Friday, January 13, 2023

“స్వయంప్రభ" గారి “పూలనిప్పులు” కవితా సంపుటిపై నా అభిప్రాయం



"పూలనిప్పులు" పూలు అంటే మనల్ని తాకే ఓ ఆనందం, నిప్పులు అంటే వెన్నంటే వుండే ఓ వేదన.. జీవితం కూడా సరిగ్గా అలాంటిదే.. మానవ జీవితం ఎప్పుడూ దుఃఖ భూయిష్టమైనది. ఆనందం, వేదన రెండూ పొద్దున పూచిన ప్రభాతమై రాత్రి నిశీథ వేదనతో కలిసిపోయేలా రచయిత్రి ఎంతో గొప్పగా నేర్పుగా వ్రాసారు.

కవిత్వం గుండెలను కుదపాలి.
కవిత్వం మనిషిని కదిలించాలి.
సమాజానికి కాంతిదివిటీగా,
క్రాంతి పథానికి దిక్సూచిగా
కవిత ఆవిర్భూతం కావాలి.
మారుతున్న సమాజ విలువలతోపాటు సాహిత్యపు విలువలూ మారాలి.

“మారేది మార్పించేదే సాహిత్యం”

నాటినుంచి నేటి వరకూ సాహిత్య పరిణామ క్రమ వికాసంలో కవితా రంగంలో కవిత్వతత్త్వంలో పరిశీలనలూ, పరిశోధనలు ప్రక్రియా మందారాలు చిగురించిన ఛందో బద్ధ కవిత్వంనుంచి, వచనా కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర పై గంబర కవితాధోరణులు విప్లవ కవితాతరంగాలు.

భావకవిత్వం, అందులో ఎన్నెన్ని కొత్తగాలులు. మరెన్ని కొత్త గొంతులు ఈ రోజున ఎవరు వప్పుకున్నా, ఔనన్నా కాదన్నా భావకవిత్వమహో ద్యమం మూడు పూలూ ఆరు కాయలుగా విరిసి విప్పారింది.

ఆ అలోచన, ఆ మార్పువలన కవితోద్యమంలొ వచ్చింది కనుకనే తిలక్ గారు, దాశరధి గారు, నారాయణ రెడ్డి గారు, ఎల్లోరా గారు, శేషేంద్రశర్మగారు, సోమసుందర్ గారు ఇలా ఎందరో లబ్ధప్రతిష్ఠులు తమకవితాత్మకు ఉత్తమ కవితా సృష్టినే వాహికముగా మలచుకొని ఆవిష్కరించుకొన్నారు.

ఇక రచయిత్రి "స్వయంప్రభ" గారి గురించి చెప్పాలంటే తీరిక సమయాల్లో ఉబుసుపోక తనలో చెలరేగిన భావాలను కాగితం మీద పరుగెత్తించి, తెల్ల కాగితాన్ని నల్లగా చేయటంతో ప్రారంభించిన "స్వయంప్రభ" గారు కృషీవరులై.. నిత్యసాధనతో ... సమాజంలో వీరంగంచేస్తున్న స్త్రీ అన్యాయాల మీద, అక్రమాల మీద మానవ జాతి లోని పరస్పర వైషమ్యాల మీద - తన “పూలనిప్పులు” వర్షం కురిపించి కవితా శంఖం పూరించి సామాజిక స్పృహ, దేశ శ్రేయస్సు ప్రతీఒక్కరి వారి ప్రథమ కర్తవ్యాలని ఎంతో నేర్పుగా - మన చెవుల్లో గింగురుమనిపించారు.

క్షీర సాగర మథనం ద్వారా లోక కళ్యాణమైన ఎన్నో... మరెన్నో..... అద్భుతాలు, వరాలు ప్రసాదింపబడినట్లే మిత్రులు "స్వయంప్రభ" గారు విరచితమైన "పూలనిప్పులు" ద్వారా యీనాటి సమాజానికి, దాని అభివృద్ధికి ఉపయోగకరమైన, అత్యవసరమైన ప్రబోధాలు (ఓ రకంగా హెచ్చరికలని కూడా చెప్పొచ్చు!) వెలువడ్డాయి.

ఒక విధంగా "స్వయంప్రభ" గారి హృదయానికి, మనస్తత్వానికి దర్పణం యీ “పూలనిప్పులు" తనకే కాకుండా ఎదుటి వారికెవరికైనా సరే ఏదైనా అన్యాయం, అక్రమం జరిగితే,.. బాధకలిగితే - అది తనకే జరిగినట్లుగా చలించిపోయి - తన కోపాన్ని, ఉక్రోషాన్ని, బాధను అక్షర రూపంలో తన రచనల్లోనే ప్రస్ఫుటింపచేసే సున్నిత మనస్తత్వం ఆమెది! (భగవత్ప్రసారితమైన సాహిత్యపిపాస తోడయింది కనుక).

తన రచనా పాటవంతో “పూలనిప్పుల” కవితా శంఖాన్ని పూరించిన వాగ్దేవి కలం తనది. "పూలనిప్పులు" లో భావస్పష్టత, వస్తు నాణ్యతతోపాటు - భాషా పరంగా కూడా ఉన్నతంగా వుండి చురకత్తిలా పదునెక్కిందా అనిపిస్తుంది చదువుతున్నంత సేపూ.

“మ(గువ)నో ధైర్యం కోసం” శృంఖలాబద్ధమైన స్త్రీ జాతిని మేల్కొలుపుతుంది.

“రక్షక వలయం” పురుషహంకారాన్ని ప్రస్ఫుటింపజేస్తూ, పురుషజాతి ఆత్మవిమర్శ చేసుకునేదిగా వుంది.

"కూటికోసం" నలిగిపోతున్న జీవితంలో వెలుగు ఎక్కడ అంటూ గొంతెత్తి తన కలం ఎంత శక్తివంతమైందో తెలుపుతుంది.

అమృతతుల్యమైన కన్నతల్లి ప్రేమానురాగాలను “అమ్మా వందనం” అంటూ కనురెప్పల కాపలాతో పోల్చిన వైనం అమోఘం. ఈనాటి యువతరానికి దేశాభిమానం, ఐకమత్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాముఖ్యతను వక్కాణిస్తూ, సమగ్రత దేశమనుగడకు ఎంత అవసరమో చాటి చెప్పటంలోనూ, నిరక్షరాస్యతతో నిస్తేజమైన నేటి సమాజానికి అక్షరాస్యత ఆవశ్యకతను "జీవగీతం" ద్వారా బలోపేతం చేయటంలోను, వెన్నంటి నడిచే వాళ్లకు సారథి అవ్వాలంటూ “విశ్వహారతి”లోనూ రచయిత్రి వర్ణించటం 'అభినందనీయం'. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో .. ఎన్నెన్నో..!

"స్వయంప్రభ" గారి కలంలో నుండి యీ సాహితీ వనంలో ఎన్నో... మరెన్నో సుమాలు సువాసనలు వెదజల్లాలనీ, మరెన్నో విజయ సోపానాలు నిరాఘాటంగా, నిరాటంకంగా అధిరోహించేలా వారు శిఖరాన్ని చేరుకోవాలని మనసారా కోరుకుంటూ భవిష్యత్తులో వారి కలం నుండి సమాజాభివృద్ధికి తోడ్పడే ఎన్నో రచనలు జాలువారాలనీ ఓ మిత్రునిగా, శ్రేయోభిలాషిగా నా కాంక్ష - ఆకాంక్ష!

స్వస్తి __/\__

Written by: Bobby Aniboyina
Mobile: 9032977985

No comments:

Post a Comment