Monday, March 6, 2017

అబలా ?? లేక సబలా ??



ఇది కవితనుకుంటారో.. కావ్యమనుకుంటారో, లేక ఈ మగఁడు ఆవేదననుకుంటారో ఇక మీ ఇష్టం.. మస్తిష్కం నుంచి వెలువడిన మాటలు కాదు.. హృదయ లో లోతుల్లో నుంచి ఉబికిన వాస్తవాలు.. దయచేసి ఓ 5 నిమిషముల కాలమును వెచ్చించి చదవమని మనవి.. 


అబలా ?? లేక సబలా ??
******************

ఈ పురుషాధిక్య ప్రపంచం నీవు అబలవంటూ 
కష్టాలనేవి నీ ఖర్మలంటూ.. నీ
వదనమే వేదనా నిలయమంటూ..
సీత గీత దాటి .. నాడు కష్టాల పాలయ్యిందంటూ, 
నాలుగు గోడల మధ్యన నిను బంధీ చేస్తుంటే...!
లక్షల ఖరీదు చేసి నీవు కొన్న వరుడు
నిను కీలు బొమ్మను చేసి నలిపేస్తుంటే..! నీ, 
ఉనికిని మటుమాయం చేస్తుంటే.. !
పురాణాల్లో పూజించబడ్డ నీవు, 
ఆదిపరాశక్తి వంటూ ఆలాపించబడ్డ నీవు, 
కన్నీళ్ళతోనే నీ కడుపును నింపుకుంటూ, 
బాధల సుడిగుండంలో భారంగా బ్రతుకీడుస్తూ.. 
కాటేసిన కాలంపై... కసిగా ఎన్నాళ్లుంటావ్ ?? 
కలలను మింగిన కళ్ళకు .. అలసట నెన్నాళ్ళిస్తావ్ ?? 
అడవికి వెన్నెలనిస్తూ ... బ్రతుకెందుకు హారతి చేస్తావ్ ?? 
లే .. 
లేచి కదులు.. 
నాజూకైన నడుమొంపులు కాదు 
నరాలు తెంచే నాంచారులా కదులు.. 
ఎలుగెత్తే స్వరం నీవై.. 
ఆకాశంలో సగం నీవై.. 
పోటెత్తిన సముద్రపుటలవై..
ఉదయించే అరునవర్ణమువై..
రౌద్ర నేత్ర జ్వాలలవై..
కాటేసే కాల నాగువై.. 
అహంకార గర్వమదాంధుల 
పీకమణచగ కదలిరావే.. 
ముందుకు కదలిరావే.. 
నీ ఉనికి జగతికి చాటఁగా
అబలవై కాదు... 
స...బ...ల...వై...
ఈ అవస్థల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చెయ్యఁగ ..
అందరూ సమానమంటూ నూతన అధ్యాయానికి పునాది వెయ్యగ రా.. 
కదలి రా.. 

“స్త్రీ” ని అనంతశక్తితో పోలుస్తాం... స్త్రీ లోని గొప్ప లక్షణం సహనం... పుడమితల్లికి ఉన్నంత సహనం ఆమెకు వుంది అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు... ఆమె ఇది ఎక్కడనుండో తెచ్చిపెట్టుకున్న లక్షణం కాదు, ప్రకృతి పరంగా తనలో ఉన్న లక్షణం. ఈ సహనంతో ఆమె సాధించ లేనిది లేదు. సంసారం, రాజకీయం, సంఘసంస్కరణ, చదువు, ఆరోగ్యం, శాస్త్రం, చట్టం మొదలగు క్షేత్రాలలో చదువు వల్ల వచ్చే సామర్థ్యతలతో సాధించే కార్యాలే కాకుండా అనుభవం, ధైర్యం, తెలివీ, త్యాగభావం వల్ల వచ్చే యొగ్యతలతో సాధించే కార్యాలు కూడా ఆమె మహిమను చాటి చెప్పే సందర్భాలు అనేకం ఉన్నాయని మనం మరువకూడదు... 

స్త్రీ తనని తాను సంస్కరించుకుంటూ ఇంటినీ, పిల్లల్నీ, తన బాధ్యతలనీ, బరువుల్నీ, ఇరుగుపొరుగుల్నీ అన్నీ ఒక తాటిమీద నడిపే శక్తి గలది. అందుకే ఆమె మహాశక్తి స్వరూపం అన్నారు.. ఓ సహోదరిగా, ఓ భార్యగా, ఓ తల్లిగా తన బాధ్యతలను నిరంతరం నిర్వర్తించే శక్తి గలది ఈ ప్రేమ మూర్తి.. సహజసిద్ధంగా ఆమె ఏదైనా సరే కాదనక పంచి ఇచ్చే గుణం కలది. ఆహారం, సేవ, సంస్కారం, మంచిచెడుల విచక్షణా జ్ఞానం కుటుంబ సభ్యులందరికీ ఎప్పటికప్పుడు పంచిపెడుతూ పిల్లలని క్రమశిక్షణలో ఉంచుతూ భావి పౌరులుగా తీర్చి దిద్దగల నేర్పరి. ఇటువంటి బరువు బాధ్యతలని పూర్తి చేస్తూ కూడా తనని తాను అబల కాదు సబల అని నిరూపించుకోగల సమర్థురాలు అని చెప్పడానికి ఆది నుండి ఇప్పటి వరుకూ అనేక ఉదాహరణలున్నాయి....

ఓ రజియా సుల్తానా, ఓ ఝాన్సీ లక్ష్మీబాయి, ఓ ధాయి పన్నా, ఓ మథర్ థెరీసా, ఓ విజయలక్ష్మి పండిత్, ఓ లక్ష్మి సహగల్, ఓ ఎనీ బిసెంట్, ఓ ఇందిరా గాంధీ, మొదలగు వారందరూ ఎటువంటి విషమ పరిస్థితులను ఎదుర్కొంటూ తమని తాము సబలలుగా నిరూపించుకున్నారో మనకు తెలిసిన విషయమే.. సునీతా విలియమ్స్, కిరణ్ బేడీ, జయలలిత, మాయావతి, మమతా బెనర్జీలు కూడా మనకు ఉదాహరణలే.... 

ప్రతి సంపూర్ణమైన పురుషుడి వెనకాల ఒక స్త్రీ తప్పక ఉంటుంది. ఆ స్త్రీ వెనకాల దాగి ఉన్న ఓర్పూ, నేర్పూ, బాధ్యతా, త్యాగం అనేవి దాగి ఉన్నందున పురుషుడు ఎప్పటికప్పుడు సఫలీకృతుడౌతున్నాడు. ఈ ఆధునిక ప్రపంచంలో ఎన్నో ఆటుపోట్లను ఎదురుకోంటూ తమని తాము రక్షించుకుంటూ తమ ఇంటినీ, తమ పిల్లలనీ మాత్రమే కాకుండా తమలోని సంస్కారాన్ని సంప్రదాయాలనీ కూడా రక్షించు కుంటూ ముందుకు పోతున్న స్త్రీకి నా పాదాభివందనం ... 

ఇవన్నీ వింటున్న, చదువుతున్న నా పౌరుష జాతికి ఈ మాటలు చివుక్కు చివుక్కుమనొచ్చు .. ఎవరిగురించో ఎందుకు నిన్ను ఈనాడు ఇలా నిలబెట్టిన నీ తల్లి నీకు కనపడట్లేదా.. ?? ఒక్కసారి ఆలోచించు.. 

నిన్ను ఈ పరిస్థితికి తీసుకురావడానికి ఆమె ఎన్నిసార్లు తలవంచి ఉంటుందో.. 

ఎన్ని కన్నీటి అశ్రువులను నేల రాల్చి ఉంటుందో, 

ఎన్ని కన్నీటి రాత్రులను అనుభవించి ఉంటుందో కదా... 

నువ్వు కడుపులో పడిన మొదలు ఈ క్షణం వరకు నీ వల్ల ఎన్ని సార్లు బాధపడి ఉంటుందో.. 

నిజానికి ఆమె... నీ బాధను కూడా మధురంగా అనుభవించే మహా మాతృ మూర్తి.. 

నీ పుట్టుక మూల స్థానం ఏంటో నీవు గ్రహిస్తే స్త్రీ ని దూషించవు.. 

మర్మ స్థానం మాత్రమే కనపడే నీ నేత్రాలకు మాతృ స్థానం కనిపించిన రోజునే నువ్వు నిజమైన మగాడివి అవుతావు..

స్వస్తి __/\__
  
Written by : Bobby

No comments:

Post a Comment