విష్ణుక్రాంత
********
నా ఆనందాల్లోనే కాదే
నా బాధల్లోనూ తోడుంటావు
నా గాయాలకు వెన్నపూసనద్దుతూ నను ఓదారుస్తావ్
హద్దుల్లేని అనంత మన ప్రేమాకాశంలో
నాకు నొప్పి కల్గితే నీ
కనుగుడ్ల నిండా నీరు బయటకురాక
నీ హృదయంలోకే ఇంకిపోతుంటుంది
గాయం నాదైతే
దానినుంచి వచ్చే బాధ నీది..!!
చైత్ర మొచ్చిందంటే చాలు నువ్వే గుర్తొస్తావు
పవళింపు సమయాన,
ప్రభాతమౌ వేళ
నీ జ్ఞాపకాలే నా వైకుంఠములు.. !!
నే
నిద్దురోతున్నప్పుడు
వెన్నెల జలతారు పుడమిపై
నడువఁగ కాలి అందియల
ఘల్లుఘల్లుమను విలాస
రాసకళా లీలలు ఆడఁగ
నన్ను నిలువునా
చెంగుటుయ్యాలలా
ఊపి మేల్కొల్పు విష్ణుక్రాంతవు నీవు.. !!
నేడే పౌర్ణిమ..!
పున్నమి అంటే మొదట గుర్తొచ్చేది
నిండు చంద్రబింబములా వున్న నీ ముఖమే..
పద్మాల వంటి కనులు
సౌందర్య సంపన్నాల కనుసోగలు
కెంపారు కెంపులవలె పలు వరుస
ఎర ఎర్రని అరుణిమ అధరములు
బంధూకములవంటి చెక్కిలి
నెలవంక నడుమును ఊగి ఊగి ముద్దాడే నీలి ముంగురులు
అష్టమి రేయి చంద్రునిలా తెజోవంతమవ్వు ఫాలము
శంఖం వంటి కంఠము
లే లేత చివుళ్ళు వంటి ముంజేతివేళ్ళు
మల్లెచెండులవంటి ఉరసిజములు
అరటాకువంటి అందాల కౌను
అందులోని నత నాభీయము
ఇలా ఒకటా రెండా నీ నఖశిఖపర్యంతమూ
ఆపాదమస్తకమూ అందములే
ఆనంద నందనములే..
చతుర్విధవర్ణములే..!!¬
అనంతాకాశాలలో...
నవీనాకాశాల నడుమున పుష్పించు
దివ్య కుసుమములా నీవు
నీలోనికి జొచ్చు ప్రేమరవి కిరణమునై నేను
చిత్త మమేకమై విడిపోని ప్రియుల నిట్టూర్పు ఊడ్పుల వోలె
ప్రణయ వేగినీ ఉష్ణవాయువులలో మునిగి
మబ్బుతో సాటి నీ కొంగు నే కప్పుకొని
వినీలాకాశాల వీధుల్లో విహరించువేళను మై
మరిచి నీ అధర చుంబనానందితుడనైనాను..!!
ఎందునున్నది నిజ అమృతము
నీ యెర్రని దోర అధరముల కొసనున్నదే సఖీ..!!
నీ మన్మందహాసములు సమ్మోహనాస్త్రమ్ము
చక్రధరముల వోలె శృంగారి ఒయ్యారివై
సొగసు సొబగుల రీతి విమలమును జేసి..
ముడి వదిలి చిడిముడి వడివడితో విడిపడిన నీ ముంగురులు
కెంపారు నేత్రాల ఆంగికాభినయించు పసిడి కురులతో
గాజుల గలగలలు ఉరము పై మోపి
తకదిమి దిమితక తాళాలు వేయుచు
మిళితమౌ చుంబన లావణ్య మొప్పగా
శృంగార రసధారలు నేలపై చినుకు చినుకు నృత్యాలై
కళ్యాణి కీర్తనల రాగతాళాల క్రియవై
నాట్య స్వరూపిణి వై
నర్తించు నా హృదయ వేదికపై విష్ణుక్రాంతలా..!!
Written by: Bobby Nani
చరణ కింకిణులు గొల్లుగొల్లుమన కరకంకణములు విలవిలలాడగా.. అన్నట్టుగా గమ్మత్తుగా సాగింది ఈ సాహితీ స్రవంతి బాబీ.
ReplyDeleteచతుర్విధ వర్ణములంటే చాతుర్వర్ణ్యమ్ మయాసృష్టం అని చెప్పారు అదేనా బాబీ.
ReplyDeleteనెలవంక నడుమును ఊగి ఊగి ముద్దాడే నీలి ముంగురులు !!!
వామ్మో ! ఇంత పొడవాటి ముంగురులా ! నిజ్జంగా చంద్రముఖి లకలక లకయే :)
జిలేబి