Tuesday, August 1, 2017

\\\\ నాటి ఫోటో ప్రపంచానికి నేటి సేల్ఫీల ప్రపంచానికి మధ్యగల సన్నని గీత ////



గడచిన కొన్ని రోజుల అనంతరం మీ ముందుకు పునఃదర్శనం ..

\\\\ నాటి ఫోటో ప్రపంచానికి నేటి సేల్ఫీల ప్రపంచానికి మధ్యగల సన్నని గీత ////
******************************************************
నాడు ఫోటో అంటే ఓ ఆనందం, ఓ అద్బుతం, ఓ అజరామరం, ఓ మధుర జ్ఞాపకం...

మరి నేడు ఫోటో అంటే ఓ వ్యసనం, ఓ జుగుప్సాకరం, ఓ విచ్చలివిడితనం,
ఫోటో అంటే ఓ పదిహేడేళ్ళు వెనక్కు వెళ్ళాల్సిందే.. ఆ రోజుల్లో జరిగిన సంఘటనలు నేటి వారికి తెలియల్సిందే..

ఫోటో అంటే అమ్మో ఫొటోనే ..!!! అని నోరు బార్లా తెరిచే రోజులవి..
అదేంటో నాకు కెమెరా అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు..
అది అలా ఉండగా ఓరోజు టూర్ కి వెళ్ళాల్సి వచ్చింది.. కెమెరా కొనుక్కోవడానికి డబ్బులన్నీ పోగేసి చూస్తే డిపాజిట్ కూడా రాలేదు... ఎలారా భగవంతుడా అనుకుంటూ ఉండగా..

మేము వెళ్ళే టూర్ లొ కన్యాకుమారి ఉన్నట్లు లిస్టు లొ గమనించాను.. అక్కడ ఈ ఎలక్ట్రిక్ వస్తువులు చాలా తక్కువ ధరకు వస్తాయని విన్నాను.. ఇక నాని బుర్రలో ఒక్కసారిగా వంద ఆలోచనలు పరుగులు తీసాయి..

మొత్తానికి అనుకున్నట్లే కన్యాకుమారి రానే వచ్చాం... సైట్ సీయింగ్, గుడి, గోపురాలు, పూజా పునస్కారాలు ముగించుకొని ఆ చల్లని సంధ్యాస్తమ సమయంలో సముద్ర తీర అంచులలో వున్నటువంటి షాపులలో ఇంట్లో వాళ్ళను ఎలాగోలా గోల పెట్టి మొత్తానికి నాకిష్టమైన బ్లాక్ అండ్ గ్రే కలర్ “కొడాక్ కెమెరా” కొన్నాను.. ట్రిప్ అంతా అయిపోయేవరకు దానిలో సెల్ లేకున్నా రీల్ లేకున్నా చేతిలోనే పెట్టుకు తిరిగాను..

ఇంటికి వచ్చాక ఎలా అయినా ఫోటో తీయాలనే కోరిక, అది ఎలా వస్తుందో అన్న ఆతృత బలంగా నాటుకుని ఉంది.. మళ్ళి పాకెట్ మనీ దాచడం మొదలు పెట్టాను.. దానికన్నా ముందు ఓ పెద్ద స్కెచ్ వేశాను.. అదేంటంటే ఫిల్మ్ కొనాలంటే రెండు రకాలు ఉండేవి..
1 కొనికా
2. కొడాక్
బ్లూ కలర్ లొ కొనికా ఫిల్మ్ 67 రూపాయలకు వచ్చేది... ఎల్లో కలర్ లొ కొడాక్ ఫిల్మ్ 77 రూపాయలు వుండేది .. ఏది కొందామా అని మళ్ళి ఆలోచన..
పది రూపాయల దగ్గర ఎందుకు ఆలోచించడం అది ఖరీదు ఎక్కువ అంటే అది మంచిదేమో, ఎలా తీసినా ఫోటోలు కొంచం బాగా క్లారిటీ గా వస్తాయేమో అనే ఆలోచనతో కొడాక్ ఫిల్మ్ కి ఓ 77 రూపాయలు కెమెరా సెల్స్ కి ఓ 14 రూపాయలు (నిప్పో సెల్ అప్పుడు ఒకటి 7 రూపాయలు వుండేది)
14+77= 91 రూపాయలు కావాలి..

రోజుకు 5 రూపాయలు లెక్కన 19 రోజులు గట్టిగా దాచాలి అని పట్టుబట్టి 95 రూపాయలు దాచాను..

అనుకున్నట్లే ఫిల్మ్, సెల్స్ కొన్నాను.. సెల్స్ అయితే నేను వేసాను కాని ఫిల్మ్ ఎలా పడితే అలా పెడితే ఫొటోస్ సరిగా రావని నాకు బాగా తెలుసు అందుకే తెలిసిన ఓ ఫోటో స్టూడియో అన్న దగ్గరకు వెళ్ళి ఇచ్చాను.. అతను ఆపరేషన్ చేసే డాక్టర్ లా ఫోస్ కొడుతూ డార్క్ రూంలోకి నా కెమెరా, ఫిల్మ్ తీసుకుపోయాడు.. ఓ పది నిమిషాల అనంతరం బయటకు వచ్చి నా చేతిలో ఫిల్మ్ కి సంబంధించిన ప్లాస్టిక్ డబ్బా, నా కెమెరా పెట్టి శాంపిల్ ఫోటో ఒకటి తీసి చూడు ఎలా వుందో అని అన్నాడు...

మొదటి సారి నా స్వంత కెమెరాతో నేను ఫోటో తీయబోతున్నాననే ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది..
అది శాంపిల్ ఫొటోనే కాని ఎంటో ఆ ఆనందం..

దీనికి ఎంత ఇవ్వాలి ?? అని అడిగితే రేపు ఫిల్మ్ కడిగించడానికి వస్తావ్ కదా అప్పుడు తీసుకుంటాలే .. ఇప్పుడేమీ వద్దు అని అన్నాడు..

ఇక నా రెండూ కాళ్ళు నేలమీద నిలవలేదు.. పెరుగేత్తుకుంటూ ఇంటికి వెళ్లాను.. ఇంట్లో అందరినీ హడావిడి చేసి నిలబెట్టాను.. అప్పటికే సమయం ఆరుంపావు మెల్లిగా చీకటి పడుతోంది.. పడాలనే నా కోరిక కూడా..
ఎందుకంటె కెమెరా నుంచి వచ్చే తెల్లని లైట్ వెలుగును చూడాలంటే బలే ఇష్టం వుండేది...

అందరినీ నిలబెట్టి మొదటి ఫోటో క్లిక్ చేసాను.. అది ఓ అద్బుతమైన క్షణం నా జీవితంలో .. నేను అనుకున్న దానికన్నా వెలుగు చాలా ఎక్కువగానే వచ్చింది.. కచక్ మనే శబ్దం తో లోపలున్న ఫిల్మ్ ఒక క్షణం రోల్ అయ్యి ఆగింది.. ఈ కెమెరా కు వున్న ప్రత్యేకత అదే.. మనం తిప్పనవసరం లేకుండానే అదే తిరుగుతుంది... కొన్ని అలా కాదు.. ఫోటో తీసిన తరువాత రైట్ సైడ్ లొ ఓ లాక్ లా ఇచ్చేవాడు.. దాన్ని ప్రతీసారి తిప్పాల్సి ఉంటుంది.. మొదటి ఫోటో తీసిన వెంటనే అందరూ వెళ్తుంటే ఇది శాంపిల్ ఫోటో బాగా రాదు.. ఇక మీదట వచ్చేవి బాగుంటాయ్ అని చెప్పి మళ్ళి నిలబడమన్నాను... మళ్ళి మరో క్లిక్ మని ఫోటో తీశాను.. అదే ఆనందం నా ముఖములో.. ఒక ఫిల్మ్ లొ 37 ఫోటో లు వుంటాయి.. అందులో 36 లేదా 35 ఖచ్చితంగా వస్తాయి.. ఇంకా నా చేతిలో 35 ఫోటోలు వున్నాయని ఆ కెమెరాను జాగ్రత్తగా దాచుకుంటూ ముఖ్యమైన ఫోటోలు మాత్రమే తీసుకుంటూ ఉండేవాడిని... అలా నెల రోజులు గడిచాయి.. మొత్తం ఫోటోలు అన్నీ అయిపోయాయి ఇక డెవలప్పింగ్ చేయించాలి.. దానికి 20 ఖర్చు అవుతుంది.. తరువాత మాక్సి ఫొటోస్ చెయ్యించాలంటే ఒక్కో ఫోటో కి 5 రూపాయలు ఖర్చు అవుతుంది.. ఈ తతంగం అంతా జరిగి తీసుకున్న ఫోటో కళ్ళారా చూడాలంటే కనీసం నెల రోజులు పడుతుంది ... అప్పటికప్పుడు త్వరగా కావాలంటే 3 రోజులు పడుతుంది..
మరి ఇప్పుడు ??
సెల్ఫీ ప్రపంచం..
అరచేతిలో అంతా కనపడిపోతోంది..
అరనిమిషంలో అంతా అయిపోతోంది ..
పోకిరోడు పైట లాగినా సెల్ఫీ నే..
పడుచుపిల్ల మూతి తిప్పినా సెల్ఫీ నే..
ముసలోడు మూల్గినా సెల్ఫీ నే..
పాడిమీద సెల్ఫీ నే, ప్యారిస్ లోనా సెల్ఫీ నే..
జననం నుంచి మరణం వరకు అంతా సెల్ఫీ నే ..

నిజానికి దీని పర్యవసానం వల్ల మంచి సంగతి పక్కన పెడితే చిన్న చిన్న ఆనందాలకు చాలా దూరం అయిపోతున్నారని మాత్రం చెప్పొచ్చు.. ఈరోజుల్లో ఫోటోలతోనే సగం జీవితం గడిచిపోతుంది.. ఆరోజుల్లో ఫోటోలను చూస్తూ జీవితాలు గడిపేసేవారు.. ఈరోజుల్లో gb లకు gb లు మెమరీ పెంచుకుంటూ మీరు తీసే ఫోటోలు మరుగున పడిపోతున్నాయి తప్ప నిజమైన ఆనందాన్ని కలిగించట్లేదని చెప్పొచ్చు..

మీకు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి..

మీరు ఇన్ని ఫోటోలు తీస్తున్నారు.. కనీసం వాటన్నిటినీ తృప్తిగా చూసుకోగలరా ??
చూసుకుందాం లే ఎప్పటికైనా అనే ఉద్దేశ్యంతో మీరేమో ప్రతీ జ్ఞాపకాన్ని సరిగా కళ్ళతో చూడకుండానే కెమెరాలో బంధించేస్తున్నారు అవేమో మరుగునపడిపోతున్నాయి ..

ఈరోజుల్లోని కళ్ళు నిజ అందాలకు నోచుకోవట్లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు... ప్లాస్టిక్ ప్రపంచంలో ప్లాస్టిక్ నవ్వులతో బ్రతికేస్తున్నాం..బ్రతికేద్దాం ...

Written by : Bobby Nani

No comments:

Post a Comment