Wednesday, May 16, 2018

తెలుగు సాహిత్యం లో కవితా ధోరణులు ..తెలుగు సాహిత్యం లో కవితా ధోరణులు 
****************************

నేడు అందరూ ముఖపుస్తకాన్ని వేదికగా చేసుకొని “కవిత్వాలు” వ్రాస్తున్నారు.. అందుకు చాలా సంతోషంగా ఉంది.. కానీ వ్రాసే ప్రతీ ఒక్కటీ “కవిత్వం” అంటున్నారు అందుకు చాలా విచారంగా కూడా ఉంది.. సామాజికావసరాలను తీరుస్తూ, సామాజికాభిరుచులకు అనుకూలంగా సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ సమాజంలో పుట్టి పెరిగేదే సాహిత్యం అంటే... ఇటువంటి సాహిత్యం నన్నయ కాలం నాటికి అనగా క్రీ.శ. 11వ శతాబ్దం నాటికి స్థిరపడింది.. అప్పటినుంచి అది క్రమముగా వికాసాన్ని పొందుతూ, చిన్నయ దాకా ఒకే మూసలో అవిచ్ఛిన్నంగా, విశృంఖలంగా సాగింది.. దాదాపు తొమ్మిది శతాబ్దాలలో అవిరళంగా, విస్తృతంగా వ్యాపించిన ఈ తెలుగు సాహిత్యమంతా స్వరూపంలో కొద్ది పాటి వైవిధ్యాన్ని పొందినా, స్వభావంలో మాత్రం ఎలాంటి మార్పులకు లోనుకాకుండా కొనసాగుతూ వచ్చింది... నన్నయ నుంచి చిన్నయ దాకా సాగిన ఈ కవిత్వాన్నే ప్రాచీన కవిత్వంగా, సంప్రదాయ కవిత్వంగా సాహితీకారులు పిలిచారు.. 

సంప్రదాయ కవిత్వం..

నన్నయ నుంచి చిన్నయ దాకా పరంపరంగా సంక్రమించిన కవిత్వాన్నే సంప్రదాయ కవిత్వం అంటారు.. దీనినే ప్రాచీన కవిత్వం అని కూడా అంటారు.. ఇందులో ముఖ్యంగా వీర, శృంగార రసాలకు ప్రాధాన్యత ఇవ్వడం, అష్టాదశ వర్ణనలను కలిగి ఉండటం, ప్రకృష్టమైన రచనలతో సాగడం, వ్యాకరణ బద్దంగా నడవడం, ఛందో నియమాన్ని పాటించడం, అలంకారాలకు ప్రాధాన్యత ఇవ్వడం, పురాణ, ఇతిహాస, కావ్య, ప్రబంధాది మార్గాలలో నడవడం, ఈ లక్షణాలన్నీ సంప్రదాయ కవిత్వ ముఖ్య ఉద్దేశాలు.. 

భావ కవిత్వం.. 

ఇది ఓ లిరిక్ లా ఉంటుంది.. దీనిని గీత కవిత్వమని, అభినవ కవిత్వమని, నవ్య కవిత్వమని అనేకమంది అనేక పేర్లను సూచించినా గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు సూచించిన “భావకవిత్వమనే” పేరుతోనే ఇది స్థిరపడింది.. కవి తన హృదయగత భావావేశాన్ని అతి స్పష్టంగా వ్యక్తీకరించడమే దీని ముఖ్య ఉద్దేశం.. ఇందులో ముఖ్యంగా.. వస్తువు, భావం, ఊహాతీతంగా వ్రాయడం, కల్పనకు ప్రాధాన్యమివ్వడం, ఏక భావాశ్రయంగా నడవడం, అలౌకికతను కలిగి ఉండటం, స్త్రీ ని తల్లిగా, చెల్లిగా, చెలిగా పూజించడం, అమలిన శృంగారానికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రకృతిని ఆరాధించడం, వర్ణించడం మొదలగు లక్షణాలన్నీ భావకవిత్వ ముఖ్య అలంకారాలు..

అభ్యుదయ కవిత్వం 

ఆంగ్లంలో “Progress” అనే పదానికి సమానార్ధకంగా వాడబడుతున్న అభ్యుదయమనే పదానికి “మంగళం” “శుభం” అనే రూఢ్యర్ధాలతో పాటు పురోగమనం, ప్రగతి అనే అర్ధాలు కూడా ఉన్నాయి.. ఇలా అభ్యుదయ కవిత్వం ద్వారా ప్రజలను ఏకతాటిపై నిలబెట్టిన వారు శ్రీ శ్రీ గారు.. సమకాలిన జీవిత పరిస్థితులకు, రాజకీయ వాతావరణానికి, ఆర్ధిక సమస్యలకు, సమాజ సంఘర్షణలకు, నైతిక సందర్భాలకు, ఐహిక, ముష్మిక సిద్దాంతాలకు వైజ్ఞానిక విశేషాలకు అనుగుణంగా, అనుకూలంగా అవసరమైన అక్షరాలతో విలసిల్లాలని అభ్యుదయ కవిత్వాన్ని మరికొందరు ఆకాంక్షించారు .. ఇందులో ముఖ్యముగా సామాన్యునికి ప్రాధాన్యత, సామాజిక చైతన్యం పెంపొందించడం, గతాన్ని నిరసించడం, వాస్తవిక దృక్పథంతో నడవడం.. తదితర లక్షణాలు ఈ అభ్యుదయ కవిత్వానికి వున్న నియమాలు.. 

దిగంబర కవిత్వం 

దిక్కునే అంబరంగా కలిగిన కవిత్వాన్ని దిగంబర కవిత్వం అంటారు.. సమాజంలో కుళ్ళు, రుగ్మత, అలజడి మొదలగు వాటిని వున్నది ఉన్నట్లుగా అత్యంత సత్యంతో, సహజమైన ధోరణిలో వ్యక్తీకరించడం దీని ప్రత్యేకత.. మనిషి తన అవయవాలను కాపాడుకోవడానికి అంబరాలను ధరిస్తాడు.. కాని రహస్యంగా దాచుకోవాల్సినవి లేనప్పుడు అంబరాలతో కూడా అవసరం లేదనే సిద్ధాంతం పై ఆవిర్భవించినదే ఈ దిగంబర కవిత్వం.. “ ఈ ప్రాపంచిక అచ్చాదనల్ని చీల్చుకొని కొత్త రకాన్ని ఇంజెక్టు చెయ్యడానికి వస్తున్న దిగంబర కవుల గుండెల్లోంచి ధైర్యంగా, స్థైర్యంగా దూసుకొచ్చిన కేకలే దిగంబర కవిత” అని ఈ కవిత్వాన్ని గురించి దిగంబర కవులు స్పష్టం చేసారు.. ఇందులో ముఖ్యముగా సమాజంలో జరిగే పరిస్థితులను ఉన్నవి వున్నట్లు చిత్రించడం, కళకు కాకుండా విషయానికే ప్రాధాన్యత ఇవ్వడం.. వ్యక్తీకరణ అత్యంత సత్యంగా ఉండటం, ఎలాంటి అశ్లీలాన్ని అయినా దాచకుండా చిత్రీకరించడం.. విప్లవ పంథాలో నడవడం..పూర్తి స్వేచ్చగా వ్రాయడం.. అత్యంత సరళంగా ఉండటం.. స్పష్టతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం.. వాస్తవికతను చూపడం.. ఇలాంటి లక్షణాలు ఇందులో ముఖ్యం.. 

విప్లవ కవిత్వం 

దెబ్బకు దెబ్బ, కత్తికి కత్తి అనే సిద్దాంతంతో సమాజంలో పేట్రేగిన ధనిక వర్గాలను సమూలంగా పెకలించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో సమ సమాజ స్థాపన చెయ్యాలనే సదాశయంతో, ముఖా ముఖిగా పోరాడాలనే తత్వంతో, అట్టడుగు వర్గాలలో చైతన్యాన్ని రంగరించి వారిని విప్లవ యోధులుగా సిద్ద పరచాలనే ఆవేశంతో బహిర్గమించినదే ఈ విప్లవ కవిత్వం.. దీని ముఖ్య ఉద్దేశాలు మార్క్స్ వాదాన్ని ఆధారంగా గ్రహించడం, తాడితులను, పీడితులను మకుట ధారులుగా తయారుచెయ్యడం.. వీరోచిత కథనం చెయ్యడం, ఓర్పును, సహనాన్ని అసహ్యించుకోవడం, వర్గ చైతన్యాన్ని ఊపిరిగా గ్రహించడం, అవసరమైనప్పుడు మానవతా విలువలకు కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడం మొదలగునవి ఈ విప్లవ కవిత్వ ముఖ్య లక్షణాలు.. 

మినీ కవిత్వం 

నిఘూడమైన భావాన్ని కొద్ది పంక్తులలో పొదిగి, ఒక రసవత్కావ్యఖండికను చదివిన అనుభూతిని కలిగించడం మినీ కవిత లక్షణం.. వ్యర్ధ పదం ఒక్కటి లేకుండా చెప్పదలచిన భావం పూర్తి అయ్యాక గీతం పూర్తి అయిందా లేదా అని చూడక అక్కడే ఆపివెయ్య బడడం దీని తత్వం.. పద్యాలలో, గేయాలలో ఇది వస్తున్నప్పటికీ ముఖ్యంగా వచనంలోనే ఇది విశేష సార్ధకతను సంతరించుకుంటుంది.. దీని లక్షణాలు సంక్షిప్తతను, క్లుప్తతను, స్పష్టతను పాటించడం, భావ తీవ్రత కలిగి ఉండటం, అల్పాక్షర, అనల్పాక్షర రచనను పాటించడం, అనుభవ ప్రధానంగా సృజింపబడటం, అనుభూతికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, రాసావేశాన్ని కలిగి ఉండటం, ఆనంద ప్రధానంగా ఉండటం, ముఖ్యంగా అతితక్కువ సమయంలో పఠించేందుకు వీలుగా ఉండటం.. ఈ లక్షణాలు మినీ కవిత్వ అలంకారాలు ..

గేయ కవిత్వం 

భావ కవిత్వంలో అంతర్వాహికగా, సూచనాప్రాయంగా గేయ కవిత్వం కనిపిస్తుంది.. మాత్రా, ఛందస్సుతో రాగ, తాళ యుక్తంగా, గానానుకూలంగా, సంగీత యోగ్యంగా, సంతరింపబడుతున్న కవిత్వమే గేయ కవిత్వం .. ఇప్పుడున్న సినిమా కవిత్వం అంతా ఈ గేయ కవిత్వంలోనే మిళితమై ఉంది.. 
ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్తే వచనా కవిత్వమని, ఆశుర కవిత్వమని, మధుర కవిత్వమని చాలా ఉన్నాయి.. చతుర్విధ కవితలు అని కేవలం నాలుగు ముఖ్యమైనవి ఉన్నప్పటికీ వాటిలో భిన్నాలుగా ఎన్నో పుట్టుకొచ్చాయి.. ఇలా సాహిత్య పరంగా నేడు కవులు అని చెప్పుకునే వారు కొద్దిలో కొద్దిమందైనా రాస్తున్నారా.. ?? లోతైన భావాలను వ్రాస్తున్నారు.. కాని వాటికి సాహిత్యాన్ని జోడించి రాస్తే మరింత అందాన్ని సంతరించుకుంటుంది.. అని నా అభిప్రాయం.. 

ఇదంతా ఎందుకు అని అంటే ఒక్కో కవితకు ఒక్కో నియమ నిభందనలు ఉన్నాయి.. ఎలా పడితే అలా వ్రాసేది కవిత్వం కాదు కపితము అవుతుంది.. తెలియనివి నేర్చుకోవడంలో తప్పులేదు.. నేను వ్రాసేదే గొప్ప అదే నిఖార్సైనా కవిత్వం అనుకుంటే నువ్వు ఎప్పటికీ అధముడువే ..!! పత్రికలలో రాసే ప్రతోడు గొప్పవాడు కాదు.. అలా అని ప్రతీ వారు తక్కువ అని కాదు.. కొందరు అందులో కూడా చాలా బూతులు రాస్తున్నారు.. పత్రిక అంటే లక్షల మంది చదువుతారు అలాంటి వాటిల్లో వ్రాయాలంటే ఎంతటి వారికైనా చెయ్యి వణుకుతుంది .. చాలా సింపుల్ గా నియమాలు లేకుండా రాసేస్తున్నారు.. చదువరులు కూడా కనీస అవగాహన లేకపోవడమే ఇందుకు మూల కారణం .. అక్షరానికి సాహిత్యం చాలా ముఖ్యం సాహిత్యం లేకుంటే దేహానికి వస్త్రం లేకుండా వున్నట్లు ఉంటుంది.. 

ప్రతీ ఒక్కరికీ అర్ధం అవ్వాలనే ఇంత సమయాన్ని వెచ్చించి ఇదంతా వ్రాసాను.. 
వందమంది చదువుతారని కాదు.. ఒక్కరు ఆచరిస్తారని ఆశిస్తూ.. !!

స్వస్తి __/\__

Written by : Bobby Nani

No comments:

Post a Comment