మిత్రులు అందరూ కుశలమే కదా..
చాలారోజులైంది ...
“విశ్వగమనం” అనే గ్రంధాన్ని పూర్తిచెయ్యడమే ఒక మహాయజ్ఞం లా తలచి సమయాన్ని ఇక్కడ వెచ్చించ లేకపోయాను.. అలాగే ప్రతిలిపిలో “అభినవ సత్య” అనే మరో కథను ఎపిసోడ్స్ వారీగా పెడుతూ మరికాస్త పనిలో మునిగిపోయాను.. అందుకు క్షంతవ్యుణ్ణి __/\__
ఎందుకో ఇవాళ ఏదైనా ఒక టాపిక్ పై రాయాలనిపించింది.. మాక్సిమం కొంచం తక్కువగానే రాసేలా ప్రయత్నిస్తాను.. భయపడకండే ..
కాలం వేగంగా కదిలిపోతున్నట్లే, మన సమాజం కూడా అంతే వేగంగా మారిపోతుంది.. అలా మారిపోతున్న కొన్నిట్లో ఒక విషయాన్ని తీసుకొని అందులో మనం ఏం కోల్పోతున్నామో, అసలు అందులో ఏది నిజం, ఏది మాయ అనే కోణం లో ఓ చిరు వివరణ ఇస్తూ ముఖ్యంగా ఇప్పటి టీనేజర్స్ ని ఉద్దేశించి వ్రాయాలనిపించింది..
సరే ఇక విషయం లోకి వెళ్దాం..
కానీ ఆ ఆశలో ఆత్మీయత చాలా తక్కువగా ఉంటుందని వారికి తెలియదు పాపం..
ఎందుకంటే వారు ప్రేమలో కాదు నిజం లా కనిపించే ఒక భ్రమ లో బ్రతుకుతున్నారు. అందుకే అనేది “మనసు కంటే స్క్రీన్ ఎక్కువగా మాట్లాడుతున్న యుగమిది” అని. మీరు అనుకునే ఇష్టమైన వారు “ఆన్లైన్” లో కనపడినా “టైపింగ్...చేస్తున్నట్లు” కనపడినా “Seen” అయ్యాక వారి నుంచి సమాధానం రాకపోయినా గిలగిలా కొట్టేసుకుంటున్నారు.. ఇంత సున్నితమైన భావన ఇప్పుడు ఇంటర్నెట్ సిగ్నల్ మీద ఆధారపడుతుంది అనే విషయం చాలా బాదేస్తుంది.. మనసు మోసపోతే బాధ కాకుండా “Next move” అనే ఆలోచన వెంటనే వచ్చేస్తుంది.
ప్రేమ అనేది ఇప్పుడు ఒక ఎమోజీతో వ్యక్తమవుతుంది, కానీ భావంతో కాదు.
మనుషుల మధ్య సమయంలేదు, కానీ ‘రిలేషన్‌షిప్ స్టేటస్’ మార్చడానికి మాత్రం క్షణాల్లో నిర్ణయాలు తీసుకుంటారు.
గతంలో ప్రేమ ఒక గాఢమైన అనుభూతిగా ఉండేది
ఇప్పుడు అది ఒక ప్రవేట్ స్థలంలో ఒక ఎక్స్పీరియెన్స్ద్ ఎక్స్పర్ మెంట్ అయిపోయింది.. స్టోరీలోనో, రీల్ లోనో ఒక సబ్జెక్ట్ లైన్ వేసేసి గొప్పగా చెప్పుకునే ఓ కొటేషన్ లా మారిపోయింది..
ఎందుకో తెలుసా?
ప్రేమను అభిమానంగా కాకుండా, ఎంటర్‌టైన్‌మెంట్గా చూడడం మొదలెట్టారు.
హృదయాలు ఎప్పుడో ఒకప్పుడు గాయపడుతూ వుంటాయి.. కానీ వాటికి మళ్ళీ ముడి వేయడం నేటి యువత నేర్చుకోలేదు.
తెంచేసుకోవడం, తెంపుకుపోవడమే నేర్చుకున్నారు.. సమస్య వస్తే నిలబడటం మానేసి తప్పించుకుపోవడం నేర్చుకున్నారు.
సహనాన్ని కోల్పోతున్నారు,
సమన్వయాన్ని మర్చిపోతున్నారు
సంయమనం పాటించలేకున్నారు,
ఒకప్పటి ప్రేమల్లో ఒక భయం ఉండేది
“విడిపోతామేమో” అనే ఆలోచనతోనే వెనక్కు చాలామంది తగ్గిపోయేవారు
ఇప్పటి ప్రేమ ఆన్‌లైన్ నోటిఫికేషన్‌లా మారిపోయింది.. వస్తుంది, వెలుతుంది, కనిపిస్తుంది, కవ్విస్తుంది.
ఫోటో చూసి ఇష్టపడి
చాట్‌లో నవ్వుకుని
తరువాత ఆ మనిషి అంతరంగం గురించి తెలుసుకోవాలనే తపన అసలే ఉండదు.
ఈ వేగపు యుగంలో ధైర్యంగా ప్రేమించడం ఒక విప్లవమనే చెప్పాలి..
ఎందుకంటే ఇప్పుడు ప్రేమించడమంటే
“ఎప్పటికీ నీతోనే ఉంటా” అనే మాట కన్నా
“నీతో ఉన్న ఈ క్షణం మాత్రమే” అనేది అప్డేట్ అయ్యింది..
ఇప్పటి యువతరం తెలుసుకోవాల్సింది ప్రేమ కాదు.. ప్రేమ ద్వారా కలిపే బంధాలు, బాంధవ్యాల సమూహారాల సత్యాన్ని..
పెదవి చెప్పే మాట వినగలిగే చెవులు వున్నప్పుడు వాటిని అర్ధం చేసుకునే మనసు ఉండాలి.
ఎమోజీల కంటే లోతైన భావప్రాధాన్యత ఎంతో ముఖ్యమని గ్రహించాలి.
వేల మంది ఫాలోవర్స్ కంటే వెన్నంటే వుండే నిజమైన స్నేహితులను సంపాదించుకోవడమే గొప్ప విషయం అనిపించాలి.
ప్రేమ అనేది ఎప్పుడూ వేగంగా కాదు.. అర్ధం చేసుకునే తత్త్వం నుంచి అది పుడుతుంది,
ఆలోచనతో, పరస్పర నమ్మకం, విశ్వాసంతో, మనిషి మనిషిని నిజంగా అర్థం చేసుకున్నప్పుడు మెల్లిగా పెరుగుతుంది.
ప్రేమను నిజమైన రూపంలో చూడాలంటే మళ్ళి కొత్త యాప్ కావాలనుకుంటారేమో .. కావాల్సింది మనసు.
ప్రేమని వెతకడం కంటే, ప్రేమగా మారటం నేర్చుకో..
ఎందుకంటే ఈ కాలం ఎంత వేగంగా పరుగెత్తినా,
ప్రేమ మాత్రం ఎప్పుడూ నడకలోనే బాగుంటుంది.
అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ ..
మీ..
~~ త్రిశూల్ ~~
Bobby Aniboyina

 
No comments:
Post a Comment