Saturday, September 2, 2017

ఇప్పుడే మొదలైంది...



ఇప్పుడే మొదలైంది... 
టపటప మని.. చిటపట మని ..
అణిగిమణిగి వున్న మట్టిని ఆదరగొడుతూ .. ఎగరగొడుతూ .. 
నేతివంటను సైతం ప్రక్కకు నెట్టే కమ్మని మట్టి వాసనదుగో ..
నింగినుంచి జల జలా మని రాలుతున్న వర్షపు చినుకులదిగో.. 

కాని ఏం లాభం..

కార్పొరేట్ సదుపాయాల మధ్యన 
సుఖ వీలు చైర్లలో బానిస సంకెళ్ళేసుకొని కూర్చున్నారదిగో.. 
కాలు కదపలేరు.. 
వీలు కుదర రాదు... 
ఆరంతస్తుల అద్దాల మేడల్లో 
ఐదంకెల జీతాల్ని లెక్కించుచూ బిక్కుబిక్కుమని 
బిక్కమొఖము గల్గి చూస్తున్నారదిగో..
ఆనందం తెలియని సంతోషంతో.. 
ఆస్వాదన తెలియని ఆనందంతో.. 
రంగులద్దుకున్న ప్లాస్టిక్ ముఖాలతో.. 
స్వేదం చిమ్మని హిమ గదులలో..
మట్టి తగలని పాదాలతో .. 
సౌకుమారులు.. సుకుమారులు అదిగో.. అదిగో.. 
వారేనయ్యా .. మనిషిని పోలిన ఖరీదు “మా”నుషులు.. 
అన్నీ ఉంటాయంటారు వీరి దగ్గర.. 
ఎంటవని అడిగితే ..
చూపెడతారు ధనము, కారు, ఇల్లు వగైరాలని.. 
అసలదేదయ్యా అని నే నడిగితే 
ఏంటది ?? 
అని బిక్కమోము వేసుకొని నిలబడుతారు నా మధ్యన.. 
ఇంతకీ ఏంటది ??
“సంతోషం, సంతృప్తి, కాలం, యవ్వనం” 
ఎప్పుడూ ఉరుకుల పరుగుల జీవితమేనా.. 
ఓ చెట్టునో, 
చేమనో,
పిట్టనో, 
పిల్లనో, 
వర్షించే మేఘాన్నో, 
హర్షించే నేలనో, 
రాలుతున్న చినుకునో, 
దాగివున్న మొలకనో, 
రెక్కలాడే పక్షినో, 
విచ్చుకునే కుసుమాన్నో,
పారుతున్న నీటినో, 
జారిపోయే చేపనో, 
కూసంత చూద్దామని, 
పరికిద్దామని ఉందా.. ?? 
ఊహు .. 
ఇది కదా సంతోషం.. 
రండి ఓసారలా ప్రపంచాన్ని చూద్దాం..
ప్రకృతి ఒడిలో ఒదిగిపోదాం ..

Written By : Bobby Nani

No comments:

Post a Comment