Friday, May 24, 2019

ఆ సమయాలు మళ్ళి వస్తాయంటావా ..



నీకు గుర్తుందా..! 
నా చొక్కా బొత్తంలో నీ 
శిరోజాలు ముడిపడినప్పుడు ఆ 
కౌగిలి పులకరించిపోయేది
నా మీసం ముళ్ళకి నీ బుగ్గ ఎరుపెక్కి ఆ 
పెదవుల ఎరుపుతో అది పరవశించిపోతున్నప్పుడు 
నా వెచ్చని ఊపిరి తగిలిన ఆ మెడ వంపున కితకితలకు 
నీ మది గాబరా పడి, గుండె వేగాన్ని పుంజుకునేది 
కాటుక చెరిగిన నీ కళ్ళు ఇంకా నా
పెదవుల తడిని తుడుచుకుంటున్నాయి
నా చుంబన ముద్రలు మోసిన ఆ పాదాలకు 
ముద్దుల కాలిమువ్వలు భారమౌతున్నాయి.. !

ఆ చూపుల్లోనే కాదే 
మాటల్లో, 
తాకిల్లో,
వలపుల్లో, 
నీ నడుమోపుల్లో కూడా ఎప్పుడూ నవీనత్వమే..!!

నీకు గుర్తుందా ..!
ప్రభాత సంధ్యలో పదిల పరుచుకున్న ఆ క్షణాలు 
గుండెనిండా గూళ్ళు కట్టుకున్నమన జ్ఞాపకాలు 
నడిప్రొద్దున ఏకమైన మన మనసులు 
ముచ్చట్లతో, కబుర్లతో, కొంటె సరస, 
నవ రస మాధుర్య రసోద్భవములతో 
గంటలు క్షణాల్లో ఆవిరైన ఆ సమయాలు 
మళ్ళి వస్తాయంటావా ..!!

ఓ విధ్యున్నారి...
నీ పరిష్వంగాన్ని ఆస్వాదించి ఎన్ని రోజులైందో.. 
నీ దేహపు సువాసన మాత్రం నను ఇంకా వీడనంటోంది 
ఏం చెయ్యను చెప్పు..!
నీవు నను విడిచిన క్షణాల్లో 
చీకటిని, వెలుగుని చిలుకుతూ, 
వెన్నెలను వెలికితీస్తూ గడిపాను.. 
అమాస, పున్నములను ఆరగిస్తూ గడిపాను..!

ఓ సుప్తమధుకీల..
అమృతప్రాయమైన ఆ యెవ్వన మధువును 
అధరాలకు మధురముఁగ రుచిచూపి 
కిలకిలమను చకోరిలా నవ్వుతూ పోతివి.. 
నీకు గుర్తుందా.. 
నాటి మన రెండు దేహాల మధ్య రగిలిన అగ్నిని 
ఆర్పేందుకు శీతల స్వేద జలాలు కూడా చాల్లేదు 
రగిలే శృంగారం బొట్టు బొట్టుగా కరిగి 
వొంటి మడత మడతలోను ఇంకిపోయింది ..
ఆ సమయాలు 
మళ్ళి వస్తాయంటావా ..!!

Written by: Bobby Nani

1 comment:

  1. అమాస, పున్నములను ఆరగిస్తూ గడిపాను..ఈ విలక్షణ ప్రయోగాలు అనితర సాధ్యం బయ్యా

    ReplyDelete