మదిలో మెదిలే అనేకానేక ప్రవాహ సంద్రంలో.... (కరుణ, శాంత, రౌద్ర, వీరాద్భుత, హాస్య, శృంగార, భయానక, బీభత్సములు, నవరసములు, రతి, శోక, నిర్వేద, క్రోధోత్సాహా, విస్మయ, భయ, జుగుప్సలు, నవ, స్థాయి, భవములు) ఇలా కొన్నిటిని ఏర్చి, కూర్చి సమాజహితానికి ఓ అక్షర ఖడ్గంగా మార్చే సంకల్పమే నా ఈ అక్షరారణ్యం ....
Thursday, March 19, 2026
త్రయంబకం విశ్వరూపం...
హర హర!
ఏమయా ఆ నిరంజన తేజస్సు!
సద్యోజాత ముఖారవిందమున వెలిగే
ఆ వినీల వర్చస్సు!
వ్యోమకేశుడా..
నీ జటాజూటంలో..
ఒక ఉత్తుంగ తరంగమై
ఉప్పెనలా ఉబికిన జాహ్నవీ ప్రవాహం!
గడ్డకట్టిన ఆ సిగముడుల మధ్యన..
పాలరాతి వెన్నెల చారై
తళుక్కున మెరిసి మురిసే అందాల నెలవంక!
నుదుట విభూతి రేఖల మధ్య..
కాలధర్మాన్ని శాసించే నిగూఢ ఫాలనేత్రం!
నిశ్చలమైన ఆ వర్చస్సు..
కోటి సూర్యుల ప్రభను తనలో
లీనం చేసుకున్న ఓ నీలవర్ణ శూన్యం!
ఆ కంఠాన బంధించిన హాలాహలం..
లోకానికే ఓ ప్రాణదానం!
దేహం నిండా అలముకున్న
ఆ శ్మశాన భస్మం..
జనన మరణాల చక్రాన్ని ఛేదించే
ఓ పవిత్ర సంకేతం!
మెడలో మాలగా మెరిసే ఆ భుజంగ భూషణం
కాలసర్ప సౌమ్యతకు ఓ నిదర్శనం!
ఒకవైపు ప్రశాంతంగా హిమాలయ పీఠంపై సాగే నిత్యానుసంధానం..
మరోవైపు ప్రళయకాల రుద్రుడై చేసే సంహార తాండవం
హస్తాన ఉన్న త్రిశూలం..
సత్వ, రజ, తమో గుణాల సమన్వయ సమాహారం!
ఢమ ఢమల ఢమరుక నాదం..
శబ్దబ్రహ్మమై విశ్వసృష్టికే ఓ మూలాధారం!
శ్మశానమే నివాసముగా,
చితాభస్మమే అలంకార ప్రాయంగా,
అఘోర రూపాన ఆయన సాగించే ఆ అనంత విహారం..
మోక్షానికే మార్గం.. మృత్యువుపై సాధించే విజయం!
ఆది లేనివాడు..
అంత మెరగని వాడు..
నిశ్శబ్దంలోనూ,
శబ్దంలోనూ నిండిన
ఓంకార నాదమే శివఃస్వరూపం !! నమఃశివాయ!!
~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment