Wednesday, August 7, 2019

అవాస్తవ సదృశ్యము



అవాస్తవ సదృశ్యము
***************


నే
ఒంటరిగా ఉన్నప్పుడు 
ఓ పరిమళం నన్ను చుట్టేస్తుంది 
నా గుండెల్లోకి దూరి 
సాగర సంగీతాలు పలికిస్తుంది
నను దూరంగా తీసుకెళ్ళి 
శిఖరమంచున నిలబెట్టి 
నా కంటి కెమేరాతో 
ప్రకృతి చిత్రాలను గీయిస్తుంది.. !!


ఎక్కడో 
మా నెల్లూరు రోడ్లమీద దృశ్యాల్ని 
నిశ్శబ్దంగా ఏరుకుంటున్న నన్ను 
చిత్రంగా ఈ భావ పరిమళం 
ఎత్తైన పర్వతాల మీదకు విసిరేస్తుంది.. 
ఆకాశంలో విరిసే ఇంద్రనీలం పువ్వు సువాసనలతో 
నా ముక్కుపుటాల్ని నింపేస్తుంది..!!


ఓ అధీతి
ప్రకృతి చేసే కనికట్టును నువు చూడలేవు
సుడిగాలిని నువ్వు ఎదుర్కొనలేవు 
తుఫానును బంధించనూ లేవు 
రివ్వున వీస్తూ తెల్లవారుజాముననే వచ్చి 
గిలిగింతలు పెట్టే చల్లగాలిని నువ్వు ముట్టుకోలేవు 
కనిపించకుండా నిన్నల్లరపెడుతూ 
వినీ వినిపించకుండా శబ్దాన్ని మోసుకొచ్చే గాలిని 
ఒక్కసారైనా నీ వొళ్ళో కూర్చోపెట్టుకోలేవు 
కబుర్లు చెప్పి బుజ్జగించనూ లేవు


కానీ 
అక్షరాలతో బూరెలొండగలవు 
పదాలతో పరిమళాలద్దగలవు 
వాక్యాలతో ఊపిర్లు ఊదనూ గలవు 
అందుకే నీవంటే నాకంత ప్రీతి
ఓ కక్షావైక్షకా ..!
నీవే నా స్ఫూర్తి 
నీ క్షరమే నా మార్గదర్శి 
నీ ప్రస్థానంలో కొన్ని అడుగులైనా వెయ్యాలని 
ఒక్కడినే ఎత్తైన కొండ శిఖరం మీదకు పోయి 
కళ్ళుమూసుకు కూర్చున్నాను 
అక్కడ గాలి నా చెవుల్ని దూసుకుపోతూ విన్పిస్తుంది 
నా ముంగురుల్ని సవరిస్తూ వయ్యారాలు పోతుంది 
నా వొళ్ళో కొండ మల్లెల సువాసనల్ని తెచ్చి గుమ్మరిస్తోంది 
పొలాల్నించి, గులాబీతోటల్లోంచి 
తియ్యని తేనె సొనల్ని మోసుకొచ్చి 
నా ముఖానికి పూస్తోంది.. 
నాలో ఇంత భావుకత ఉబికిందంటే 
వేవేల నీ పాద ముద్రలలో 
ఓ రెండడుగులు నావీ పడ్డాయనిపిస్తుంది 
అందుకేనేమో నా కళ్ళలో అక్షర కాంతి 
నా ముఖములో పదాల పసితనం చిందులేస్తుంది..
ఓ కవీ 
ఏ నాటికైనా నీ ప్రస్థానంలో గమ్యాన్ని చేరుతానంటావా ..!!

Written by: Bobby Nani

1 comment:

  1. అక్షరాలతో బూరెలు సంగతేమో గానీ జిలేబీలు చేయవచ్చు.

    ReplyDelete