Friday, May 22, 2026

నచికేతుడు (1వ అధ్యాయము)

 


మన పురాతన ఉపనిషత్తుల అనంత జ్ఞాన సముద్రం నుండి సేకరించిన కొన్ని విషయాలను, ఒక తాత్విక వ్యాస రూపంలో నేను ఇక్కడ మీ ముందుంచుతున్నాను. ముఖ్యంగా ఈ రోజుల్లోని గందరగోళపు ఆలోచనల్లో బ్రతుకుతున్న నేటి తరం అత్యంత అవసరంగా చదివి అర్ధం చేసుకోవాల్సిన పరమ సత్యాలివి.

ఆ ఉపనిషత్ గర్భంలో దాగి ఉన్న సంస్కృత శ్లోకాలను యథావిధిగా ఇక్కడ పొందుపరిస్తే, అవి అందరికీ అంత సులభంగా అర్థం కాకపోవచ్చు. అందుకే, ఆ శ్లోకాల వెనుక ఉన్న లోతైన అంతరార్థాన్ని, నాదైన శైలిలో వాటికి భావుకతను అద్దుతూ, చదువుతున్న మీ కళ్ళముందు కదలాడే ఒక సజీవమైన సన్నివేశంగా సృష్టించి మీ ముందుకు తీసుకువచ్చాను.

ఇది మీ అంతరంగాన్ని మీరు దర్శించుకోవడం కోసం నేను చేసిన ఒక చిన్న అక్షర ప్రయోగం. చదివి, మీ గుండెకు తాకిన ఆ అనుభూతిని నాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను.

నచికేతుడు (1వ అధ్యాయము)
************************
ఆ రోజు… ఆశ్వయుజ మాస కృష్ణ పక్ష చతుర్దశి… సంధ్యా సమయం నెమ్మదిగా అరణ్యంపై తన చీకటి రెక్కలను విప్పుతోంది. యజ్ఞవాటిక మధ్యలో మండుతున్న అగ్నికుండం…దాని నుంచి పైకెగసే పొగ… ఆకాశంలో మౌనంగా కదిలే మేఘాలతో కలిసిపోతోంది.

వాజశ్రవసుడు యజ్ఞంలో భాగంగా తన వద్ద ఉన్న సంపదను దానం చేస్తున్నాడు. కానీ…అతడు దానం చేస్తున్న ఆవులు వృద్ధమైనవి…పాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి. అది గమనిస్తున్నాడు అతని కుమారుడైన నచికేతుడు. అతని వయసు చిన్నదే… కానీ మనసు మాత్రం అనేక ప్రశ్నలతో నిండిన అరణ్యంలా ఉంది.

అతని కళ్లలో భయం లేదు…ఒక చిత్రమైన ఆలోచన మాత్రమే ఉంది.

దానం అంటే… మనకు పనికిరానిదాన్ని ఇచ్చేయడమా? ఈ ప్రశ్న అతని గుండెలో ముల్లులా గుచ్చుతోంది. తన తండ్రి దగ్గరకు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లాడు.

తండ్రీ ..

వాజశ్రవసుడు యజ్ఞకార్యాల్లో నిమగ్నమై ఉన్నాడు.

ఏమిటి నచికేతా?

మీరు అన్నీ దానం చేస్తున్నారుగా… మరి నన్ను ఎవరికి దానం చేస్తారు?

ఆ మాట వినగానే… చుట్టూ ఉన్న ఋత్వికులు ఒక్కసారి అతని వైపు చూశారు. వాజశ్రవసుడు మొదట నవ్వాడు. బాలుడి అమాయక ప్రశ్న అనుకున్నాడు. కానీ…నచికేతుడు మళ్లీ అడిగాడు.

తండ్రీ… నన్ను ఎవరికి ఇస్తారు?

ఈసారి అతని స్వరంలో అమాయకత్వం కన్నా సత్యాన్ని వెతికే తపన కనిపించింది.
ఆ ప్రశ్న… యజ్ఞాగ్నికంటే ఎక్కువగా వాజశ్రవసుడి అంతరంగాన్ని కాల్చింది.

కోపంతో అతని ముఖం మారిపోయింది.

నిన్నా?…కొన్ని క్షణాలు మౌనం తరువాత మృత్యువుకే ఇస్తాను! పో! అన్నాడు
ఆ మాట అరణ్యంలో చుట్టూ ప్రతిధ్వనించింది. గాలి కూడా ఒక్కసారిగా నిశ్శబ్దమైనట్లు అనిపించింది.

కానీ ఆశ్చర్యం ఏమిటంటే… నచికేతుడు భయపడలేదు. అతడు ఆకాశం వైపు చూశాడు. సంధ్యారాగం పూర్తిగా చీకటిలో కలిసిపోతూ కనిపించింది. అతని చిన్న మనసులో మాత్రం…తన తండ్రి అన్న మృత్యువుకే ఇస్తాను అనే ఒక మహా ప్రశ్న మెదుల్తూనే ఉంది.. మరణం అంటే నిజంగా ఏమిటి? అని ఆలోచించ సాగాడు.

కాసేపటికల్లా ఆకాశమంతా కృష్ణవర్ణ మేఘాలతో నిండిపోయింది. దూరంగా అరణ్య మధ్యలో వినిపించే రాత్రిపక్షుల అరుపులు…చెట్ల కొమ్మల్ని తాకుతూ ప్రవహించే చల్లని గాలి…యజ్ఞవాటికలో మెల్లగా ఆరిపోతున్న అగ్ని… అన్నీ కలిసి ఆ రాత్రిని మరింత చీకటిగా మార్చేశాయి. కానీ…ఆ నిశీధిలో నిద్రపోలేకపోయింది మాత్రం నచికేతుడి మనసే. తండ్రి కోపంలో అన్న మాటను అతడు శాపంగా తీసుకోలేదు… ఒక ప్రశ్నకు తెరచుకున్న ద్వారంలా స్వీకరించాడు.

మృత్యువుకే ఇస్తాను…ఆ మాట అతని చెవుల్లో పదేపదే మార్మోగుతోంది.
అతడు ఆశ్రమం వెనుకనున్న సరస్సు దగ్గరకు నడుచుకుంటూ వెళ్లాడు.

ఆ నీటిమీద చంద్రబింబం గాలి తాకిడికి అలలు కదిలినప్పుడల్లా కదులుతోంది.…ఆ చంద్రుడు విరిగిపోయినట్టుగా కనిపిస్తున్నాడు. నచికేతుడు చాలాసేపు ఆ దృశ్యాన్నే చూస్తూ నిలబడ్డాడు. అప్పుడతని మనసులో ఒక చిత్రమైన ఆలోచన కలిగింది.

చంద్రుడు నిజంగా విరిగిపోయాడా? లేక నీరు కదలడం వల్ల అలా కనిపిస్తుందా?
ఆ ప్రశ్నతోనే అతని అంతరంగంలో మరో ప్రశ్నపురుడుపోసుకుంది.. అయితే… మరణం కూడా అంతేనా?

శరీరం అనే నీరు కదలడం ఆగిపోతే… అందులో కనిపించే జీవం అనే ప్రతిబింబం మాయమవుతుందా? ఇలాంటి ఆలోచనలు అతని చిన్న హృదయంలో అలల్లా ఉప్పొంగుతున్నాయి.

అప్పుడే…

వెనుకనుంచి ఒక స్వరం వినిపించింది.

నచికేతా…

అతడు వెనక్కి తిరిగి చూశాడు.

ఆశ్రమంలోని వృద్ధ ఋషి నిలబడి ఉన్నాడు. తెల్లని జటాలు భుజాలపై జారుతున్నాయి. అతని కళ్లలో వయసు కనిపించట్లేదు …ఏదో లోతైన ప్రశాంతత మాత్రమే ఉంది. ఈ అర్ధరాత్రి ఇక్కడ ఒంటరిగా ఏమి చేస్తున్నావు? అడిగాడు .. నచికేతుడు కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు.

గురుదేవా… మరణం గురించి ఆలోచిస్తున్నాను… ఆ వృద్ధుని పెదవులపై ఒక చిన్న చిరునవ్వు పూసింది.

మరణమా? అది పెద్దవాళ్లను కూడా భయపెట్టే ప్రశ్న కదా.. నీ వయసులో ఉన్న పిల్లలు ఆటల గురించి ఆలోచిస్తారు…నువ్వెందుకు మరణం గురించి ఆలోచిస్తున్నావు? నచికేతుడు సరస్సులోని చంద్రబింబాన్ని చూపించాడు. ఇప్పుడే అది విరిగిపోయినట్టు కనిపించింది గురుదేవా…కానీ నిజానికి చంద్రుడు ఏమీ కాలేదు. అప్పుడు నాకు అనిపించింది…మనిషి చనిపోయినప్పుడు కూడా…నశించేది అతడా? లేక అతడు కనిపించే ఈ శరీరమా?

ఆ ప్రశ్న విన్న వృద్ధ ఋషి కళ్లలో ఒక్కసారిగా ఆశ్చర్యం.. కొన్ని క్షణాలు అతడు మాట్లాడలేదు. అరణ్యం కూడా ఆ రాత్రివేళ మౌనంగా మారింది.. చివరకు అతడు నెమ్మదిగా అన్నాడు:

నచికేతా… నీ మనసులో పుట్టిన ఈ ప్రశ్న…సాధారణ ప్రశ్న కాదు. ఈ ప్రశ్నే ఎన్నో ఋషులను అరణ్యాలకు నడిపించింది. ఈ ప్రశ్నే ఉపనిషత్తులను పుట్టించింది. అంటూ అతడు కాసేపు ఆకాశం వైపు చూశాడు.

శరీరం…కాలంతో కలిసి మారిపోతుంది. బాల్యం… యౌవనం… వృద్ధాప్యం… చివరకు మట్టి కూడా .. కానీ… ఈ మార్పులన్నిటినీ గమనిస్తున్న ఏదో ప్రత్యేకమైనది ఒకటి నీలో దాగి ఉంది. అదే ‘నేను’ అనే అనుభూతి. అది మాత్రం మారలేదుగా? నచికేతుడు నిశ్శబ్దంగా వింటున్నాడు. “ఆ ‘నేను’ ఎవరో తెలుసుకోవడమే… జీవితంలోని గొప్ప అన్వేషణ. సరస్సు మీద గాలి మళ్లీ అలలను పుట్టించింది. చంద్రబింబం మళ్లీ విరిగిపోయినట్టుగా కనిపించింది.

నచికేతా…ఈ లోకంలో చాలామంది జీవిస్తారు…కానీ చాలా తక్కువమంది మాత్రమే నిజంగా ‘జీవితం’ గురించి ప్రశ్నిస్తారు. ఆహారం కోసం, సంపద కోసం, పేరు కోసం పరుగెత్తే మనుషులు అనేకమంది. కానీ… ‘నేను ఎవరు?’ అని తమ అంతరంగాన్ని ప్రశ్నించే వారు మాత్రం అరుదు.

నచికేతుడు మౌనంగా విన్నాడు.

ఆ వృద్ధుని స్వరం ఇప్పుడు అరణ్యంలో ప్రవహించే గాలిలా మృదువుగా పలికింది.. గుర్తుపెట్టుకో నచికేతా…

మరణం గురించి భయపడేవాడు జీవితం అర్థం చేసుకోలేడు. మరణాన్ని ప్రశ్నించగలిగినవాడే… జీవిత సత్యానికి దగ్గరవుతాడు.

ఆ మాటలు విన్న క్షణం…నచికేతుడి చూపు మళ్లీ సరస్సుపై పడింది.

ఇప్పటికే అలలు ప్రశాంతమయ్యాయి. నీటిమీద చంద్రబింబం మళ్లీ సంపూర్ణంగా కనిపిస్తోంది.

అతని హృదయంలో ఏదో తెలియని నిశ్చలత్వం ఆవహించింది.

ఆ రాత్రి… మొట్టమొదటిసారి అతడు గ్రహించాడు.. మనిషి జీవితంలో గొప్ప ప్రయాణాలు బయటి ప్రపంచంలో ప్రారంభం కావు…ఒక ప్రశ్న పుట్టిన క్షణంలోనే అంతరంగంలో ప్రారంభమవుతాయి.దూరంగా యజ్ఞాగ్ని పూర్తిగా ఆరిపోయింది. కానీ… నచికేతుడి అంతరంగంలో మాత్రం ఒక కొత్త అగ్ని అప్పుడే వెలిగింది. అది సాధారణ జిజ్ఞాస కాదు… ఉపనిషత్తులు “ఆత్మ విచారణ” అని పిలిచే ఆ అనంత అన్వేషణకు తొలి జ్వాల.

ఆ చిన్న బాలుడు ఇంకా తెలుసుకోలేదు… త్వరలోనే తాను మృత్యుదేవుడి గడప దాటి వెళ్లబోతున్నాడని…

కాలాన్నే ప్రశ్నించబోతున్నాడని…ప్రపంచానికి శాశ్వతంగా నిలిచిపోయే ఒక మహా సత్యాన్ని తీసుకురాబోతున్నాడని.

కానీ…ఆ రాత్రి అరణ్యం మాత్రం అతని గురించి ముందే తెలుసుకుంది.

అందుకే కాబోలు …ఆకాశంలో దాక్కున్న చంద్రుడు మళ్లీ మేఘాల వెనుకనుంచి బయటికి వచ్చి… నచికేతుడి ముఖంపై తన వెన్నెలను మౌనంగా కుమ్మరించాడు.

~~ త్రిశూల్ ~~

Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:

Post a Comment