Thursday, March 1, 2018

నా దేశం..



మనసారా ఓ భావన రాసి ఎన్నిరోజులైందో .. 
అలసటలేని జీవితాలు, హడావిడి బ్రతుకులు మనవి.. 
మట్టికి, మానుకు ఎలాగో దూరమైపోయాం.. 
అక్షరానికి కూడా దూరం అయిపోతున్నాం ...!!

మనదేశం గొప్పది అంటున్న ప్రతీసారి 
నాకెందుకో మింగుడు పడట్లేదు.. 
దేశం మాత్రమే గొప్పది.. మనుషులు కాదు.. !!

ప్రపంచ దేశాలలో కొన్ని మంచుతో కప్పి వున్నాయి 
కొన్ని సముద్రాలతో నిండి ఉన్నాయి 
మరికొన్ని ఇసుకతో ఇమిడి వున్నాయి .. 
ఒక్క నాదేశం మాత్రమే 
సస్యశ్యామలమై విరాజిల్లుతోంది.. !!

ఊపిరాడని శీతలము బిగుతుగా చుట్టేసే వేళ
వెచ్చని కంబళై కప్పేందుకు 
నా దేశంలో ఎడారులకేం తక్కువ కాదు.. !!

ఉష్ణమధికమై స్వేదపు నది లంఘించు వేళ 
మలయమారుతపు కొంటె కౌగిలిలిచ్చేందుకు
నా దేశంలో ప్రపంచపు ఎతైన హిమశిఖరములకేం కొదవలేదు.. !!

క్షణాల్లో వాయుమండలాన్ని అతలాకుతలం చేసేందుకు 
నా దేశంలో విశాలమైన సముద్రతీరాలకేం లోటులేదు.. !!

కడుపునిండా తియ్యని నీరు త్రాగేందుకు 
నా దేశంలో జీవనదులకు కొఱఁతే లేదు.. !!

కానీ 
మనుషులే నా దేశంలో మలినమై పోయారు .. 
వారు పెంచి పోషించిన అవినీతి, స్వార్ధమనే రెండు 
నల్లని షూలు నా దేశపు నిండు చూలాలును 
ఉదరక్షేత్రంపై పదే పదే తంతున్నాయి..
నాయకుల అభయహస్తం అరుపు రాకుండా 
నోరు నొక్కుతున్నాయి..
ప్రభుత్వ సేవకులు సంతక లతలతో 
కదలనివ్వక ఉరి బిగిస్తున్నారు.. 
లోకులు కాకుల్లా తనువంత గ్రుచ్చి గ్రుచ్చి 
అవినీతి విత్తనాలను పెంచిపోషిస్తున్నారు ..
మారని నా దేశానికి 
మార్పురాని నా ఈ కవిత అంకితమిస్తూ.. !!

Written by: Bobby Nani

No comments:

Post a Comment