Tuesday, January 1, 2019

కవిత్వమొక అనంతాకాశం..!!



ఎందుకో తెలియదు
చీకటన్నా,
మృత్యువన్నా అమితమైన ఇష్టం
ఒంటరిగానే ఎక్కువ గడిపేవాణ్ణి
అందుకే,
నేను, నేనుగా వున్నప్పుడు
చిరు చీకటిలో ఆస్వాదనను
ఏకాంతంలో అక్షరాలను అల్లుకోవడం
అలవాటైపోయింది..!!
“మృత్యువు” అన్న పదం చాలా చాలా ఇష్టం
నిశ్శరీరంగా ఎల్లప్పుడూ
ఫాంటసీలోనూ,
డ్రీమ్ లోనూ,
బ్రతకడం చిన్నప్పటినుంచీ అలవాటు..!!
మరణాన్ని, మరణించిన దేహాల్ని
ఒకటీ, అరా కాదు చాలానే
అత్యంత దగ్గరనుంచి చూసాను,
చూడాల్సొచ్చింది..!
అందుకేనేమో
చావు, పాడే, స్మశానం
అగరొత్తుల వాసనలు,
దింపుడుకళ్లము అరుపులు
సమాధిపై వ్రాతలు అంటే అమితమైన ప్రీతి ..!
ఈ రోజు కళ్ళముందుంటూ,
రేపు నిర్జీవమై,
సంధ్యాస్తమయానికి కనుమరుగు అయ్యే
ఈ దేహానికి ఎన్ని రంగులో,
ఎన్ని రుచులో..!!
నా వరకు
మృత్యువు అంటే
ఎల్లప్పుడూ మన ప్రక్కనే కూర్చున్న
మనిషిలాంటి భావన..
ఆ మనిషేప్పుడూ నా చెవిలో
“జాగ్రత్త” అని గుసగుసలాడినట్లు అనిపిస్తుంది..!!


చిన్నప్పటినుంచీ నాదో విచిత్ర ఊహాప్రపంచం
ఎలాంటి స్థితిలో నేనున్నా,
ఏవో విచిత్రమైన ఊహలు ప్రతీ నిమిషం ఉండనే వుంటాయి..
ఒక్కమాటలో చెప్పాలంటే నా దొక కల్టివేటెడ్ బ్రెయిన్
ఎల్లప్పుడూ మరో దారి తెరిచే ఉంటుంది
ఒక వాస్తవం చుట్టూ పొగమంచులా
నా ప్రతీ కవితలో కొన్ని అక్షరాలు రహస్యంగానే వుంటాయి..!

మనసొక మహాసాగరం
తానుకట్టుకున్న చెలియలికట్టను
తానే కబళించాలని చూస్తుంది
తన తోబుట్టువైన ధరతలాన్ని
తానే తాగేయాలని చూస్తుంది
హోరెత్తుకుంటూ ఉరికి ఉరికి వస్తుంది
నోరొత్తుకుంటూ తిరిగి తిరిగి పోతుంది
తనలో అంబరాలను పరుచుకుంటుంది
తానే ఆకాశమంతా కమ్మేయాలని
తహతహలాడిపోతుంది
అందుకే మనసును
గట్టిగా గుప్పెట బంధించాలి
మనసు మహా సాగరం అయితే
కవిత్వమొక అనంతాకాశం..!!

Written by: Bobby Nani

No comments:

Post a Comment