగా తప్పుకుంటాడు!
నిజానికి..
ఆమె ఒక అర్ధంకాని గ్రంథం కాదు,
ప్రేమతో తాకితే వేల భావాలను అలవోకగా
అత్యంత సున్నితంగా పలికించగల ఓ విపంచి!
~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment