ఓ పసిడి ఛాయ మెట్ల మీదుగా దిగి
నేనున్న గదిలో పండువెన్నెలలా కురిసింది
నా మంచానికి దూరంగా ఓ మూలలో
చీకటి బిక్కుబిక్కుమంటూ చూస్తోంది..
వేవేల సంగీత వాద్యాలు ఒక్కసారిగా
సౌందర్య రాగాలు ఆలపిస్తున్నై
నన్నో పిల్లనగ్రోవిని చేసి
మధుర స్వరాలను పాడుతోంది..!!
ఆ అధరముల వద్ద నేనో పిల్లనగ్రోవిని మరి...!!
అనంతాకాశమే ప్రేయసి
విశ్వతేజమే ప్రియుడు
అస్తమయాన్ని జయించాలనే తపనలతో
భానుడింకా స్వేదాన్ని కక్కుతూ
నిత్యం ఆకాశం మీదికి ఎగబ్రాకుతూనే ఉంటాడు..!!
నేను మాత్రం ..
దూరంనుంచే నీ సౌందర్య ద్రాక్షరసాల్ని
నా కళ్ళతో పిండుకుంటూంటాను
అభిమానిస్తుంటాను,
ఆరాధిస్తుంటాను,
ఇన్నిరోజుల మన పరిచయంలో
మన రుచులు, శృతులు
రెండూ కలిసాయి
నీకు నాకు మధ్యన
ఎంత ఆవేశం కరిగిందో
ఎన్ని నఖక్షతల నక్షత్రాలు వెలిశాయో
ఒక్క నీకు నాకు మాత్రమే తెలుసు.. !!
రెండు హృదయాలు కలిసి నవ్వుతుంటే
ఆకాశంలో హేలపౌర్ణమి ఉదయిస్తుంది
అదే రెండు గుండెలు పోట్లాడి ఊరుకుంటే
చిమ్మ చీకట్లు చిందులేస్తాయి
అందుకేనేమో నెలలో ఈ అమాస పున్నములు..!!
రాగము నీదైతే
నాదము నాది..
అధరము నీదైతే
అరుణము నాది ..
అనంతము నీదైతే
ఆనందము నాది ...
బంధము నీదైతే
భావము నాది ..
స్పందన నీదైతే
స్పర్శ నాది..¬!!
ప్రపంచానికి అటువైపున నీవు
ఇటువైపున నేను
నిత్యం ఉదయించి అస్తమించే
ధ్రువతారలం మనం.. !!
Written by: Bobby Nani
భానుడింకా స్వేదాన్ని కక్కుతూ
ReplyDeleteనిత్యం ఆకాశం మీదికి ఎగబ్రాకుతూనే ఉంటాడు..!!--
ఈ వాక్యంలో కవితాత్మకత వెల్లివిరిసింది బాబీ.nice poetic expression.