Wednesday, October 11, 2017

రెండక్షరాలు



రెండక్షరాలు
*********


జేబులో రెండే రెండు అక్షరాలను వేసుకొని బయలుదేరాను.. 
రోడ్డు మీద ఏ గీతం తుంపులైనా 
ఏ పగిలిన రంగు రంగుల అద్దాలైనా 
కనీసం పిల్లలాడుకునే అగ్గిపెట్టెలైనా దొరుకుతాయని.. !!


సన్నని దారాలు దొరికినా చాలు..
వస్త్రాలల్లుకో గలను 
రంగు రంగుల పువ్వుల డిజైన్లు అద్ద గలను 
భావాల సువాసనల్ని నల్దిశలా వెదజల్ల గలను.. 
ఆకుల సౌందర్యాల్ని నా బొమ్మలకు పూయ గలను.. 
పగిలిన అద్దాలలో ప్రకృతి నియంతృత్వాన్ని 
ప్రదర్శించ గలను.. !!


అగ్గిపెట్టెల్లో ఆకాశాల్ని చూపగలను 
ఓ రెండు పొడి పొడి మాటలు దొరికినా చాలు 
రోడ్డుపై ఎండలో వేగుతున్న 
రెండు బటానీలు దొరికినా చాలు.. 
రోడ్డు పక్కమీంచి 
ఏ చీకటి గీతాలు విన్పించినా చాలు.. 
నా గుండెను చుట్టిన నరాలను మీటుకో గలను.. 
నేనూ సంగీతాన్నాలపించ గలను.. !!


సముద్ర తీరాలలో పొడి ఇసుకను 
నా రక్తంతో తడిపి 
పిల్లలకోసం ఆశా సౌధాల్ని నిర్మించ గలను.. 
వాళ్ళ ముఖాల్లో పుష్పించే 
ప్రశాంత ఉదయాల్ని దర్శించ గలను.. 
నక్షత్రాల్ని చూస్తూ నవయవ్వనుణ్ణి కాగలను..!!


జేబులో రెండే రెండక్షరాలు వేసుకొని బయల్దేరాను 
రెండు చెకుముకి రాళ్ళు దొరికినా చాలు.. 
నిప్పు రాజేసి చలి కాచుకో గలను 
గుండెలోతుల్లోంచి అగ్ని సరసుల్ని తోడిపోయ గలను..!!


అగ్ని శిఖల్లో నా గీతం పునీతమౌతూంటే 
నా గీతం కాంతిలో ఎక్కడైనా 
ఏ మూలనైనా 
ఏ జీవమైనా 
ఊపిరందుకున్నా చాలు
నా రెండక్షరాలు చిరంజీవులైనట్లే ..!!

Written by : Bobby Nani

No comments:

Post a Comment