Monday, July 2, 2018

ఆత్మహత్య మహా పాపం .. దాన్ని ఆపే భాద్యత మన అందరిదీ ..




సమస్యని చూస్తే పారిపోయేవారు నేటి కాలంలో బాగా ఎక్కువ అయ్యారు.. ఈ మధ్య కాలంలో అయితే మరీ ఎక్కువయ్యారు. చిన్న చిన్న సమస్యలను కూడా ఎదుర్కోలేక చనిపోవడానికి కూడా వెనకాడటంలేదు.
అసలు ఎందుకు ఇలా పిరికితనంగా మారిపోతున్నారు నేటి యువత ?

దీనికి ముఖ్య కారణం తల్లితండ్రులనే చెప్పాలి... !!

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చదవు, లేదంటే ఆటలు, లేదంటే టి వి చూడటం, లేదా మొబైల్ పట్టుకొని సోషల్ నెట్వర్కింగ్ లలో కాలయాపన చేస్తున్న పిల్లలతో కొంతసేపు గడిపి వారి మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నమే చేయడంలేదు. అసలు మనకి సంబంధించి కొన్ని గ్రంధాలు ఉన్నాయని పిల్లలకే కాదు కొందరి పెద్దలకి కూడా తెలియకపోవడం నిజంగా విచారించాల్సిన విషయం.
ఆ గ్రంధాలు చదవడం చదివించడం వల్ల జ్ఞానంతో పాటు జీవితాన్ని, అందులో ఎదురయ్యే సమస్యలని ఎలా ఎదుర్కొని నిలబడాలో తెలుస్తుంది. 

ఒక సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైనా సమస్య మీద పోరాటం చేయకండి. లేనిపోని సమస్యలు వస్తాయి. ఆ సమస్య పునాదిని వెతకండి.. అసలు సమస్య ఎలా ప్రారంభం అయ్యిందో తెలిస్తే సమస్యని పూర్తిగా తొలగించవచ్చు. 

ఉదాహరణకి : మీకు ఒక మంచి స్నేహితుడు వున్నాడు అనుకోండి. అనుకోని పరిస్థితుల్లో వ్యసనాలకి లోనై పడిపోతున్నాడు. దీనికి మాములుగా ఎవరైనా చేసే పని స్నేహితుడిని మందలించడం. ఇక్కడే సూక్ష్మం దాగుంది.. మీరు అలా తిడుతుంటే ఇంకా ఎక్కువగా చేస్తాడు కానీ తగ్గించడు.. ఇక్కడ మీరు చేయాల్సిన పని వాడి స్నేహితులని, వాడి చుట్టూ ఉన్న పరిస్థితులని మార్చండి. తనకు మానసికంగా దగ్గరయ్యి తనలో మనోవికాసాన్ని నింపాలి.. క్రమ క్రమంగా తనలో తప్పకుండా మార్పు వస్తుంది.. వచ్చితీరుతుంది.

అలాగే పిల్లలకి ప్రతి విషయాన్నీ వివరించి చెప్పండి.. చీటికి మాటికి విసుక్కుంటే భయపడి అసలు అడగాల్సినవి అడగటం, చెప్పాల్సినవి కూడా చెప్పకుండా మానేస్తారు.. అలాగే చదువు, చదువు అని తెగ రుద్దేస్తున్నారు.. ప్రతి పిల్లాడికి (మనిషికి) ఒక ప్రత్యేకత ఉంటుంది. అసలు ప్రతీ మనిషి అద్బుత సృష్టే.. అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయండి.. చదవొద్దు, చదివించొద్దు అని చెప్పట్లేదు.. ఎంతవరకు అవసరమో అంతవరకు చదివించండి చాలు ... ఇది స్పీడ్ యుగం, చదవకపోతే వెనకపడిపోతాడు అనేది మీ తెలివితక్కువతనం.. మీ మూర్ఖత్వం... 

ఎంతోమంది ఎన్నో కనిపెట్టారు.. వాళ్ళందరూ MBA, MCA, Degree, PG ఏమి చదవలేదు.. ఎంత అవసరమో అంత అవసరమైన మేర మాత్రమే చదివారు ఆ విజ్ఞానంతో అద్బుతాలు సాదించారు.. ఎవరో ఏదో చేశారని వాళ్ళని చూసి మన పిల్లల్ని, వాళ్ళ జీవితాలని నాశనం చేయకండి..!! 90 శాతం అధికమైన ఒత్తిడివల్లె మన ఆరోగ్యాలు అనారోగ్యపాలౌతున్నాయని మీకు తెలుసా.. ?? ఎలాంటి సమస్య అయినా సరే ఇగోలు వదిలి పిల్లలు, పెద్దలు మనస్పూర్తిగా కలిసి కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుందని నా ప్రగాఢ విశ్వాసం.. కావాలంటే ఓ సారి ప్రయత్నించండి.. ఒకరికొకరు మనస్పూర్తిగా మాట్లాడక పోవడం వల్లే సమస్య పుడుతుంది.. మధ్య వర్తుల సలహాలు, సహకారాలు అవసరం లేదు.. మీ వారికోసం ఏం కాస్త తగ్గించుకోలేరా .. ఇక్కడ తగ్గించుకుంటే మీ జీవితం, మీ పిల్లల భవిష్యత్తు రెండూ బాగుంటాయి...!!
రేపు మాట్లాడుదాం లే అని అనుకుంటే అలాంటి రోజులు గడిచిపోతూనే ఉంటాయి.. 
ఇప్పుడే మాట్లాడండి..!!
రేపటితరానికి ఓ భరోసా, మేమున్నామనే ధైర్యం వారికి మీరు ఇవ్వండి..!!
ఆత్మహత్య మహా పాపం .. 
దాన్ని ఆపే భాద్యత మన అందరిదీ ..
అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ.. 

స్వస్తి.. __/\__

Written by : Bobby Nani

No comments:

Post a Comment