Friday, March 31, 2017

ఓ ప్రాణం ఖరీదు ...



ఓ ప్రాణం ఖరీదు ... 
*************

నెల్లూరు నగరంలో రెండు నెలల క్రితం జరిగిన ఓ యదార్ధ సంఘటన... ఒక్క నెల్లూరు లోనే కాదు మీ చుట్టుప్రక్కల కూడా ఎక్కడో ఒక మూల, ఏదోఒక చోట నిత్యం జరుగుతూ ఉండే సంఘటనలే ఇవి.. చిత్రం ఏంటంటే వీటిని మనం పట్టించుకోము.. అందుకే ఇవి మనదాకా రావు.. 

“వేణు” ఓ పన్నెండేళ్ళ కుర్రాడు.. చురుకైన వాడు.. తెలివైనవాడు కూడాను.. వారిది ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబం.. తన 10 వ ఏట వారి తండ్రి హటాన్మరణంతో ఆ కుటుంబం ఒక్కసారిగా శోకసముద్రంలో మునిగిపోయింది.... దిక్కుతోచని స్థితిలో చిక్కుకుపోయింది.. అప్పటివరకు బుడి బుడి నడకలతో స్కూల్ కి వెళ్తున్న ఇద్దరు చిన్నారులు ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది.. 

రోజులు గడుస్తున్నాయి.. 
అప్పులు పెరుగుతున్నాయి.. 
బంధువులు ముఖం చాటేశారు.. 

కుటుంబ భారాన్ని ఆ గృహిణి తన భుజస్కంధాలపై మోయాల్సిన పరిస్థితి వచ్చింది... ప్రేమ వివాహం కావడం చేత ఆ గృహిణి వారి పుట్టింటి వారిని ఆశ్రయించాలని అనుకున్నప్పటికీ మరలా కాసేపటికి వద్దు అనే నిర్ణయానికి వచ్చింది .. ఎందుకంటె ?? 

అప్పటినుంచి ఇప్పటివరకు వీరు ఎక్కడ ఉంటున్నారన్న విషయం కూడా వారి పుట్టినింటి వారికి తెలియదు... ఇప్పుడు ఏ మొహంతో వారిని సహాయం అడగాలని అనుకొని ఇలాంటి నిర్ణయం తీసుకుంది.. తనే ఓ కాడెద్దులా మారింది.. తనకు తెలిసిన వంటలన్నీ చేసి విక్రయించేది... అలా వస్తున్న డబ్బుతో కుటుంబ పోషణ జరుగుతూ వుండేది.. కాని అప్పులు మాత్రం అలానే వుండేవి.. అంతై .. అంతకు మూడింతలై ఆ అప్పులు పెరుగుతూ పోతున్నాయి.. 

చేతికి ఇంకా ఎదిగిరాని రేపటి కొడుకు భవిష్యత్తు .. 
ఆటలు, అల్లరి తప్ప మరేమీ తెలియని చిట్టితల్లి.. 
వీరి ఇద్దరి భవిష్యత్తును చూసి ప్రతీ రాత్రి ఆ గృహిణి తల్లడిల్లిపోయేది .. తలమునకలైపోయేది .. కంటివెంట నీరు ఆనకట్ట తెగిన ప్రవాహ ధారలా ప్రవహిస్తూనే ఉండేవి.. అది చూసిన వేణు చలించిపోయాడు.. ఆ వయస్సులోనే తల్లికి చేయూతనివ్వాలని నిర్ణయించుకున్నాడు.. 

ఉదయాన్నే లేచి వారి వీధి చివరన ఉన్న స్టోర్ లో పనికి చేరాడు... వారి తండ్రి గారిపై ఉన్న అభిమానం.. ఆ కుటుంబం పై వున్న జాలితో ఆ యజమాని తనని అడిగిన వెంటనే పనిలో చేర్చుకున్నాడు.. అమ్మకు చెప్పి వస్తానని చెప్పి తన తల్లిదగ్గరకు వచ్చి విషయం చెప్పాడు.. తన తల్లికి ఇష్టం లేకపోయినప్పటికీ ఇక తప్పనిసరిపరిస్థితులలో ఒప్పుకోవాల్సి వచ్చింది.. 

ఇక ఆరోజునుంచి వేణు తన కుటుంబ పరిస్థితులను మోయుటలో భాగం పంచుకున్నాడు... అప్పులవారు వచ్చి అడుగుతుంటే వేణు నే వారికి సర్దిచెప్పి పంపేవాడు.. అలా ఇక అప్పులవారు తన తల్లిజోలికి రాకుండా ఆ భారాన్ని, బాధను తనే తీసుకున్నాడు... తల్లి విడిచిన కన్నీటి బొట్టులా తను మారాడు.. 

6 నెలల తరువాత తన తల్లి సహాయంతో ఓ చిరు “టిఫిన్ షాప్” వ్యాపారం మొదలు పెట్టాడు.. సంవత్సరం అయింది .. నష్టాలు తప్ప లాభాలు రాలేదు.. చిన్నగా వేణులో ఒత్తిడి తారాస్థాయికి వెళ్తోంది.. అందరికీ సహాయం కోసం అడిగాడు .. కానీ ఎవ్వరూ సాయం చెయ్యకపోగా నానా దుర్భాషలాడి ఆ పసి మనసును కోలుకోలేని గాయాన్ని చేసారు.. బాబాయ్ అంటూ, పెదనాన్నా అంటూ.. అత్తా అంటూ వరసలు కలిపి పిలిస్తే బాగోదు అని నిర్దాక్షిణ్యంగా చెప్పిన బంధువుల మాటలకు మరింత కృంగిపోయాడు.. వ్యాపారంలో నష్టం కన్నా వారి మాటలు మరింత ఒత్తిడికి లోను చేసింది.. ఇది ఇలా ఉండగా మరోపక్క అప్పులవారి ఒత్తిడితో తట్టులేక విలవిలలాడిపోయాడు ఆ పసివాడు.. “ఎద్దు పుండు కాకికి ఫలహారం” అనే మాట తన విషయంలో రుజువైందని భావించాడు.. ఎలాగోలా పోరాడదాం అనుకున్న వేణు ... విధి వెక్కిరింతలకు తలవంచాడు... ఓడిపోయానని ఒప్పుకొని, ఆ రాత్రివేళ తన తల్లి కాళ్ళకు నమస్కరించి, తన చెల్లెలకో ముద్దు ఇచ్చి, కన్నిటినిండా నీరు నింపుకొని ప్రాణాలు విడిచాడు... 

ఓ చిరు జీవితం చిదిమేయబడింది.. 
ఓ పసి మొగ్గ రాలిపోయింది.. 
రేపటి అధ్యాయం నేడు ముగిసిపోయింది.. 

ఆ తల్లి గుండె మూగబోయింది.. ఓ కుటుంబం కకావికలైపోయింది.. 
ఇంతకీ వేణుకు వున్న అప్పు ఎంతో తెలుసా ??
అక్షరాలా ఒక్క లక్ష రూపాయలు... 

వేణు దేహం ముందు... ఏడుస్తున్న తన తల్లి దగ్గరకు వచ్చి వారి బంధువులు ఏమన్నారో తెలుసా..?? 
తలో కొంచం వేసుకున్నా వాడికి ఈ గతి పట్టేది కాదు అంటూ వారు కన్నీరు పెట్టుకున్నారు.. నిజానికి వారు బాధతోనే ఏడుస్తున్నారు.. కాని ఆ బాధ మనిషి లేనప్పుడు ఉపయోగం ఎందుకు ?? ఉన్నప్పుడు గుర్తించలేని బాధ ఇప్పుడెందుకు.. 

నేను కూడా అనుకున్నాను అప్పు అయినా తెచ్చి వాడికి ఇచ్చేవాడినే .. ఎందుకు ఇలా చేసాడు ?? ఏమి చూడకుండానే బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్నాడే అని.. 

నిజాలు మాట్లాడుకుందాం.. 

వేణు నిజంగా వచ్చి మనల్ని ఆ క్షణం లో అడిగివుంటే నిజంగా మనం చేసేవారిమా.. ?? చెయ్యము.. 
అప్పుడు మనకు తన చావు కనపడలేదు.. ఇప్పుడు తన చావు చూసి హృదయం ద్రవీకరించింది అందుకే ఏమైనా చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది.. 

ఇలా ఆలోచించి ముందుగానే ఎవరైనా సాయం చేసుంటే తను గంతులేస్తూ తిరుగుతూ ఉండేవాడు కదా.. 
“చెయ్యి దాటిన ఆలోచన నిరుపయోగం” 
అలా అని అందరికీ చెయ్యమని చెప్పట్లేదు.. చేసే సాయం ఏదైనా ఆ చేయించుకునే వాడి స్థితిగతులను తెలుసుకొని చెయ్యమని విన్నపం.. 

ఓ ప్రాణం ఖరీదు ఒక లక్షే నా.. ఈ మాట నన్ను మరింత బాధపెడుతోంది.. 
ఏంటో రాస్తున్న నాకే అక్షరాలు కనపడక కళ్ళనిండా నీరు చేరిపోయాయి.. మీకెలావుందో మరి.. 

స్వస్తి.. ___/\___


Written by : Bobby Nani

No comments:

Post a Comment