ఆ రోజు… మాఘమాస శుక్ల తృతీయ...
వేకువ వెలుగులు ఇంకా గోకుల వీధుల గుమ్మాల దాకా చేరకమునుపే… యమునాతీరపు మబ్బుల్ని చీల్చుకుంటూ ఒక నిశ్శబ్ద ఉదయం మెల్లిగా పుట్టుకొస్తోంది. గోవుల ఊపిరిలోంచి లేచే ఆవిరి, పచ్చిక మీద జారిన మంచుబిందువులు, మట్టివాసనతో కలిసిన వెన్నసుగంధం అన్నీ కలసి ఒక మృదువైన గీతంలా ఆ ప్రాతఃకాలాన్ని ఎంతో అందంగా అలంకరిస్తున్నాయి.
ఇంటి ఆవరణలో యశోద మజ్జిగ మథనంలో నిమగ్నమై, తన చేతుల్లో చిలకరించే మథనదండం లయబద్ధంగా తిరుగుతుండగా, ఆమె పెదవులపై నెమ్మదిగా జారే గీతం ఆ ఇంటి ఆవరణానికి ప్రాణం పోస్తోంది. కుండలో పెరుగును చిలికే ప్రతి చక్రం ఆమె ప్రేమను వెన్నగా మలుస్తున్నట్లుగా ఉంది ఆ కమనీయ దృశ్యం.
అప్పుడే… గుమ్మం వెలుపల చిన్న చిన్న అడుగుల శబ్దం. చిలిపి నవ్వులు. గుసగుసల కేరింతలు
వాటి మధ్యలో చిన్నగా మెరుస్తున్న బంధూక పుష్పము వంటి నయనాలు..
అతడు ఎవరో కాదు కన్నయ్య..
రోజూ కంటే ఆ రోజు అతడి చూపుల్లో చిలిపితనం ఎక్కువ అయింది. ఇవాళ అందరి ఇళ్ళలో కుండలు ఖాళీ చేయకపోతే నా పేరు కృష్ణుడే కాదు అన్నట్టుగా తన స్నేహితులకు కళ్లతోనే సైగ చేసాడు. చెట్ల నీడల్లో దాక్కుంటూ, గోడల వెంట జారుకుంటూ, నిశ్శబ్దాన్ని కూడా మోసం చేస్తూ వాళ్లు అందరూ ముందుకు కదిలారు. ఓ ఇంటి చూరు మీద వేలాడుతున్న కుండలు ఆకాశంలో తారల్లా మెరుస్తున్నాయి. కింద నిలబడ్డ పిల్లలు ఒకరిపై ఒకరు ఎక్కి మానవ గోపురం కట్టారు. చివరగా పైకి ఎక్కింది మాత్రం ఆ నల్లనివాడే.. అతని వేళ్లు కుండను తాకిన క్షణం… ఆ మట్టి పాత్రలో దాగి ఉన్న సుగంధం అక్కడి గాలంతా పరుచుకుంది.
దూరంగా ఎవరో ఓ గోపిక ఇదంతా గమనించి .. అయ్యో… అయ్యో.. మళ్లీ నీ అల్లరి మొదలుపెట్టావా .. అంటూ పరుగు తీసింది. కానీ ఆమె మాటలో కోపం కన్నా కన్నయ్యను గట్టిగా పట్టుకోవాలనే ఆశే ఎక్కువ.
కృష్ణుడు కుండను పగలగొట్టకుండా మెల్లగా తెరిచాడు. లోపలున్న వెన్నను చూస్తూ… ఒక క్షణం నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. ఆ వెన్న తెల్లగా కాకుండా అది గోపికల ప్రేమతో నిండిన చంద్రబింబంలా కనిపించింది.
అతను ఒక ముద్ద తీసుకున్నాడు. మరొకటి తన కింద ఉన్న స్నేహితుడికి అందిచ్చాడు.
మరొక ముద్దను కిందకు విసిరాడు కోతులు కూడా ఆ అల్లరిలో భాగమయ్యాయి.
అంతే అక్కడ భళ్ళుమని నవ్వులు విరిసాయి. వారి అల్లరికి అక్కడి గాలి కూడా పువ్వులా వికసించింది. అప్పటికే ఆ ఇంటి గుమ్మం దగ్గర గోపికలు అందరూ చేరుకున్నారు.. ఇక ఒక్క క్షణంలో కన్నయ్య, వారి స్నేహితులు తలోదిక్కూ వెళ్ళిపోయారు.
ఇదిగో… అమ్మా.. యశోదా మళ్లీ వచ్చేశాడు నీ కొడుకు! అంటూ ఆమెకు మొరపెట్టుకున్నారు.
యశోదమ్మ బయటికి పరుగెత్తుకుంటూ వచ్చింది.. కృష్ణుడు ఏమి ఎరుగని అమాయకుడిలా ఇంటి వెలుపలనుంచి అమ్మ వెనుకనే నిలబడ్డాడు.. పెదవులకు అంటిన కమ్మటి వెన్న ఇంకా అలానే ఉంది. అది చూసిన యశోద అతడిని గట్టిగా పట్టుకుని ..
కృష్ణా! అని గట్టిగా పిలిచిన ఆమె స్వరంలో కోపం ఉన్నా…అందులో దాగి ఉన్న ప్రేమను మాత్రం గోకులమే వినగలిగింది.
పట్టుబడ్డానని గ్రహించిన కృష్ణుడు ఒక్కసారిగా తప్పించుకుని పరుగెత్తాడు.
వెనక నుంచి యశోదమ్మ.
ఆ దృశ్యాన్ని చూసిన చుట్టూ ఉన్న గోపికల నవ్వులతో ఆ బృందావనం మారింత అందంగా మారిపోగా చివరకు యశోదమ్మ అతడిని పట్టుకుంది. పెదవులకు అంటివున్న వెన్నను చూసి కోపంగా అడిగింది..
ఇది ఎవరి వెన్న?
కృష్ణుడు మౌనంగా ఆమెను చూసాడు. అతని కళ్లలో ఒక చిలిపి వెలుగు. ఒక నిర్దోషి నవ్వు రెండూ కనిపించాయి.
అమ్మా… ఈ వెన్న నాది కాదు…కానీ నాకోసమే అక్కడ పెట్టారు..
ఆమాటతో యశోదమ్మ కోపం కరిగిపోయింది. అతని చెంపలపై ఉన్న వెన్నను తన చీర కొంగుతో తుడుస్తూ…కన్నయ్యా.. మన ఇంట్లో ఇంత వెన్న ఉండగా వాళ్ళింట్లో వెన్న మనకెందుకయ్యా !
ఆ మాఘమాస శుక్ల తృతీయ ఉదయం…గోకులం ఒక అల్లరిని చూసింది. కానీ ఆ అల్లరిలో దాగి ఉన్నది మాత్రం ..ప్రేమను దొంగిలించే పరమాత్ముడి లీల...
ఇది ఇంకా ఇలానే కొనసాగాలంటే మీ అమూల్యమైన మాటలను అక్షర రూపంలో తెలపండి..
~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:
Post a Comment