మదిలో మెదిలే అనేకానేక ప్రవాహ సంద్రంలో.... (కరుణ, శాంత, రౌద్ర, వీరాద్భుత, హాస్య, శృంగార, భయానక, బీభత్సములు, నవరసములు, రతి, శోక, నిర్వేద, క్రోధోత్సాహా, విస్మయ, భయ, జుగుప్సలు, నవ, స్థాయి, భవములు) ఇలా కొన్నిటిని ఏర్చి, కూర్చి సమాజహితానికి ఓ అక్షర ఖడ్గంగా మార్చే సంకల్పమే నా ఈ అక్షరారణ్యం ....
Wednesday, March 18, 2026
అక్షర అస్తిత్వం...
ఒకానొక శూన్యంలో..
వేళ్ల కొనల మీద వణుకుతున్న అస్తిత్వం నా కలం!
నా లోపల ఉప్పెనలా ఎగసిపడుతున్న వేవేల భావాల తీవ్రతకు
కాగితం ఒక త్యాగభూమిలా ఎదురుచూస్తూ వుంటుంది!
నా ఆలోచన పొరల్లో రూపుదిద్దుకునే
చతుర్విధ రచనల స్వరూపాలు
స్వైరవిహారం చేస్తూ నల్దిక్కులా వ్యాపిస్తాయి!
కలం నా పాలిట ఒక దివ్య దర్పణం!
నేను లోకానికి చెప్పని ఎన్నో రహస్యాలను అది పసిగట్టి,
నా ఆత్మలోని గాయాల చుట్టూ
అక్షర కట్టు కడుతూవుంటుంది
రాయడం అంటే అక్షరాలు పేర్చడం కాదు..
నాలోని అస్తిత్వాన్ని ముక్కలుగా చేసి,
వాటికి భావన అనే పేరుపెట్టి
ఈ లోకపు వేదికపై సగర్వంగా నిలబెట్టడం!
నా అక్షరాలు..
కాలాన్ని శాసించే నిశ్శబ్ద గొంతుకలు!
అవి పుటల మీద నడుస్తుంటే,
నాలోని మనిషి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటాడు.
ఎప్పుడో ఒకనాడు నా దేహం మట్టిలో కలిసినా..
నేను చిందించిన ఈ సిరా చుక్కలు,
ఒక అజరామరమైన ప్రకంపనై
పాఠకుడి గుండెను ఎప్పటికప్పుడు తడుతూనే ఉంటాయి!
ఒక పదాన్ని వెలికితీయడానికి నేను పడే ఈ ప్రయాస..
శూన్యం నుండి ఒక ప్రపంచాన్ని సృష్టించేంత భారం!
సిరా చుక్కగా కాగితంపై జారుతున్నది కేవలం ఓ రంగు కాదు..
అది రేపటి రచయితల ఉనికికి పిండి వార్చిన ప్రాణ సారం!
కొన్నిసార్లు..
నా అక్షరాలతో నేను చేసేది ఓ అంతర్యుద్ధం!
సమాజపు చీకట్లను చీల్చాలని ఆరాటపడే కాంతి కిరణం నా కలం.
మరికొన్ని సార్లు..
అది నా ఏకాంతపు గదిలో నన్ను ఓదార్చే నా ప్రాణ మిత్రుడు!
నా కన్నీటిని సిరాగా మార్చి,
నా గాయాలపై అక్షరాల చందనపు పూతను పూస్తుంది!
రచయితగా నా గమ్యం..
కేవలం పుస్తకాలు నింపడమే కాదు,
శూన్యంలో ఒక అర్థవంతమైన శబ్దాన్ని సృష్టించడం!
అందుకే,
అక్షరమే నా సర్వస్వం..
అక్షరమే నా శాశ్వత సంకేతం!!
~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment