Tuesday, June 11, 2019

నిద్రలో... నిన్న రాత్రి


నిద్రలో... 
నిన్న రాత్రి 
నా చెక్కిలిపై ఓ ఆత్మీయపు 
చిరుజల్లు నను ముద్దాడుతూ గడిపింది 
పదే పదే నా బుగ్గను తడి చేస్తూనే వుంది 
కదుల్తూ, మెదుల్తూనే ఉన్నాను ఒంటరి నా పాన్పుపై...!!

మా బాల్కనీలో..
కిటికీ అవతల జోరున వర్షం 
ఆకాశం తన గుండెల్ని చింపుకొని 
నేలపై నీటి దీపాలుగా రాలుతున్న 
కమనీయ దృశ్యం అది..
నా రెండు కళ్ళను నులుముతూ 
లేచి కూర్చుని అలానే చూస్తున్నాను..!!

ఒక్కో వర్షపు చినుకు 
ఒక్కో భావాన్ని మోసుకొచ్చి
రహస్యంగా నా చెవిలో దూరి 
చల్లని పిల్లతెమ్మెరై అల్లరి గావిస్తోంది..
పసి పాప చేసే చిరుమువ్వల సవ్వడిలా, 
గల గలమంటూ, జల జలా నేల రాలుతూ, 
నా తనువంతా ముద్దాడాలని 
నను ఆహ్వానించుచున్నది..!!

తామర నేత్రాలతో, 
రెప్పవేయక అలానే చూస్తూ 
నా రెండు చేతులను చాచి 
ధారలు ధారలుగా .. వెండిజలతారులా 
పడుతున్న ఆ వర్షాన్ని ఆర్థిగా హత్తుకున్నాను.
హటాత్తుగా నా బాల్యంలోకి వెళ్ళిపోయాను.. 
నా నేత్రాలనుంచి కన్నీటి ధారలు ఆ వర్షంతో కలిసిపోయాయి 
ఇక అంతే నా కన్నులకు రెప్పల ఊయలలు ఊగడం మొదలెట్టాయి 
ఎప్పుడు పడుకున్నానో తెలియదు 
ఓ సుధీర్గ నిద్ర మళ్ళి నాన్నావరించింది...!!

Written by: Bobby Nani

1 comment: