Friday, July 27, 2018

అభివర్ణించలేని లావణ్యము తనది..




వెన్నెల చీరగట్టి నెరవిచ్చిన రెల్లు తురాయి వెట్టి, మెల్లిన 
సన్నజాజి పువుటెత్తుల గ్రొమ్మడి చుట్టి, యేటివాల్ తిన్నెల 
నెచ్చెలుల్ వెదకి తీయగ, వెన్నెలవత్తు లాడుచున్, 
పున్నమిరేయి దోచు విరిబోణి విహంగిని మలచు ఓ 
చిత్రకర్ముడా వందనం, అభివందనముల్ __/\__ 

వెన్నెల వంటి చీరగట్టి, తురాయి, సన్నజాజి కలిపి అల్లినటువంటి మాలను గుత్తుగా చుట్టి, యేటి గట్టున అల్లరి ఆటలు ఆడుతున్న కోమలాంగులలో పున్నమి రేయిని దోచుకునే అందాల భరిణెను తన ఊహల్లో మన ఊహకందని విధంగా మలచిన ఈ చిత్రకారునికి ముందుగా శిరస్సు వంచి ధన్యవాదములు తెల్పుతూవున్నాను.. __/\__ 

అలానే అందరిలోనూ ప్రతిభ ఉందన్న విషయాన్ని గుర్తించి, అందరూ కలిసికట్టుగా ఉండాలన్న దృక్పధంతో ఓ చిరు ప్రయత్నంగా నా సోదరీ శ్రీమతి రూపసాహిత్య గారి అభీష్టము మేరకు నా ఈ చిరు కవితా మాల .. J 

ఏ పూర్వ శతాబ్దంలో 
ఏ రసోద్భవ సన్నివేశంలో 
జన్మించినదో ఈ ముదిత 
ఏ సరసుడూ, 
ఏ రసికుడూ, 
ఏ కవీ, 
తమ తమ అర్ధనిమేలిత నేత్రాలతో వీక్షించినా, 
తన్మయత్వ హృదయములతో పలికించినా, 
అభివర్ణించలేని లావణ్యము తనది..!! 

ఇంతకీ ఎవరీ జాణ?? 
మనుమసిద్ది దర్బారులో 
ఆమె నృత్య హేలా విలాసములు చూచి 
తిక్కన చిత్రించిన సై రంధ్రీ రూపాంతరమా ?? 
లేక 
కేతన దశ కుమారులతో, 
జూదములాడించిన 
శతాబ్దాల శృంగార మంజరీనా ?? 

ఎచ్చటినుంచి వచ్చిందీమె ?? 
ఉల్లాసరాశిలా, 
తొలకరిజల్లులా, 
దూరవన చంపక సౌరభమువలె వచ్చి నిల్చుంది..!! 

శ్రీనాథుడితోనో, 
అంతకన్నా ఉద్దండపండిత కవితలతోనో 
సరసాలాడిందా ఏమి...? 
అణువణువునా కవితా ధారలు 
సొగసున ఇంపుగా నింపుకుని ఉంది.. !! 

ఈమె విరహిణి కాదు, 
ముగ్దా కాదు, 
రమ్య అలంకారములతో నున్న 
వాసవసజ్జిక, 
ప్రౌఢ, 
శాస్త్రకోవిద, 
కళాచతుర్విధ..!! 

పాల్గుణ పౌర్ణమిలో, 
రంగని తిరునాళ్ళలో, 
నృత్య మంజీర గాథలా, 
సరసానికి సరసిజలా, 
ఏ మేఘ మేదుర శ్రావణ సంధ్యయందో 
పరీమళపులకింత చైత్ర నిశీథముననో 
జ్యోత్స్నా విహ్వాల శారద పూర్ణిమనో 
ఆనందాంతరంగిణియై ఆర్ధభరిత అక్షరములో 
ఇమిడి సౌష్టవ కీర్తి పతాకముపై 
లలితాంగిణిలా నవ్వుతూ నిల్చుంది 
నా హృదయ వేదికపై..!! 

ఎందులకో నా కవితా ముగ్ధను 
తట్టి లేపిందీ కిన్నెరకంఠి 
బహుశా ఆమెకు తోడునీడగా 
నా కవితా ఘురి ఉండగలదను 
నమ్మికతోనేమో..! 

ఇద్దరి చెలిమిని చూస్తూ 
ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాను.. 
ఇంతటి ఈమె రూపురేఖా లావణ్యమును 
కవితలోనైనా నాకు చిక్కిందని 
సంతుష్టి చెందాను.. !!
Written by : Bobby Nani

4 comments:

  1. అవునండీ..చిత్రం లోని విరబోణి బాగుంది
    మీ వర్ణన బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు అండి..

      Delete
  2. వి.రి.బో.ణి శకుంతల అనిపిస్తోంది.

    ReplyDelete