Wednesday, September 25, 2019


అద్దం ముందు నిలబడ్డప్పుడల్లా
అపరిచిత ముఖమేదో వెక్కిరిస్తూనే వుంటుంది
అయినా ఏం సాధించామని అసలు ?
మూడుపదులు దాటినా
ప్రతీ ఉదయం భాద్యత కండువా
భుజానేసుకొని గడపదాటితే
మాపటీలకైనా వస్తామా..
తిరిగి అసలొస్తామా అనేది ప్రస్నార్ధకమే ఒక్కోసారి.. !!

జీవం పీల్చుకున్న
ఎముకుల మ్రాను కింద
నా ఒంటరితనం తచ్చాడుతూ వుంటుంది.. !!
నా గుండె చూరు నుండి
వేళ్ళాడి ఊగే జ్ఞాపకాల కడ్డీలతో
గతించిన యుగాల్ని కొలుస్తున్నాను .. !!

వెయ్యి తుఫాన్లు ముందు కూడా
తలవంచని నా ధైర్యం..
ఒక్కోసారి త్రోవ తెలియనితనంతో
నిలువెల్లా నీరు కారిపోతుంటుంది.. !!

క్రూరమైన దినచర్యలో భాగంగా
ఒళ్ళంతా కమిలిన నా
దేహాన్ని నొక్కుకుంటూ
వేగంగా విస్తరిస్తున్న ఈ నగరాన్ని
చూస్తూ ఉండిపోయాను స్తబ్దుగా..!!

Written by: Bobby Nani

1 comment: