Tuesday, July 11, 2023

మౌనాల శూన్యం...



ఆకు చాటున మిణుకుమనే మిణుగురులా
నవ్వుతూ కనిపించే తన వదనం వెనుక
ఏ కన్నూ చూడని భావన మరోటి వుందనిపిస్తోంది.

నడిరేయి చీకట్లో
నిద్ర నోచని కళ్ళతో
రేయంతా ఏకాంతంగా తనని తాను
పలకరించుకోవడం తనకు అలవాటేమో
ప్రభాత వేళలో తన కళ్ళు
గాలికి వెలిగే దీపాలవలె కనిపిస్తాయి...!!

చాలాసార్లు అడగాలనిపిస్తుంది
తాను కోరుకున్న వాళ్ళు అడిగితే సంతోషిస్తుంది కానీ
ఎవరో అడిగితే నవ్వి ఊరుకుంటుందని బాగా తెలుసు...!

అందుకే తాను కనిపించినప్పుడు నా మౌనపు పలకరింతలతోనే పలకరించి పోతుంటాను
అయినా నా పిచ్చి కానీ
ఉదయించే సూర్యుడను అరచెయ్యి అడ్డుపెట్టి ఆపగలనా
అస్తమిస్తున్న సూర్యుడను లంగరేసి ఒడిసిపట్టగలన..!!

అచ్చం నాలాగే తనకు దాచుకోవడం కూడా తెలియదు
మనసులో దాచుకున్నవన్నీ అద్దంలా
తన కళ్ళలో కనిపించేస్తుంటాయి నాకు
తెల్లారగానే కేరింతలు కొట్టే పసిమనసు తనది..!!

తన మౌనాలతోనే
సంగీతంలోని కొత్త కొత్త పుంతలను అల్లుకుంటుంటాను
సాహిత్యంలోని లోతులను పరిశీలిస్తుంటాను
కవిత లోని గమ్మత్తులను పరికిస్తుంటాను
కావ్యాలలోని కనికట్టును గమనిస్తుంటాను
నాకు తెలిసింది అదే..
తనకన్నా తన మౌనమే నాకు చాలా దగ్గర..!!

చీకట్లో తళుక్కున మెరిసే తన ముక్కుబేసరిలో కూడా ఓ అభినయం ఉంటుంది తెలుసా ?
తననుంచి వీచే గాలిలో కూడా
తానంత మృదుత్వం ఉంటుంది
ఓ వెచ్చని పరిమళం,
నేను నీతోనే వున్నాను అనే ఓ తియ్యని స్పర్శ
చాలా స్పష్టంగా తెలుస్తుంది..!
బావాలు బహు చెడ్డవబ్బా
ఎంత వద్దనుకున్నా మనసు తనవైపే పోతుంది..!!

తనతో మాట్లాడటానికి వందేళ్ళు కావాలా
మాట్లాడిన ఆ ఒక్క క్షణం చాలదా
ఓ వందేళ్లు గప్చిప్గా ఆ జ్ఞాపకాల్లో బ్రతికేందుకు.. !!

Written by: Bobby Aniboyina
Mobile: 9032977985

No comments:

Post a Comment