Friday, May 31, 2019

చంద్రిక..



ఈ వర్ణనకు స్త్రీ మూర్తులు కాస్త దూరంగా ఉండమని నా చిరు విన్నపం... 

సరస నవ రసహృదయులకు, రాసోద్భావకులకు, రసస్వాదికులకు మాత్రమే ఇది వ్రాయడం జరిగింది.. సున్నిత మనస్కులకు ఈ వర్ణనలు, ఈ సాహిత్యం జుగుప్సాకరముగాను, వెక్కసముగాను ఉండొచ్చు.. 

వేదంలో మంత్ర ద్రష్టలయిన స్త్రీలు కొందరు ఉన్నారు.. వారినే ఋషీకలంటారు. వారు చాలా నిష్టాతులు అంతే కాదు అపూర్వ సౌందర్యవంతులు కూడాను .. వారిలో ఆత్రేయి.. లోపాముద్ర... వైవస్వతి, పౌలోమి .. అనే నామధేయం కల్గిన వారు ప్రముఖులు.. అంతటి సౌందర్యులను అభివర్ణించడం, శ్లాఘించడం, సముద్భూషించడం మహామహులకే కాస్త కరములు వణుకుపాటు వుంటుంది...నేనెంత .. అయిననూ నా పంథాలోసాహసించాను.. !!

ముఖసౌందర్యమనే ప్రవాహంలో 
చలించే చేపలవంటి కన్నుల గల చంద్రికా 
నీ కుడి నేత్రం 
సూర్యుడై పగటి కాలాన్నీ,
ఎడమ నేత్రం 
చంద్రుడై రాతిరినీ 
ఫాల నేత్రాగ్నితో వేకువ సంధ్యలను 
ప్రసవించునట్లు కనిపిస్తున్నవి..!!

నీ నేత్రాలు విశాలములై, 
మంగళకరములై, 
కోనేటి కలువలకు జయింపరానివై, 
కృపాధార కలిగి, 
మధురములై, 
అగాధములై,
కల పుణ్య క్షేత్ర విజయముతో 
సకల శోభాయమానంగా శోభించుచున్నవి..!!

నీ చూపులు సిగ్గుతో కూడిన విలాస చలనాలు 
నీ శ్వాస వాయువులందున్న సంపంగి 
వాసనల కాకర్షింపబడి 
తుమ్మెదలు సంపంగిపై వ్రాలలేక 
నీవు సంభాషించే వేళ నీ 
యెర్రని అధరములపై మూగుతున్నాయి..!!

జన్మ సహజంగా నీ 
కంఠాన్ని శంఖ సదృశంగా చేస్తే
తదుపరి వచ్చిన నీ యౌవనం 
దానికి గంధపు పూతను పూసి 
నిజ శంఖంగా గావించింది .. 
ఏమా గాత్రము, 
ఏమా గానామృతము, 
దో..దో..ర ద్రాక్ష ….తేనే రసంబున మునిగి
అధర మధ్యమున మధురముగ చిప్పిల్లునట్లు..!!

నీలో యౌవనోదయం ఉదయించగానే 
ఆ కుచములు మల్లె మొగ్గలై మొలకెత్తి 
ఇరుప్రక్కలా కుదురుకొని, పమిట 
సిగ్గులతో, వాటినెంత కప్పిన
యెదనంతా విస్తరించి, మొనదేలి 
పైపైకి నిక్కి నీల్గివున్నవి..!! 

నీ నడుమున వడ్డాణం చాలా సౌందర్యంగా వుంది 
కానీ ఆ నడుమూ, వడ్డాణం ఒకే రంగులో వున్నాయి
నీ త్రివళుల ఉదరముపై నున్న మూడు మడతలు
విడివిడిగా తినుగినట్లున్నాయి .. వాటిని అతకటానికి 
పసిడితో చేసిన రేకును బిగించినట్లుగా వుంది ఆ నెలవంక నడుము..!!

సన్నని తీగవంటి నీ నడుముపై 
అప్పుడే పూచిన పారిజాత కుసుమములా 
నాభి విచ్చుకొని వుంది 
ఆ నాభిలో యౌవన మగువ రసం 
ఊట చలమలా ఊరుతోంది 
ఏమా సౌందర్యం 
ఏమా సౌష్టవం
ఏమా రసోద్భవం 
దర్భపోచవంటి పచ్చని దేహ కాంతితో
ఇంద్రనీలమణి వంటి నీలవర్ణముతో 
బ్రహ్మస్వరూపిణివై, 
నా హృదయేశ్వరివై కొలువుతీరావు.. !!

Written by: Bobby Nani

2 comments:

  1. స్త్రీ అంగాంగ వర్ణన కసిగా చేశావు. స్త్రీ ని సంబోధిస్తూ వ్రాసి మళ్ళా స్త్రీ మూర్తులు దూరంగా ఉండమంటావేమిటి బాబీ. స్త్రీ శరీరం పట్ల అమితమైన కాంక్ష నీరచనలలో బుస్సుమని పొంగుతుంది నానీ.

    ReplyDelete
  2. అద్భుతమైన పద జాలం సోదర చాలా బాగా రాసారు
    నా హృదయేశ్వరివై కొలువుతీరావు 👌👌👌
    @రామ్ లక్కీ @

    ReplyDelete