ఇది అభివృద్దా లేక వినాశనమా ?
ఒకప్పుడు ‘ఫ్యూచర్ టెక్నాలజీ’ అని గొప్పగా పిలిచిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మన ఫ్యూచర్‌నే మింగేస్తోంది. మనం సృష్టించిన టెక్నాలజీ ఇప్పుడు మన స్థానాన్నే కోరుతుంది..
నిన్నటి వరకు “నాలెడ్జ్ పవర్” అని నమ్మిన మనిషి, ఇవాళ “AI Power” ముందు బలహీనుడై నిలబడ్డాడు.
అది సహోద్యోగిలా కాదు, ఒక ప్రత్యర్థిలా మారిపోయింది. తన లాప్టాప్ స్క్రీన్ పైనే ఇప్పుడు తన స్థానానికి పోటీగా..
AI వలన IT ఉద్యోగుల జీవితాల్లో చోటుచేసుకున్న ఓ నిశ్శబ్ద యుద్ధం గురించి కొంతమేర చర్చ అవసరమనిపించింది.
కంప్యూటర్ స్క్రీన్ ముందు గడిపే గంటలు ఇప్పుడు అందరికీ భయంగా మారాయి.
ఎందుకంటే ఎప్పుడైనా ఒక “అప్‌డేట్” వస్తే
తన పనినే కాదు తన భవిష్యత్తుని కూడా రీప్లేస్ చేయవచ్చని భయపడుతున్నాడీ మనిషి.
ప్రతి IT ఉద్యోగి మనసులో ఇప్పుడు ఒక ప్రశ్న మెదుల్తోంది.
“నేను చేసేపని AI చేస్తే, మరి నా పరిస్థితేంటి ?”
ఇన్నేళ్లుగా నేర్చుకున్న కోడ్‌లు,
ఎన్నో రాత్రుళ్ళు నిద్రలేని డిడ్లైన్లు,
ఏకాగ్రతతో నిర్మించిన లాజిక్స్,
ఇప్పుడు AI టూల్ ఒక్క సెకన్లో సృష్టిస్తోంది.
మనిషికి ఇప్పుడు తన ప్రతిభపై భయం ఏర్పడింది. తన పని మీద విశ్వాసం కంటే, తన ఉద్యోగం మీద అనుమానం, అసహనం ఎక్కువయింది. ప్రతి కొత్త టెక్నాలజీ అప్‌డేట్ ఇప్పుడు అభివృద్ధి కాదు మానవ జీవితంలో ఒక పెద్ద ప్రకంపన.
కంపెనీలకు ఇది “ఎఫిషియెన్సీ”,
కానీ మనిషికి ఇది “ఎగ్జిస్టెన్సీ”.
మనిషి తన జీవితాన్ని మొత్తం పణంగా పెట్టి నిర్మించిన AI ని, ఎందుకు సృష్టించాను అనే ప్రశ్న తనని వెంటాడుతుంది..
ఒకప్పుడు “ప్రోగ్రామింగ్ నేర్చుకో, భవిష్యత్తు నీదే” అని చెప్పిన మాటలు, ఇప్పుడు “AI నేర్చుకో, లేకపోతే నీకు భవిష్యత్తే లేదు”గా మారాయి. ఇది ఉద్యోగం కోల్పోతామనే భయం కాదు, తన అవసరం తగ్గిపోతుందనే ఓ నిశ్శబ్ద వేదన. తన మేధస్సుతో నిర్మించిన ప్రపంచం, ఇప్పుడు అదే మేధస్సుతో అతనిని శాసిస్తోంది. ఒకప్పుడు “సిస్టమ్ మెంటైనెన్స్” అని చెప్పే మనిషి ఇప్పుడు “సిస్టమ్ మనిషిని మెంటైన్” చేస్తోంది.
AI అనేది ఒక సాంకేతిక విప్లవం కాదేమో, ఇది మనిషి విలువలను అమాంతం లాగేసుకుంటున్న పెనుభూతం.
“క్రియేటివిటీ”, “ఇంటెలిజెన్స్”, “డెడికేషన్” అనే పదాలు ఇప్పుడు డేటా మోడల్స్‌గా మారిపోయాయి.
ఇప్పటి IT ఉద్యోగి భయంతోనే పనిచేస్తున్నాడు. తన స్కిల్స్ రేపు పాతబడిపోతాయేమో అన్న ఆందోళన,
తన కంటే వేగంగా నేర్చుకునే AI తో పోటీపడలేమేమో అనే భయం.. రేపటి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తన ఉద్యోగాన్నే అన్‌ఇన్‌స్టాల్ చేస్తుందేమో అన్న విచారం. ఇదంతా మనిషిని మానసికంగా కూల్చేస్తుంది..తన కంటి రెప్పపై కునుకులేకుండా చేస్తుంది..
ఇది అభివృద్దా లేక వినాశనమా ?
ఖచ్చితంగా ఇది నా దృష్టిలో అభివృద్ధి కాదు.. మనిషి స్వయానా సృష్టించుకున్న తన వినాశనం..
దీనివల్ల రేపటి భవిష్యత్తు ఏమౌతుందో తెలుసా ?
మనిషి ఆలోచించడం మరచిపోయి.. అనుకరించడం నేర్చుకుంటాడు.
AI ఉంటే అంతా “తానే చేస్తుంది” అనే నమ్మకం పెరుగుతుంది. కానీ అదే సమయంలో మానవ మేధస్సు మెల్లిగా మందగిస్తుంది. ఇది ముందు గుర్తించాలి.. మనిషి సృష్టించిన ఈ జ్ఞానం ... మనిషిని ఆలోచించనీయకుండా తన ఉనికిని కోల్పోయేలా చేస్తుంది..
నిజమే ఒప్పుకుంటాను యంత్రం తప్పు చేయదు, కానీ అందులో క్రియేటివిటీ కూడా ఉండదు.
మనిషి తప్పులు చేస్తాడు, కానీ ఆ తప్పుల్లోనే అతని “సృజనాత్మకత” ఉంటుంది.
ఈ యుగం మనల్ని వేగంగా ముందుకు తీసుకెళ్తోంది, కానీ మనలోని మనిషిని వెనక్కి నెట్టేస్తుంది.
ఇది AI యుగం కాదు, మనిషి తన అస్తిత్వాన్ని అంతే వేగంగా కోల్పోతున్న యుగం.
మీ..
~~ త్రిశూల్ ~~
Bobby Aniboyina

No comments:
Post a Comment