Wednesday, January 11, 2023

అమ్మమ్మ గారిల్లు ...


 “సంక్రాంతి” అంటే పండగ కాదు మన జీవన విధానం .. పట్టణాలు వెలవెలబోతాయి.. పల్లెలు పక్కున నవ్వుతాయి..సంక్రాంతి అంటే ఎందరికో ఎన్నో జ్ఞాపకాల పుస్తకం. నాకు కూడా.. అందులో ఓ రెండు పేజీలు మీకోసం..!!

అమ్మమ్మ గారిల్లు
***************

పెద్ద పండుగ అంటే మొదట గుర్తొచ్చేది
అమ్మమ్మ గారి ఇల్లే
నాకు బాగా గుర్తు
తొలిప్రొద్దు నడి వాకిట్లో
జడ గంటల సవ్వడులతో
పావడాల్ని పాదంపై కెగ్గట్టి
పవిటలు సరి చేసుకుంటూ
రంగులు అంటిన ముఖముతో
మురిసిపోతూ ముగ్గులేస్తున్న వనితలను
అల్లరి బావల నిశబ్దపు నవ్వులతో
కిటికీల మాటున దొంగల్లా చూడటం
నాకు ఇంకా గుర్తుంది..!!

పిన్ని పెట్టిన కుంకుడు కాయ నలుగుకు
కళ్ళని నులుముతూ ఏడుస్తున్న
బోసినవ్వుల చంటి బిడ్డలు..!
గాడిపొయ్యి దగ్గర హడావిడిగా
ఘుమఘుమల నువ్వుల అరిసెలు
కాల్చే పెద్దమ్మ పిండివంటలు..!
ఆరుబయట నులకమంచాలపై
ముందురాత్రి వెన్నెల్లో
మాటల మాలలు అల్లుకుంటూ
సందడి చేస్తున్న పడుచు పిన్నిలు..!
ఇంత హడావిడిలో కూడా
ఇంటి మూలనో చోటు కనిపెట్టి
పెకముక్కల్లో పండుగ వెతుక్కుంటూ
చేయివాటం చూపిస్తున్న మామలు, బాబాయ్ లు..!

సంతకు తీసుకెళ్ళి
లెక్కే లేకుండా అడిగినవీ,
అడగనివీ అన్నీ కొనిచ్చే
బుర్రమీసాల తాతయ్య..!

చెడ్డీ వేసుకుతిరిగే బుడ్డోడు దగ్గరనుంచి
చెంగావి చీరల్లో చుక్కల్లా మెరిసే వాళ్ళ వరకు
చిరునవ్వులు చెరగవు
అందరిదీ వెర్రి ప్రేమ
అంతులేని ఆప్యాయత
అవని నుంచి ఆకాశం వరకు
ఆనందమే అలుముకున్న క్షణాలవి..!

అంతేనా

పసిపిల్లలతో పరుగులెత్తే లే దూడ
గుమ్మం దగ్గర వెన్నుల్లి గప్చిప్గా పేరుక్కెళ్ళే గువ్వలు
గంగిరెద్దుల వాని సన్నాయి మేళం
జంగందేవర శంఖారావం
సాతాని జియ్యరు శ్రీహరి గీతాలు
నీకు తొలిజాము మేల్కొలుపు సంగీతాలు..!

భోగి మంటల అరుణిమ
నుదిటి సింధూరమై మెరయ
అభ్యంగ నావిష్కృత కురులు పైకెగయ
ముదమార ముడివేసి
ముంజేతి గాజులు సయ్యాటలాడ
ముత్యాల ముంగిట
ముత్తయిదువుల ఆహ్వానములు..!

వోర వాకిలి వెనుక
వాలు చూపులు సంధించు
వన్నెలాడుల క్రీగంట పరికించి
మధుర భావాల గుండె చప్పుళ్ళ
పరవశించు కొత్త అల్లుళ్ళు ...
మూసిన ప్రణయ
సౌధపు వాకిళ్ళు తెరచి
అలనాటి తొలిరేయి
వలపు కౌగిళ్ళు తలచి
పరవశించిపోయే
ముదుసలి యెవ్వన మామలు..!
అనురాగపు జల్లుల తడిసి
మగని పులకరింతకు జడిసి
లోలోన మురిసిపోయి
ముసిముసిన నవ్వుకునే ముదుసలి అత్తలు..!

కోడి పందాలు,
కోడెల బలాబలాలు
గంగిరెద్దుల నాట్యాలు
కోలాటముల సయ్యాటలు
భగ భగల భోగి పాయసము
పొంగారు పొంగలి
నూరూరు గుత్తి వంకాయ
కమ్మని గుమ్మడి పులుసు
రోటిలోని వేడి వేడి గోంగూర పచ్చడి
జిడ్డు తేలిన
గడ్డ మీగడ పెరుగు..!

పెద్దలనుంచి పిల్లల వరకు ప్రతీ ఒక్కరిని
ఆప్యాయంగా పలకరిస్తూ, బోసినవ్వులు రువ్వే
పాలమనసున్న అమ్మమ్మ ఇప్పుడు లేకపోవచ్చు
కానీ ఆమె జ్ఞాపకాలతో బ్రతికేస్తూ ఈ చిరు అక్షర జల్లు..!!

Written by: Bobby Aniboyina
Mobile: 9032977985

No comments:

Post a Comment