Tuesday, June 18, 2019

సుప్తమధుకీల



కోపగించుకున్న ప్రియురాలు అలక బూనింది .. ముత్యం లాంటి మోమును కందగడ్డ చేసుకుంది.. ఆమె అలక తీర్చేందుకు వాడుకలో లేని అక్షరాలను ఏరుకొచ్చి ఆ పరిణేత ఎలా అలంకరిస్తున్నాడో చూడండి .. !!

సుప్తమధుకీల
***********

ఎంత కోపమే.. 
ఆ సంపెంగ నాసికపై 
బేసరి లేకున్నా తళుక్కుమనే ఆ 
చిరు కోపానికేం తక్కువ లేదు..!!

ఓ ... లలనా... 
నీ చిరు కోపఁబును 
కుదియించు కూరిమికాడును నేను 
స్వీకరించు నా యీ 
పద పద్మహారాలను..
అధర అలంకరణలను..!! 

తిరుగంద జలకలశ హస్తమగు 
కలధౌత పాదుకల ప్రభాతదేవి వలె..
తిరుగంధ జలములు గల కలధౌతపాత్రపై, 
అందియలతో లలన నృత్యాల ద్రొక్కగ
ముత్యాలురాలినవి వెన్నెల్లో.. 
మ్రోగినవి తప్పటడుగుల విడెపు అందియ మువ్వలు..!!

కూర్చిన ముత్యాల కుప్ప చెదిరినరీతి 
రంగైన రత్నాలరాశి పరిచిన రీతి 
చిలికిన పన్నీరు ఒలికిన గాలిలో చినుకులైన రీతి..!!
జవరాలి మిణుగురు మువ్వల తప్పటడుగులకు 
మేల్కొనిన ముత్యాల నా మనసు ముగ్గులేసింది 
రత్నాల నా మనసు రంగులేసింది.. 
జాగారాల నా మనసు చెంగల్వ రంగవల్లులల్లుకొని 
నిరీక్షించినది ఈ సుప్తమధుకీల మురిపెమ్ములకై...!!

ప్రేయసీ ..!!
నినుచూచి, 
నీ వాలకపు పోలికలు చూచి, 
తిల్లాణ తాళయుత గీత సంగీతముల తేలుతూ 
తురీయావస్థతో, ప్రతిధ్వనుల జేయ 
జగదనుష్టాన గంధర్వదేవతలు 
గుమిగూడి వచ్చి నృత్యాలాడినారే...!!

నీ 
నునుసిగ్గుల 
చిరునవ్వులు రాలగా 
చంద్రికల 
జలతారు వల్లెలతో 
వన మధుకములు 
ఆడుకున్నవి పాడుతూ..!!

పున్నమి వెన్నెలలో 
పూలతావుల పిల్ల వాయువోలే 
నను పరిష్వంగించే నీ తలంపులు 
వేళాకోళం మరదలల్లే చెవిలో 
కొక్కొరోకోయి మని చిలిపిగ పిలిచి పోతుంటాయి..!!

Written by: Bobby Nani

No comments:

Post a Comment