Friday, May 10, 2019

నిరుద్యోగి నుంచి ఉద్యోగిగా నా ప్రయాణం..



నిన్న సోదరుడు “వినోద్ కుమార్ వేముల” గారు అడిగారు నేటి యువతరం అధిక సంఖ్యలో దినికి గురౌతున్నారు అని..
నిస్సందేహంగా చెప్పొచ్చు ఈరోజుల్లో యువత “నిరుద్యోగానికి” ఎక్కువగా గురౌతున్నారు..

వేలు, లక్షలు కూడబెట్టి తల్లితండ్రులు వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించినా చదివిన చదువుకు ఉద్యోగాలు రాక నిరాశ, నిస్పృహలకు గురౌతూ దొరికిన ఏ పనైనా చెయ్యడానికి వెనకాడట్లేదు .. దానికితోడు తల్లితండ్రులు, కనిపించిన ప్రతీ పెద్దలు, సహచరులు, ఇరుగుపొరుగు, తనకన్నా చిన్నవారు సైతం ఇతడిని అంటరాని వాడిలా, ఎందుకూ పనికిరాని వాడిగా జమకట్టేస్తారు.. బంధువులలోను, స్నేహితులలోను తనకంటూ వున్న కొన్ని స్థానాలను కోల్పోవాల్సి వస్తుంది.. ఖాళీగా ఉండలేక చదువుకు తగ్గ వుద్యోగం దొరకక అతను ప్రతీక్షణం నరకాన్ని అనుభవిస్తాడు.. 

ఇలాంటి తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోలేకనే ఈ బలవన్మరణాలు ..

ప్రతీ ఏటా సుమారుగా మూడు లక్షల మంది బయటకు వస్తుంటే వారిలో ఉద్యోగాలు వచ్చేది లక్ష మందికి మాత్రమే...ఇలా ప్రతీ ఏటా ఈ రెండు లక్షల మంది వారికి దొరికిన ఏదో ఒక ఉద్యోగం చేస్తూ వారికన్నా తక్కువ స్థాయి వారి ఉద్యోగాలను లాగేసుకుంటున్నారు .. ఇలా ఒక గొలుసులా ప్రతీ ఏటా నిరుద్యోగ సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.. 

మనలో చాలా మంది వారి ఉద్యోగాన్ని ఇష్టంతో కాదు తప్పక చేస్తున్నారు.. ఎందుకంటే వారు చేసే ఆ ఉద్యోగం మరొకరిది కాబట్టి..!!
ఒక ఇల్లు, 
ఒక ప్రాంతం, 
ఒక ఊరు, 
ఒక రాష్త్రం,
ఒక దేశం ... బాగుపడాలంటే వ్యక్తిగత భాద్యత ఎంత ముఖ్యమో, ఆ వ్యక్తి ఇష్టంతో చేసే పని కూడా అంతే ముఖ్యం.. ఇష్టంలేని ఉద్యోగం యంత్రం లా వుంటుంది.. అందులో ఐడియాలిజీ వుండదు.. ఆ సంస్థకు మీ వల్ల అభివృద్ధి, పురోగతి, నూతన ఆవిష్కరణలు ఉండవు.. తద్వారా రాబోవు తరాలు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వుంటుంది.. 

ఈ సందర్భానుసారంగా నా అనుభవం ఒకటి చెప్పాలనిపించింది.. 

అది 2008వ సంవత్సరం అప్పుడే ఏదో సాధించాం అన్నట్లు Graduate పట్టా తీసుకొని అందరం బయటకు వచ్చాం... నిజానికి బయటకు వచ్చిన ప్రతీ విద్యార్ధి తెలుసుకోవాల్సింది ముఖ్య విషయం ఏంటంటే మనం చదివింది వేరు ఇక్కడ జరుగుతున్నది వేరు అని.. నీ చదువుకు, ఇక్కడ జరిగే పోటీ ప్రపంచానికి అస్సలు సంబంధమే వుండదు.. ఎవడి పరుగు వాడిదే మరొకడిని చూసే సమయం కూడా వుండదు ఎవడికీ.. నీ చదువులో నువ్వు అక్షరాలను చదివితే ఇక్కడ నువ్వు ఎదుటోడి మనసులు చదవాలి..

అలా బయటకు వచ్చిన మేము వివిధ రంగాలను ఎంచుకున్నాం..నా స్నేహితులు కొందరు ఎం.బి.ఏ., ఏం.సి.ఏ. అంటూ కొందరు..పొలిసు ఉద్యోగాలు అంటూ కొందరు, బ్యాంక్స్ ఉద్యోగాలు అంటూ కొందరు, బిజినెస్ అంటూ మరికొందరు ఇలా ఎవరి రంగాలలో వారు వెళ్ళిపోయారు.. నేను మాత్రం Multimedia with maaya, web designing and animator అవ్వాలని అటు వెళ్లాను.. banglore కి వెళ్ళాను.. జయనగర్ కాలనీ లో ఉండేవాడిని.. ఆ జ్ఞాపకాలే వేరు అసలు.. చదువైపోయిన తరువాత మనం రోజూ చూసే ప్రపంచం చాలా అందంగా కనిపిస్తూ వుంటుంది.. 

నాతోపాటు మరో స్నేహితుడు వచ్చాడు.. ఇద్దరం కలిసి Multimedia with maaya బాగా నేర్చేసుకున్నాం ఇద్దరం పోటీపడి ఓ యానిమేషన్ క్రియేట్ చేసాము.. అలా ముందుకు వెళ్ళాలనుకున్న మా కళ ఎక్కువసేపు నిలబడలేదు.. ఒక్కసారిగా మా ఫీల్డ్ కుప్పకూలిపోయింది.. కొత్తగా నేర్చుకొని ఉద్యోగంలోకి అడుగుపెట్టాలనుకునే మాకే కాక ఇదివరకు ఉద్యోగాలలో ఉన్నవారి పరిస్థితి కూడా దయనీయంగా మారింది.. ఒక్క సంవత్సరం పాటు మేము చెయ్యని ప్రయత్నం లేదు. తిరగని ప్రదేశం లేదు .. మెట్లేక్కని కంపనీ లేదు .. అప్పటివరకు రంగులమయమైన ప్రపంచం నిశీధమును తలపించింది.. ఇక నా స్నేహితుడు ఉండలేక స్వంత ఊరుకు పయనమయ్యాడు.. మరొక్క నెల ప్రయత్నించి వచ్చేస్తానని చెప్పి పంపించాను..

దూరం బంధువులకు తెలిసిన వారి ఇంట్లో ఉండేవాడిని.. వారు ఇబ్బంది పడకపోయినా నేను మాత్రం నాకోసం చాలా ఇబ్బంది పడుతున్నారేమో అని అనుకోని నేను ఇబ్బంది పడేవాడిని... చాలా చిన్న ఇల్లు వారిది.. 5 మంది మనుషులు అందరం ఒకేదగ్గర పడుకోవడం చాలీ చాలక ఇబ్బందిగా వుండేది.. నేను వెళ్ళి రాత్రుళ్ళు మేడ మీద పడుకునే వాడిని.. వాళ్ళు ఎంత చెప్పినా వినేవాడిని కాదు.. చలి చాలా ఎక్కువగా వుండేది.. అలానే వణుకుతూ పడుకొనే వాడిని .. ఒకరోజు నా పరిస్థితి చూసి లావాటి రగ్గు ఒకటి బీరువానుంచి తీసి ఇచ్చారు... అంతే కాకుండా వారు నాతోపాటు పైన పడుకునే వారు.. నిజంగా వారు నాపై చూపించిన ప్రేమ ఎప్పటికీ మరువలేను.. 

అప్పట్లో majestic bus stand లో పాస్ ఇచ్చేవారు రోజుకు ఇంతని కడితే ఆ రోజు మొత్తం మనం ఇష్టం వచ్చినట్లు ఎక్కడైనా తిరగవచ్చు అలా అది తీసుకొని కంపనీలు తిరిగే వాడిని.. ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ అరచేతిలో ఫోన్ అప్పుడు లేవు.. జాబుల కోసం banglore లో వీక్లీ మాగజైన్ అని ఒకటి పడేది అందులో అన్నీ రంగాలకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ఉండేవి.. అన్నీ పెన్ తో మార్క్ చేసుకొని వెళ్ళేవాడిని.. అలసిపోయిన నాకు ఆ పక్కనే వున్న లాల్బాగ్ పార్క్ నన్ను సేదతీరుస్తూ వుండేది.. కాస్త అసహనం అనిపించినా, మనసు బాలేకపోయినా అక్కడకు వెళ్ళేవాడిని.. ఒంటరిగా వుండటం నేర్చుకున్నది నేను banglore లోనే.. 

రోజులు గడుస్తున్నాయి.. 

ఇంట్లో సమస్యలూ ఎక్కువౌతున్నాయి. 

ఇక ఇక్కడితో స్వస్తి పలికి వచ్చేసాను..

స్వస్తి చెప్పింది నా ప్రోఫెషన్ కి కూడా అవుతుందని నేను అనుకోలేదు..

ఓ చిన్న ఉద్యోగంలో చేరాను..

చిన్ననాటి నుంచి తెలుగు అంటే చాలా మమకారం ఉండేది నాకు... దానికి సంబంధించిన వృత్తిలోనే చేరాను.. ఆ తరువాత మరో అవకాసం డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ లో చిరు ఉద్యోగం.. మొదటిసారి అక్కడ నేనేంటో నాకు తెలిసింది.. ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అది.. నా కన్నా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారు ఇప్పటివరకు పి.డి గారి రూంలోకి వెళ్ళలేదు.. ఆయన ఎవరినీ పిలవలేదు కూడా.. అలాంటిది నా గురించి అడిగి తెలుసుకొని ఆయనే నన్ను పర్సనల్ గా తీసుకువెళ్ళారు..ప్రశంసలతో నన్నూ, నా వర్క్ ని ముంచెత్తారు.. మా ఫీల్డ్ మొత్తానికి ఇంక్రిమెంట్స్ పెంచమని జి.ఓ. పాస్ చేసారు.. కాని అక్కడ కూడా ఉండలేకపోయాను..కారణం నా పై అధికారుల కుతంత్రపు విన్యాసాలు..

ఆ తరువాత మరో ఉద్యోగం కోసం వెళ్లాను.. 

నాలాంటోళ్ళు అక్కడ చాలామంది వున్నారు.. 

ఒక్కొక్కరిగా పిలుస్తూ వున్నారు.. ఇక నా వంతు వచ్చింది.. 

కాసేపు బయట ఉండమన్నారు.. నన్నోక్కడినే కాదు అందరినీను.. 

టెన్షన్ అయితే అస్సలు లేదు ఆ సమయంలో ఎందుకంటే నాకన్నా మంచి స్కిల్స్ వున్నవారు అక్కడ వున్నారు.. అందుకే నాకు ఎలానో రాదని ఫిక్స్ అయిపోయాను .. ఓ వ్యక్తి లోపలినుంచి వచ్చి నన్నే చూస్తూ నన్నోక్కడినే ఉండమన్నాడు.. నాకేమి అర్ధం కాలేదు.. అందరూ వెళ్ళిపోయారు.. నన్ను మాత్రం లోనికి పిలిచారు.. అప్పటివరకు టెన్షన్ లేని నాకు చల్లగాలిలో కూడా చెమటలు పట్టేస్తున్నాయి.. ఇప్పుడే జాయిన్ అయిపోతారా అంటూ ఓ స్వరం.. హా జాయిన్ అవుతాను అని చెప్పాను.. వెళ్ళి ఏదైనా తినిరండి వర్క్ డీటెయిల్స్ ఇస్తాను అని చెప్పాడు.. 

ఉదయం పది గంటలకు ఇంటినుంచి ఏమి తినకుండా వచ్చాను.. ఆకలి చంపేస్తుంది. సాయంత్రం 4 అవుతోంది.. ఇంటికెళ్ళి తినివచ్చే సమయం లేదు .. అసలే అందివచ్చిన అవకాశం వదులుకోదలుచుకోలేదు.. రెండు బిస్కెట్స్ కోనేంత చిల్లర మాత్రమే జేబులో వుంది.. వాటితో రెండు బిస్కెట్స్ తిని వాటర్ తాగి వర్క్ చేసేసాను.. రాత్రి ఎప్పుడో 10 గంటలకు వెళ్ళి తినకుండానే పడుకున్నాను.. ఎందుకంటే ఇదే ఇక నా ప్రపంచం ఇదే ఇక నేను ఉండబోయే లైఫ్ స్టైల్ అని నాకు అర్ధం అయింది.. ఆ ఆనందంలో ముద్ద కూడా ముట్టలేకపోయాను .. అమ్మకు చెప్పాను ... ఆ కళ్ళలో ఆనందం ఎన్ని కోట్లు పెడితే వస్తుంది.. అలా నా ప్రస్థానం మొదలైంది.. 

నిరుద్యోగం అంటే ఇన్ని పోరాటాలు వుంటాయి మరి.. 

నేను చెప్పేది ఒక్కటే 

మీరు అనుకున్నది రీచ్ కాలేదా అక్కడే ఆగిపోకండి.. 

మీకు ఎందులో ప్రావీణ్యం ఉందో దానిలోనే మీ ఆనందాన్ని వెతుక్కోండి.. 

నిరాశ, నిస్పృహలకు మీ మైండ్ లో అస్సలు స్థానం కల్పించకండి.. 

వాటివల్ల మీ భవిష్యత్తే కాదు మీతోవున్న వారి ఆలోచనలను కూడా దెబ్బతీస్తుంది.. 

ఏదోటిలే అంటూ అడుగేయ్యకు.. 

ఏదైనా సరే అంటూ అడుగెయ్యి.. 

ఎలా సాధించావని కాదు.. 

ఏం సాధించావో లిఖించు.. 

నీతోటి వారికి నువ్వో సగర్వపు తలమానికమవ్వు..!!


This Article Written by : Bobby Nani
Don't Copy this article copy rights are reserved

No comments:

Post a Comment