Saturday, August 31, 2019

ఆరు గజాల స్త్రీ తత్వం..

ఆరు గజాల స్త్రీ తత్వంలో.. 
ఎన్నెన్నో వర్ణాలు 
గుండెకు కళ్ళు అతికించుకొని చూడాలే కానీ 
మూలాధారం నుంచి గగన చక్రం వరకు
అంతటా నీవే..!!

వర్షించడం మబ్బుకు మహదానందకరమైతే 
ప్రత్యూష వేళలో విచ్చి పరిమళించడం నీ సహజత్వము..!!

అందుకేనే నచ్చేస్తావ్..!

ఎన్ని పర్యాయములు 
నీ అధర తాళపత్రాలపై 
నా చుంబన సంతకములు లిఖించినా 
ఆ మధురమెప్పుడూ నవీనముగానే ఉదయిస్తుంది..!!

విపంచి సైతం పలికించలేని వేవేల అలౌకిక భావాలను 
వెచ్చని నీ పరిష్వంగపు స్పర్శ సునాయాసంగా స్పృశించగలదు..!!

నాలో మనోభావోద్వేగాలను పురివిప్పి 
తనువూ, మనసు తమకముతో నర్తింపనూ గలదు.. !!

నా
ప్రపంచానికి మరోవైపున నువ్వున్నా
నా హృదయం నిర్మల గంగా ప్రవాహమై 
పారుతున్న క్షణాల్లో.. 
నీవు విడిచిన జ్ఞాపకాల్లో .. 
నా ఊపిరిని వెతుక్కుంటూ వస్తున్నా...!!

కనిపించిన ప్రతీ కళ్ళలో కళ్ళు పెట్టి 
వినిపించే ప్రతీ గుండె గుండెనీ స్పృశించి 
పొంగిపొరలే నా కన్నీళ్ళ మధ్యన 
అంతులేని అఘాతమై వర్తమానము వచ్చి నిల్చుంది.. !!

నీ గుండె ధ్వనిస్తున్న విరహ గీతాల్ని 
నా గుండె గుప్పెట్ల నుంచి వింటున్నా.. 
అమాస పున్నముల మధ్యన 
నా కళ్ళు కాంతిని కోల్పోతున్నట్లనిపిస్తుంది..
అయినా వస్తున్నా.. 
నా చూపుల్ని పిండుకుంటూ, 
అమాంతం నేలను తాకే పక్షిలా వస్తున్నా.. 
నీ గుండె కుటీరములో నన్ను నేను ¬దాచుకునేందుకై..!!

Written by : Bobby Nani

3 comments:

  1. ఆరు గజాల చీరలు విన్నాము గానీ ఆరు గజాల స్త్రీ ఏమిటి బాబీ.

    ReplyDelete