Friday, November 7, 2025

నిశ్శబ్ద యుద్ధం..

 నిశ్శబ్ద యుద్ధం..


అందరి జీవితం ఒకేలా ఉండదు .. అందులోను ఓ మధ్యతరగతి వారి జీవితం మరీ దారుణంగా ఉంటుంది..

తగ్గి బ్రతకడం చేతకాదు... అలా అని ఖరీదుగాను ఉండలేడు.

జేబులో రూపాయి లేకున్నా పౌరుషంతో బ్రతికేస్తాడు.. ఓ మాటంటే పడలేడు.. ఆత్మాభిమానంతో బ్రతికేస్తాడు..

అందుకే మధ్యతరగతి వాడు మధ్యరకం వాడిగానే మిగిలిపోతాడు.. ఎల్.బి. శ్రీరాం గారు నటించినటువంటి “అమ్మో 1వ తారీఖు” చిత్రం లో లాగే.. 1వ తారీఖు వస్తుందంటే గజగజ వణికిపోతుంటాడు.

తలకుమించిన భారాన్ని ఎవరూ మోయాలనుకోరు.. కానీ పరిస్థితుల రీత్యా వాడు మోయాల్సి వస్తుంది.. అలాంటి భారాన్ని మోసే ఒక సగటు మధ్యతరగతి వాడి ఆవేదనకు దర్పణమే నా ఈ ఆర్టికల్ ..



వాడికి ఎన్నో కలలు వున్నాయి.. కానీ ప్రతి ఉదయం వాడు లేచేది మాత్రం అందరి బాధ్యతలను నెరవేర్చడానికి. ఎవరికీ వాడి బాధ కనిపించదు, అక్కర్లేదు కూడా. తన కుటుంబం నవ్వుతుంటే వాడికి చూడటం మాత్రమే ఇష్టం. దానికోసం ఏడవడానికీ, బాధపడటానికి కూడా సమయం లేకుండా పరుగులు తీస్తుంటాడు..

వాడికీ ఓ కల వుంది.. సొంత బిజినెస్‌ పెట్టి, తన కష్టంతో ఎదగాలన్న ఆశ. కానీ ఎప్పుడూ ఆ కలలు ... క్యాలెండర్‌ పేజీల వెనుక చిక్కుకుని వుంటాయి.. ప్రతి నెల రెండవ తేదీ వచ్చే జీతం, కొన్ని గంటలలోనే బిల్లుల అగాధంలో గప్చిప్ గా మాయమౌతుంది. రెంటు, కరెంటు, పిల్లల ఫీజులు, పెద్దల మందులు ఇలా ప్రతి రూపాయి వాడికో బాధ్యతగా మారిపోయింది.

వాడి జీతం కేవలం ఒక నంబర్‌ మాత్రమే, కానీ ఆ నంబర్‌ వెనుక వాడు గడిపిన ఎన్నో నిద్రలేని రాత్రులు, మౌనంగా భరించిన ఆందోళనలు, రహస్యంగా ఎడ్చుకున్న క్షణాలు ఎన్నో వుంటాయి.

జీతం వచ్చిన మూడోరోజే వాడి ఖాతాలో “బాలెన్స్‌ జీరో” అని కనిపించినప్పుడు, “నేను కూడా జీరో” అనే వేదన వాడి కళ్ళనుంచి ఎగసిపడుతుంది.

అవును వాడు పోరాడుతున్నాడు.. పరిస్థితులతో, కాలంతో, తన అసహాయతతో.
వాడి యుద్ధానికి ఆయుధాలు లేవు, కానీ తట్టుకునే తపన ఉంది.

చుట్టూ ఉన్నవారు “ఉద్యోగం ఉంది కదా” అంటారు,

కానీ ఎవ్వరికీ తెలియదు ఆ ఉద్యోగం వెనుక వాడి మనసును... వాడు ఎంతలా చంపుకున్నాడో..

తన భార్య, పిల్లలు చిరునవ్వుతో .. వాడిలోని అలసట ఆ క్షణం మాయమౌతుంది.

అయితే అదే సమయంలో మరో ఆలోచన వెంటనే గుచ్చుతుంది.

“వారికోసం ఇంకా ఎక్కువ కష్టపడాలి .. ఇంకా ఏదో చెయ్యాలి”

ఆ ఆలోచన వాడి హృదయంలో ప్రతి రోజూ ఒక చిన్నపాటి యుద్దాన్నే మొదలుపెడుతుంది.

ఆ యుద్ధం లో రక్తం కారదు కానీ మనసును కాల్చేస్తుంది..
ఆ యుద్ధం లో గెలుపు కనిపించదు, కానీ ఓటమి భయపెడుతుంది..
ఆ యుద్ధం తన కోసమేమీ కాదు, తనని నమ్ముకున్న వారిని నిలబెట్టడానికే.

వాడి వేదననకు పేరు లేదు.. వాడి కలలకు వాయిదా పడ్డా, వాడి బాధ్యతలు మాత్రం వాయిదా వేయడు..వాడి త్యాగం “హీరోయిజం” కాదు, “నిత్యజీవిత పోరాటం”.
ఇది దేశం మొత్తంలో లక్షల మంది కథ.

కార్యాలయాల్లో నిశ్శబ్దంగా కూర్చున్న,కుటుంబాల కోసం ప్రాణం త్యాగం చేస్తున్న సాధారణ మనుషుల గాథ.

వాళ్లు సైనికులు కాదు, కానీ ప్రతీరోజూ యుద్ధం చేస్తారు కాలంతో, పరిస్థితులతో, వారితో వారే.. అలాంటి ఓ యోధులకు నా ఈ అక్షర నీరాజనం.. __/\__

మీ..

~~ త్రిశూల్ ~~

Bobby Aniboyina

Monday, November 3, 2025

ఇది అభివృద్దా లేక వినాశనమా ?

 ఇది అభివృద్దా లేక వినాశనమా ?


ఒకప్పుడు ‘ఫ్యూచర్‌ టెక్నాలజీ’ అని గొప్పగా పిలిచిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మన ఫ్యూచర్‌నే మింగేస్తోంది. మనం సృష్టించిన టెక్నాలజీ ఇప్పుడు మన స్థానాన్నే కోరుతుంది..

నిన్నటి వరకు “నాలెడ్జ్‌ పవర్‌” అని నమ్మిన మనిషి, ఇవాళ “AI Power” ముందు బలహీనుడై నిలబడ్డాడు.

అది సహోద్యోగిలా కాదు, ఒక ప్రత్యర్థిలా మారిపోయింది. తన లాప్టాప్ స్క్రీన్‌ పైనే ఇప్పుడు తన స్థానానికి పోటీగా..

AI వలన IT ఉద్యోగుల జీవితాల్లో చోటుచేసుకున్న ఓ నిశ్శబ్ద యుద్ధం గురించి కొంతమేర చర్చ అవసరమనిపించింది.

కంప్యూటర్‌ స్క్రీన్ ముందు గడిపే గంటలు ఇప్పుడు అందరికీ భయంగా మారాయి.
ఎందుకంటే ఎప్పుడైనా ఒక “అప్‌డేట్” వస్తే
తన పనినే కాదు తన భవిష్యత్తుని కూడా రీప్లేస్‌ చేయవచ్చని భయపడుతున్నాడీ మనిషి.



ప్రతి IT ఉద్యోగి మనసులో ఇప్పుడు ఒక ప్రశ్న మెదుల్తోంది.

“నేను చేసేపని AI చేస్తే, మరి నా పరిస్థితేంటి ?”

ఇన్నేళ్లుగా నేర్చుకున్న కోడ్‌లు,
ఎన్నో రాత్రుళ్ళు నిద్రలేని డిడ్లైన్లు,
ఏకాగ్రతతో నిర్మించిన లాజిక్స్,
ఇప్పుడు AI టూల్ ఒక్క సెకన్లో సృష్టిస్తోంది.

మనిషికి ఇప్పుడు తన ప్రతిభపై భయం ఏర్పడింది. తన పని మీద విశ్వాసం కంటే, తన ఉద్యోగం మీద అనుమానం, అసహనం ఎక్కువయింది. ప్రతి కొత్త టెక్నాలజీ అప్‌డేట్‌ ఇప్పుడు అభివృద్ధి కాదు మానవ జీవితంలో ఒక పెద్ద ప్రకంపన.

కంపెనీలకు ఇది “ఎఫిషియెన్సీ”,
కానీ మనిషికి ఇది “ఎగ్జిస్టెన్సీ”.

మనిషి తన జీవితాన్ని మొత్తం పణంగా పెట్టి నిర్మించిన AI ని, ఎందుకు సృష్టించాను అనే ప్రశ్న తనని వెంటాడుతుంది..

ఒకప్పుడు “ప్రోగ్రామింగ్‌ నేర్చుకో, భవిష్యత్తు నీదే” అని చెప్పిన మాటలు, ఇప్పుడు “AI నేర్చుకో, లేకపోతే నీకు భవిష్యత్తే లేదు”గా మారాయి. ఇది ఉద్యోగం కోల్పోతామనే భయం కాదు, తన అవసరం తగ్గిపోతుందనే ఓ నిశ్శబ్ద వేదన. తన మేధస్సుతో నిర్మించిన ప్రపంచం, ఇప్పుడు అదే మేధస్సుతో అతనిని శాసిస్తోంది. ఒకప్పుడు “సిస్టమ్‌ మెంటైనెన్స్‌” అని చెప్పే మనిషి ఇప్పుడు “సిస్టమ్‌ మనిషిని మెంటైన్‌” చేస్తోంది.

AI అనేది ఒక సాంకేతిక విప్లవం కాదేమో, ఇది మనిషి విలువలను అమాంతం లాగేసుకుంటున్న పెనుభూతం.

“క్రియేటివిటీ”, “ఇంటెలిజెన్స్”, “డెడికేషన్” అనే పదాలు ఇప్పుడు డేటా మోడల్స్‌గా మారిపోయాయి.

ఇప్పటి IT ఉద్యోగి భయంతోనే పనిచేస్తున్నాడు. తన స్కిల్స్ రేపు పాతబడిపోతాయేమో అన్న ఆందోళన,

తన కంటే వేగంగా నేర్చుకునే AI తో పోటీపడలేమేమో అనే భయం.. రేపటి సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ తన ఉద్యోగాన్నే అన్‌ఇన్‌స్టాల్‌ చేస్తుందేమో అన్న విచారం. ఇదంతా మనిషిని మానసికంగా కూల్చేస్తుంది..తన కంటి రెప్పపై కునుకులేకుండా చేస్తుంది..
ఇది అభివృద్దా లేక వినాశనమా ?

ఖచ్చితంగా ఇది నా దృష్టిలో అభివృద్ధి కాదు.. మనిషి స్వయానా సృష్టించుకున్న తన వినాశనం..

దీనివల్ల రేపటి భవిష్యత్తు ఏమౌతుందో తెలుసా ?

మనిషి ఆలోచించడం మరచిపోయి.. అనుకరించడం నేర్చుకుంటాడు.

AI ఉంటే అంతా “తానే చేస్తుంది” అనే నమ్మకం పెరుగుతుంది. కానీ అదే సమయంలో మానవ మేధస్సు మెల్లిగా మందగిస్తుంది. ఇది ముందు గుర్తించాలి.. మనిషి సృష్టించిన ఈ జ్ఞానం ... మనిషిని ఆలోచించనీయకుండా తన ఉనికిని కోల్పోయేలా చేస్తుంది..

నిజమే ఒప్పుకుంటాను యంత్రం తప్పు చేయదు, కానీ అందులో క్రియేటివిటీ కూడా ఉండదు.

మనిషి తప్పులు చేస్తాడు, కానీ ఆ తప్పుల్లోనే అతని “సృజనాత్మకత” ఉంటుంది.
ఈ యుగం మనల్ని వేగంగా ముందుకు తీసుకెళ్తోంది, కానీ మనలోని మనిషిని వెనక్కి నెట్టేస్తుంది.

ఇది AI యుగం కాదు, మనిషి తన అస్తిత్వాన్ని అంతే వేగంగా కోల్పోతున్న యుగం.


మీ..

~~ త్రిశూల్ ~~

Bobby Aniboyina

Friday, October 31, 2025

మనసు కంటే స్క్రీనే ఎక్కువగా మాట్లాడుతున్న యుగమిది...

 మిత్రులు అందరూ కుశలమే కదా..


చాలారోజులైంది ...

“విశ్వగమనం” అనే గ్రంధాన్ని పూర్తిచెయ్యడమే ఒక మహాయజ్ఞం లా తలచి సమయాన్ని ఇక్కడ వెచ్చించ లేకపోయాను.. అలాగే ప్రతిలిపిలో “అభినవ సత్య” అనే మరో కథను ఎపిసోడ్స్ వారీగా పెడుతూ మరికాస్త పనిలో మునిగిపోయాను.. అందుకు క్షంతవ్యుణ్ణి __/\__

ఎందుకో ఇవాళ ఏదైనా ఒక టాపిక్ పై రాయాలనిపించింది.. మాక్సిమం కొంచం తక్కువగానే రాసేలా ప్రయత్నిస్తాను.. భయపడకండే ..

కాలం వేగంగా కదిలిపోతున్నట్లే, మన సమాజం కూడా అంతే వేగంగా మారిపోతుంది.. అలా మారిపోతున్న కొన్నిట్లో ఒక విషయాన్ని తీసుకొని అందులో మనం ఏం కోల్పోతున్నామో, అసలు అందులో ఏది నిజం, ఏది మాయ అనే కోణం లో ఓ చిరు వివరణ ఇస్తూ ముఖ్యంగా ఇప్పటి టీనేజర్స్ ని ఉద్దేశించి వ్రాయాలనిపించింది..

సరే ఇక విషయం లోకి వెళ్దాం..


మనసు కంటే స్క్రీనే ఎక్కువగా మాట్లాడుతున్న యుగమిది. నిజమే కదా మరి.. ఇప్పుడు ప్రేమ కూడా ‘ఇంటర్నెట్ స్పీడ్’ లా మారిపోయింది.. ఎంత వేగంగా మొదలవుతుందో, అంతే వేగంగా ముగిసిపోతుంది. ఒక “హాయ్” తో మొదలైన పరిచయం, కొన్ని “చాట్‌లు”, కొన్ని “స్టోరీ రిప్లైలు” తర్వాత మనసు ఒక వైవిధ్యమైన సాంగత్యాన్ని కోరుకుంటుంది.. అందులోంచి ఒక కొత్త ఆశ కలుగుతుంది దానికి పెట్టె కొత్త పేరే “ప్రేమ”

కానీ ఆ ఆశలో ఆత్మీయత చాలా తక్కువగా ఉంటుందని వారికి తెలియదు పాపం..
ఎందుకంటే వారు ప్రేమలో కాదు నిజం లా కనిపించే ఒక భ్రమ లో బ్రతుకుతున్నారు. అందుకే అనేది “మనసు కంటే స్క్రీన్ ఎక్కువగా మాట్లాడుతున్న యుగమిది” అని. మీరు అనుకునే ఇష్టమైన వారు “ఆన్లైన్” లో కనపడినా “టైపింగ్...చేస్తున్నట్లు” కనపడినా “Seen” అయ్యాక వారి నుంచి సమాధానం రాకపోయినా గిలగిలా కొట్టేసుకుంటున్నారు.. ఇంత సున్నితమైన భావన ఇప్పుడు ఇంటర్నెట్ సిగ్నల్‌ మీద ఆధారపడుతుంది అనే విషయం చాలా బాదేస్తుంది.. మనసు మోసపోతే బాధ కాకుండా “Next move” అనే ఆలోచన వెంటనే వచ్చేస్తుంది.

ప్రేమ అనేది ఇప్పుడు ఒక ఎమోజీతో వ్యక్తమవుతుంది, కానీ భావంతో కాదు.

మనుషుల మధ్య సమయంలేదు, కానీ ‘రిలేషన్‌షిప్ స్టేటస్’ మార్చడానికి మాత్రం క్షణాల్లో నిర్ణయాలు తీసుకుంటారు.

గతంలో ప్రేమ ఒక గాఢమైన అనుభూతిగా ఉండేది
ఇప్పుడు అది ఒక ప్రవేట్ స్థలంలో ఒక ఎక్స్పీరియెన్స్ద్ ఎక్స్పర్ మెంట్ అయిపోయింది.. స్టోరీలోనో, రీల్ లోనో ఒక సబ్జెక్ట్ లైన్ వేసేసి గొప్పగా చెప్పుకునే ఓ కొటేషన్ లా మారిపోయింది..

ఎందుకో తెలుసా?

ప్రేమను అభిమానంగా కాకుండా, ఎంటర్‌టైన్‌మెంట్గా చూడడం మొదలెట్టారు.

హృదయాలు ఎప్పుడో ఒకప్పుడు గాయపడుతూ వుంటాయి.. కానీ వాటికి మళ్ళీ ముడి వేయడం నేటి యువత నేర్చుకోలేదు.

తెంచేసుకోవడం, తెంపుకుపోవడమే నేర్చుకున్నారు.. సమస్య వస్తే నిలబడటం మానేసి తప్పించుకుపోవడం నేర్చుకున్నారు.

సహనాన్ని కోల్పోతున్నారు,
సమన్వయాన్ని మర్చిపోతున్నారు
సంయమనం పాటించలేకున్నారు,

ఒకప్పటి ప్రేమల్లో ఒక భయం ఉండేది
“విడిపోతామేమో” అనే ఆలోచనతోనే వెనక్కు చాలామంది తగ్గిపోయేవారు
ఇప్పటి ప్రేమ ఆన్‌లైన్ నోటిఫికేషన్‌లా మారిపోయింది.. వస్తుంది, వెలుతుంది, కనిపిస్తుంది, కవ్విస్తుంది.

ఫోటో చూసి ఇష్టపడి
చాట్‌లో నవ్వుకుని
తరువాత ఆ మనిషి అంతరంగం గురించి తెలుసుకోవాలనే తపన అసలే ఉండదు.

ఈ వేగపు యుగంలో ధైర్యంగా ప్రేమించడం ఒక విప్లవమనే చెప్పాలి..

ఎందుకంటే ఇప్పుడు ప్రేమించడమంటే
“ఎప్పటికీ నీతోనే ఉంటా” అనే మాట కన్నా
“నీతో ఉన్న ఈ క్షణం మాత్రమే” అనేది అప్డేట్ అయ్యింది..

ఇప్పటి యువతరం తెలుసుకోవాల్సింది ప్రేమ కాదు.. ప్రేమ ద్వారా కలిపే బంధాలు, బాంధవ్యాల సమూహారాల సత్యాన్ని..

పెదవి చెప్పే మాట వినగలిగే చెవులు వున్నప్పుడు వాటిని అర్ధం చేసుకునే మనసు ఉండాలి.

ఎమోజీల కంటే లోతైన భావప్రాధాన్యత ఎంతో ముఖ్యమని గ్రహించాలి.

వేల మంది ఫాలోవర్స్ కంటే వెన్నంటే వుండే నిజమైన స్నేహితులను సంపాదించుకోవడమే గొప్ప విషయం అనిపించాలి.

ప్రేమ అనేది ఎప్పుడూ వేగంగా కాదు.. అర్ధం చేసుకునే తత్త్వం నుంచి అది పుడుతుంది,

ఆలోచనతో, పరస్పర నమ్మకం, విశ్వాసంతో, మనిషి మనిషిని నిజంగా అర్థం చేసుకున్నప్పుడు మెల్లిగా పెరుగుతుంది.

ప్రేమను నిజమైన రూపంలో చూడాలంటే మళ్ళి కొత్త యాప్ కావాలనుకుంటారేమో .. కావాల్సింది మనసు.

ప్రేమని వెతకడం కంటే, ప్రేమగా మారటం నేర్చుకో..

ఎందుకంటే ఈ కాలం ఎంత వేగంగా పరుగెత్తినా,
ప్రేమ మాత్రం ఎప్పుడూ నడకలోనే బాగుంటుంది.

అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ ..

మీ..
~~ త్రిశూల్ ~~

Bobby Aniboyina

Thursday, July 3, 2025

అభినవ సత్య.. (1st Part)




అభినవ సత్య.. (1st Part)


పుస్తకాన్ని చదవండి..


“పుస్తకం” అంటే… మనల్ని మనం తిరిగి పరిచయం చేసుకునే దారిలో వేసే మొదటి అడుగు. అంతేకాదు "పుస్తకం” మన జీవితాన్ని మార్చగలిగే శక్తి కలిగిన సాధనం కూడా. ఒక పుస్తకం రాసే రచయిత వెనక ఎన్నో అనుభవాలు, ఆలోచనలు, కలలు, బాధలు దాగి ఉంటాయి. అది కేవలం అక్షరాల సమాహారం కాదు.. అది అతని అంతరాత్మకి ప్రతిరూపం.


ఒక పుస్తకాన్ని రూపొందించడమంటే చిన్న విషయం కానే కాదు. రచయితలో కలిగే ఆలోచన మొదలుకొని, దానిని పదాలుగా మార్చడం, మళ్లీ మళ్లీ చదవడం, సంశోధించడం, దిద్దుబాటు చేయడం, ఆ తరువాత ప్రచురణకు పంపడం.. ఇలా ఈ మార్గం అంతా సవాళ్లతోనే నిండివుంటుంది. చాలామంది రచయితలు తమ స్వంత డబ్బుతో పుస్తకాన్ని ప్రచురించాలనే సంకల్పంతో తమ జీవితాన్ని పణంగా పెట్టిన సందర్భాలు ఎన్నో. అటువంటి పుస్తకాన్ని ఓ పాఠకుడు ఆదరించకపోతే, ఆ రచయిత గుండె ఆగినట్లే అనిపిస్తుంది.

ఈ డిజిటల్ యుగంలో మనం మెల్లగా పుస్తకాల నుండి దూరమవుతుంటే, reels, shorts, videos మన సమయాన్ని లాక్కుంటున్నాయి. ఒక పుస్తకం చదవడానికి గంటలు పట్టవచ్చు, కానీ reels చూస్తే కొన్ని సెకన్లలో ఆనందం వచ్చేస్తుంది. అనే భ్రమలో మనం ఉండిపోయాము. కానీ ఆ చిన్న ఆనందం అంతే త్వరగా పోతుంది. కానీ పుస్తకం అలా కాదు.. నిశ్శబ్ధంలో కూడా మాట్లాడగల ఏకైక శబ్దం పుస్తకానిదే. ఒక పుస్తకాన్ని చదివినప్పుడు కలిగే తృప్తి, అది మనలో కలిగించే ఆలోచన, ఆలోచనల నుండి వచ్చే మార్పు, ఇవేవీ డిజిటల్ స్క్రీన్ ఇవ్వలేవు.

ఒక పుస్తకం మనకు కొత్త ప్రపంచాలను పరిచయం చేస్తుంది. చరిత్రలోకి తీసుకెళ్తుంది, అది మన మనసును లోతుగా ఆలోచించేలా చేస్తుంది. మనలో ఆత్మపరిశీలనను కలిగిస్తుంది, మన జీవన దారిని మారుస్తుంది. పుస్తకాలు మన జీవితాల్లోకి నిదానంగా వచ్చినా, అవి శాశ్వతంగా ఉండిపోతాయి. ఈ కాలంలో మనం పుస్తకాలను మర్చిపోయాం... కానీ అవి మాత్రం మన కోసం ఓ చిరునవ్వుతో ఎదురుచూస్తూనే ఉన్నాయి.

ఇప్పటి యువతలో చాలా మందికి పుస్తకాల పట్ల ఆసక్తి తగ్గిపోయింది. ఇది భవిష్యత్తు తరాల వారికి తీరని లోటు. ఒక మంచి పుస్తకం మన జీవితంలో ఒక మౌనంగా వున్న మిత్రుడు లాంటిది. అది మనతో మాట్లాడదు, కానీ మనల్ని నడిపిస్తుంది. పుస్తకాలు కేవలం సమాచారం కోసమే కాదు, మన సంస్కృతి, జీవనవేదం, విలువల భాండాగారం. పుస్తకాలను వదిలేస్తే మనం మన మూలాలనూ, మన అనుభూతులనూ వదిలేసినట్టే.

అందుకే, పుస్తకాలను తిరిగి చదవండి. పుస్తకాన్ని కొనడం అనేది కేవలం వ్యయం కాదు, అది ఒక రచయితపై మీరు చూపిన గౌరవం, ఒక కొత్త ఆలోచనపై మీరు చూపిన ఆదరణ. పిల్లలకూ పుస్తక ప్రేమను అలవాటు చేయండి. మీరు కట్టుకునే ప్రతి ఇంటిలోనూ ఓ మూల చిన్న గ్రంధాలయం ఉండేలా చూడండి. రచయిత రాసిన ప్రతి అక్షరం... అతని హృదయం రాల్చిన ఓ విలక్షణ చినుకే.

పేజీల మధ్య దాగినవి కథలు మాత్రమే కాదు... అవి మన కన్నీళ్లు, నవ్వులు, ఆశలు ఇలా ఎన్నో..భావాలు...అలాంటి వారిని దయచేసి ఆదరించండి. వారి ప్రయాసకు, ఇంకా చదివేవారు ఉన్నారనే వారు పెట్టుకున్న నమ్మకానికి ఓ ఊతమివ్వండి. కానీ ఇదంతా మొదలవ్వాల్సింది మన దగ్గర నుంచే. అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ .. ఓ సాటి రచయిత..

చివరగా.. ఒక్కమాట..

ఒక్కసారి పుస్తకాన్ని చదవండి.. ఒక్కసారి రచయిత మనసుని వినండి...

స్వస్తి..

~~ త్రిశూల్ ~~

Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

Thursday, April 10, 2025

అందాల కలహంస...

 


వర్షించే మబ్బుల పందిరి కింద
రంగురంగుల వస్త్రాలు కట్టిన
తుమ్మెద వంటి “చైతన్య”త నీ వదనం..!
అందుకేనేమో
మనసంతా ఏదో తుళ్ళింత
తనువంతా ఏదో గిలిగింత
నీతో మాట్లాడుతున్న ప్రతీసారి
నాతో నేనే మాట్లాడుతున్న భావన
చదివేసిన పుస్తకాన్ని
మరోసారి చదువుతున్న ఓ కేరింత
దానివల్లెనేమో విభ్రమ నేత్రాలతో
నా కళ్ళు అలా స్తబ్దుగా వుండిపోతాయి..!

నీ పాదపద్మము తాకిడికి
వసంతకాలపు కోయిలై ప్రకృతి లోని
అణువణువు పరవశమ్మొందే,
అరుణోదయ “చైతన్య” రూపా లావణ్య విలాసినీ
చతుర్విధ పరి పరి విధ సమ్మోహనా ధారిణి
ఏమని సముద్భూషింప
మరేమని ఆరాధింప..!!

అలలవలె అల్లుకున్న నిశీధి కురులు…
విహంగముల చూపులై వికసించిన ఆ కన్నుల లోతుల్లో
మనోహర రూపమై నిలిచిన ఆ మౌనం,
ఆనంద, తాపత్రయ, సాంత్వన, చందనమై,
తళుక్కున మెరిసి..మము మురిపించే కొంటెతనం !
నీలికలువల వర్ణమై విరబూసిన ఆ చెక్కిలి చిరుచెంపలు,
లేలేత చివుర్లు విచ్చుకున్న దోర పెదవంచుల చిరునవ్వులు
కంపించే కనుల అంచుల్లో సప్త ధాతువులను దాచి,
మాటల సమ్మోహన భావాస్త్రాలను సంధించే
స్నేహ స్వరమూ, సర్వమూ నీవే..!!

ఓ చైత్ర మాసపు “చైతన్య”మా!!!
గజగమిని నడక నాట్య గతిన,
నవనీత చూపు నీలాల గలిన,
కులుకు లొలుకు నును సిగ్గుల రీతిన
అభినయించు మా ఆనంద నందనవనమున..!!

నిర్మలమైన మనస్సు,
ఉషస్సు వంటి వర్చస్సు
నడకలో లావణ్యం
నడతలో సౌమ్యగుణం
చూపుల్లో “చైతన్య” అభినయం,

వెరసి అందాల కలహంసకి పుట్టినరోజు శుభసంతోషాలు..!!

~ ~ త్రిశూల్ ~ ~

Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

Tuesday, April 8, 2025

విశ్వ గమనం ...

 


ఆత్మీయులు కొందరు అడుగుతున్నారు ఎందుకు సోషల్ మీడియా కు రాకుండా మానేసారు అని. అలా అడిగేవారు ఉండటం నిజంగా నా అదృష్టం.. మీకు ధన్యవాదాలు తెల్పుతూ.. ఒక చిన్న విషయం చెప్పాలి.


కొన్ని రోజులుగా ఒక కథ రాస్తున్నాను.. అది పబ్లిష్ చేసే ఆలోచనతోనే రాస్తున్నాను.. నేను నేర్చుకున్న నా పూర్తి అక్షర సామర్ధ్యాన్ని, నా సమయాన్ని వెచ్చించి ఈ కథ రాస్తున్నాను.. ఇది నా జీవితంలోనే ఒక మైలురాయిగా ఉండబోతుందని విశ్వసిస్తున్నాను.. అందుకోసమే ఇక్కడ సమయాన్ని ఇవ్వలేకపోయాను.. మిమ్మల్ని నా చతుర్విధ కవితలతో అలరించ లేకపోయాను అందుకు క్షంతవ్యుణ్ణి ..
ఇది చదివి మీ అభిప్రాయం చెప్పండి.. అది ఒక్కరైనా పర్వాలేదు.. మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటాను..

ఇక కథ గురించి..

అతను ఒక అన్వేషకుడు,
శిలాశాసనాల్లో చిరునామా కోల్పోయిన కథనాలను తిరిగి లిపిబద్ధం చేసే శాస్త్రజ్ఞుడు.
కానీ తన వంశ వృక్షంలో అదృశ్యమైన ఒక అస్తిత్వాన్ని వెతికే ఓ ప్రయాణికుడుగా ఎలా మారాడు ?
ఇది కథ కాదు,
ఎన్నో కాలాలను నిశ్శబ్ధంగా దాటి వచ్చిన ఓ నిగూఢ రహస్యం.

ఇందులో "ఒకరు ప్రశ్నఅయితే … మరొకరు జవాబు”…
కాని ఎవరు ప్రశ్న? ఎవరు జవాబు ? అది తెలియాలంటే మన కథను చదవాల్సిందే..

కాలం మనం నమ్మేలా సృష్టించిన మాయ మాత్రమే…
మన బంధాలు, మన ప్రేమ … అవి ఎప్పటికీ శాశ్వతంగా వుంటాయి... అలాంటి ఓ కాలాన్నే ప్రతిఘటించే మహా కావ్యమే నా ఈ “విశ్వ గమనం”
ఈ “విశ్వ గమనం” నా కలల నుండి కాదు… నా మౌనపు లోతుల్లోంచి రూపందాల్చి మీ ముందుకు రాబోతుంది.. మీ ఇంటి బిడ్డగా నన్ను మనసారా ఆశీర్వదించండి.

ఈ కథలో…

ప్రతి పుట ఓ శాసనం.
ప్రతి సంభాషణ ఓ సంకేతం.
ప్రతి పాత్ర ఒక ప్రాశస్త్య పూర్వక ముద్ర.

“అనిరుధ్” – ఒక యుగాంతరపు ప్రయాణికుడు.
ఈ రోజుల్లో పుట్టినప్పటికీ, అతని గుండె గతాన్ని పలుకుతోంది.
ఆత్మ చరిత్రలో తప్పిపోయిన తన ఆనవాళ్లను వెతుక్కుంటుంది.
అతని కలలు నిద్రలో కంటున్నవి కావు… గతం మౌనాన్ని విడిచి కాలం తనతో మాటలాడుతున్న నిజాలని తనకు అర్థమవుతుంది.
“అనన్య” – వెనకాల నడుస్తూనే ముందున్న దారి చూపించే ఓ ఆత్మీయత.
అనిరుధ్ తనను తాను వెతుక్కుంటూ పోతుంటే,
అతనికి తెలియకుండా ఆమె అతన్ని గమనిస్తుంది, అతనితో కలిసి నడుస్తుంది…
ఈ కథలో మీరు చరిత్రని చూస్తారు, కానీ అది పాఠశాలలో చదివిన చరిత్ర కాదు.
ఇది మన శరీరాల్లో శతాబ్దాలుగా ఇంకిపోయిన కాలసాక్షికి ఓ నిదర్శనం.
ప్రతీ అక్షరం... ఒక శబ్దం కాదు, ఒక జ్ఞాపకం లా .
ప్రతీ సంభాషణ... ఒక సంధి కాదు, ఒక తపస్సు లా పాఠకులను మంత్రముగ్ధులను చేస్తూ ఈ కథ సాగుతుందని సగర్వంగా చెప్పగలను..

ఒక వైపున పురాతన శాసనాలు, మరో వైపున ఆధ్యాత్మిక అన్వేషణ
ఒక వైపున శైవతత్వం, మరో వైపున మనస్సు పలికే మౌన బాషకు కళ్ళు చెప్పే సమాధానాలు..
ఇదంతా కలిసినప్పుడు… "భవిష్యత్తును వెతుక్కుంటూ, గతాన్ని తడుముతున్న ఓ మధురానుభూతి" ప్రతీ పాఠకునికి కలుగుతుంది.

ఇది కథ కాదు… ఒక ఆత్మీయ ప్రయాణం
ఇది ఒక వ్యక్తి అన్వేషణ కాదు… ఒక తరం మౌనంగా విస్మరించిన మన చరిత్ర.
ప్రతి లైన్ మౌనంగా మీలో ఊహలు రేకెత్తిస్తుంది.

"హేమకూటం అంటే ఏంటి ? అది నిజంగా ఒక ప్రదేశమా?"
"నందికేశ్వరుని వారసత్వం ఎక్కడ దాగుంది?"
"కాలచక్రం తిరిగినప్పుడు శబ్దం ఏమని పలికింది?"
ఇలాంటి ఎన్నో ప్రశ్నలు పాఠకుడిని కథలో ఇంకా లోతుగా లాక్కొస్తాయి.
ప్రేమలో మాటలకన్నా మౌనం ఇంకా గొప్పది .. అదెలాంటి మౌనం ? అనే ఉచ్చుకత
ఇక్కడ ప్రేమ ఒక ఊహ కాదు, ఒక "కాలాంతరపు అనుభూతి."
"ఇది కొత్త బంధమా? లేక ఒకప్పుడు విరిగిపోయినదాన్ని తిరిగి కలపడానికి సమయమే దారి చూపుతోందా?" ఇలాంటి ఎన్నో ఊహలతో మిమ్మల్ని ఈ కథ కట్టిపడేస్తుంది..

"గతానికి మరణం లేదు. అది శిలలపై చెక్కినా, మన గుండెల్లో రగిలినా … ఏదో ఒక రోజు తిరిగి మనకు తనని తాను పరిచయం చేసుకుంటూ ఎడురుపడుతుంది."
"కాలం మౌనంగా వెళ్తుంది. కానీ… ఎవరో ఒకరు దాన్ని చదవగలిగితే, అది తన మౌనం విడిచి మాట్లాడుతుంది."

మీరు ఈ పుస్తకం చేతుల్లోకి తీసుకున్నప్పుడు...
మీరు కూడా ఒక ప్రయాణానికి సిద్ధమవుతారు... చదువుతూ నాతో ప్రయాణిస్తారు..
ఈ కథ కేవలం చదివే కథ మాత్రమే కాదు… అది జ్ఞాపకాల దారిలో నడుస్తూ మనసుతో చూసే ఓ అద్బుత ప్రయాణం. నన్ను నమ్మండి.. మాట ఇస్తున్నాను. మిమ్మల్ని ఎప్పటికీ నిరుత్సాహ పరచను.. గప్ చిప్గా మిమ్మల్ని నాతో తీసుకెళ్తాను..

~ ~ త్రిశూల్ ~ ~
Written by: Bobby Aniboyina
Mobile: 9032977985
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==