Tuesday, October 10, 2017

నీ కోసం ఎదురు చూస్తున్నా.. !! నీ కోసం వేచి చూస్తున్నా.. !!



నీ కోసం 
ఎదురు చూస్తున్నా.. !!
నీకోసం వేచి చూస్తున్నా.. !!

తొలకరి వాన చినుకు నుండి 
మేల్కొన్న ఇసుకరేణువు నుండి
ముద్దులొలికే పిల్లన గ్రోవి నుండి 
అనంతాకాశం లోని అంతిమ నక్షత్రం నుండి
నుదిటిపై నవ్వే నాగేటి చాళ్ళ నుండి 
గాలి ఈల నుండి, 
నీరెండ నుండి
కమ్మటి మట్టి వాసన నుండి, 
అట్టడుగు నుండి 
నీ కోసం 
ఎదురు చూస్తున్నా.. 
నీకోసం వేచి చూస్తున్నా.. 
వస్తావు కదూ.. !!
తిరిగి కలుస్తావు కదూ.. !!

ఉరితీయబడ్డ గానం నుండి
చెరపబడ్డ జలపాతం నుండి 
గాయపడ్డ కాలిబాట నుండి 
ప్రాణ వాయువు నుండి
వాయులీనం నుండి 
నీ కోసం 
ఎదురు చూస్తున్నా.. 

గోధూళి వేళ
గోరింటాకు అరచేతిలో ఎరుపెక్కే వేళ
హోరెత్తే సముద్రం ఆకాశాన్ని ముద్దాడే వేళ
నక్షత్ర దీపాలు మౌనసంగీతాన్ని వినిపించే వేళ
నౌక తీరాన్ని విడువలేక విడిచే వేళ
తిరిగి వస్తావు కదూ.. !!
నీ కోసం 
ఎదురు చూస్తున్నా.. !!

పక్షులు చెట్ల కొమ్మలకు సంగీతాల్ని అలకరించే వేళ
శశిరంలో రాలిన ఆకులు .. జీవిత సత్యాల్ని విప్పి చెప్పే వేళ
తల్లి చనుబాలు నా అక్షరాలపై కుమ్మరించే వేళ
ఎందరో నన్ను మర్చిపోయిన వేళ
నువ్వు మాత్రం నాకోసం 
తప్పక వస్తావు కదూ.. !!
తిరిగి వస్తావు కదూ.. !!

భూమీ, ఆకాశం కలిసే చోట
పొన్నపూలు రాలి పడిన చోట 
వీధి దీపాలు ఊపిరిపోసుకున్న చోట 
నేలమాళిగ కన్నీరు కార్చిన చోట 
నీ కోసం 
ఎదురు చూస్తున్నా.. 

అసత్యాల అరణ్యాలను తెగనరికే చోట 
గోదారి సముద్రంతో కరచాలనం చేసే చోట 
చరమగీతం మరణ శాసనం వ్రాసుకున్న చోట 
మహా సంకల్పం నా ఆశల జెండాగా ఎగిరే చోట 
నీ కోసం 
ఎదురు చూస్తున్నా.. 
పుడమికి ఒక వైపున నేను..
మరో వైపున నీవు.. 
దిశ్చక్రం కొస అంచుల నిలబడి 
నీ పిలుపు కోసం వేచివున్నా.. 
అలసి సొలసిన నేత్రాలతో.. 
నీ కొరకై ..
నీ రాకకై.. 
వస్తావు కదూ.. !!

ఏ సంకెళ్ళూ నా మనసును బంధించలేవు 
ఏతాడూ నను ఉరితీయలేదు 
ప్రేమస్వరూపమైన నీ కన్నీళ్ళనుండి నే తిరిగి లేస్తాను
సూర్య నేత్రం నుండి లేచి వస్తాను.. 
ప్రాణ వాయువు ఊది పిల్లనగ్రోవిని పలికిస్తాను.. 
సంధ్యారాగంలో వాయులీనం వినిపిస్తాను.. 
హోరెత్తే సముద్రంతో కరచాలనం చేస్తాను.. 
భువన భవనపు బావుటానై పైకి లేస్తాను.. 
నీ కోసం అక్కడే ఉంటాను..
ఎదురు చూస్తూనే ఉంటాను.. 
వస్తావు కదూ.. !!
తిరిగి కలుస్తావు కదూ.. !!

Written by : Bobby Nani

No comments:

Post a Comment