Tuesday, June 27, 2023

వేకువ దృశ్యం...

 


ఎందుకో ఇవాళ
ఆవులిస్తూనే నిద్ర లేచాను
లేచి లేవగానే
రాత్రి కురిసిన అకాల వర్షానికి
బిడ్డలేమైపోయాయా అంటూ
మనసు ఒకటే మెలిపెట్టేసింది
నా ప్రమేయం లేకుండానే నా పాదాలు
పెరడు గుమ్మం వైపు నన్ను లాక్కెళ్ళాయి..!!

కళ్ళు నులుముతూ మసక మసకగా
రెండు రెప్పల మధ్యనుంచి చూసాను
గుంజీళ్ళుదీస్తూ లేవలేకపోతున్న లేత కనకాంబరం
రాలి నేలకంటుకుపోతున్న దాని పూ రెక్కలు
రుధిరం చిమ్మకుండానే తలలు తెగి
తునిగి పడివున్న ముద్ద మందారం మొగ్గలు
నీరెక్కువై అలసి నీరసించిన గుబురు మల్లె పొదలు
నాకేం కాలేదులే అంటూ నను ఓదార్చే ప్రయత్నం చేస్తూ
మేకపోతు గాంభీర్యం చూపే సన్నజాజి పందిరి
ఎన్ని ముళ్ళుండి ఏం లాభం
వర్షాన్ని ఏమి చెయ్యలేకపోయానే అంటూ
బోరునేడ్చె ఎర్ర గులాబీ
ఒక్కోదానికి ఎన్ని వ్యధలో .. మరిన్ని బాధలో
కొన్ని క్షణాలు వాటిని ప్రేమగా స్పృశించి
వాలిన వాటిని సరిచేసి రాలిన వాటిని ఏరిపారి
కుడిచేతి ప్రక్కన వున్న కాయకూరల దగ్గరకు వెళ్ళాను
ఈ పూట గుత్తివంకాయకని ఎత్తిపెట్టిన
నవనవలాడే వంకాయలన్నీ నీరసించి పడివున్నాయి
ఎంత త్రాగినా దాహం తీరని నిమ్మ కూడా
నాలుక వ్రేళ్ళాడదీసి సన్నగిల్లి పడివుంది
ఆకాశానికి నిక్కబొడిచే లేలేత బెండలు
సత్తువనిగి పుడమిపై వాలి వున్నాయి
రేయంతా నగ్నంగా తడిచిన మిరప, మెంతి,
పొదీనా, కొత్తిమీరాకు కూరలు
ఎక్కడికక్కడే కూలిపడి వున్నాయి
గతరాత్రి ఆకాశపు కారుమబ్బులు భీకర ప్రకంపనం
ఈలగా మారి ఊళగా మారి
రాకాసి గగ్గోలు ఘోష మహమ్మారియై
తిప్పించి, మళ్ళించి ఎత్తి నేలను మొత్తే విధ్వంసకారి అయింది..!!
పిల్లల ఏడుపుల్లా పెరడు మొక్కల విలవిల
పిల్లుల అరుపుల్లా బైటనుంచి చెవుల్లోకి
దూసుకొచ్చే జరజరా హోరు
నిశీధి చీకటిని చీల్చుకొచ్చే వెండి మెరుపుల వర్షపు జోరు
వాన నీరు చలిస్తే దానికి తగ్గట్టు గాలి కసిరి విసిరింది
అకాల వర్షపు అకటా వికట చినుకు తాండవ దృశ్యం..!!

ఓ చిన్న పెరడుకే మనం ఇంతలా బాధపడితే
ఆడా ఈడా అప్పుతెచ్చి పదిపరకా కూడగట్టుకొని
ఎకరాలకెకరాలు పండించే రైతు
తన శ్రమ, సమయం, యావత్తు తన జీవితమే పెట్టి
పంటను పండిస్తున్నాడు..
కాస్త ప్రకృతి కనికరిస్తేనే తనకంటూ ఒక బ్రతుకు
లేదంటే కుటుంబంతో రోడ్డుమీదకు వచ్చేవారు ఎందరో..!!
పైకి కనిపించే ఈ అందాల వెనుక కనిపించని ఓ మహా వేదనే దాగుంది..!!

Written by Bobby Aniboyina
Mobile: 9032977985

No comments:

Post a Comment