నేనొక కలల వర్తకుడను
నన్ను “కవి” అనకండి
రాత్రి కలలకోసమే నిద్రపోతాను
వేకువన కవితనై మేల్కొంటాను..!!
వర్షించే మబ్బుల పందిరి కింద
రంగురంగుల వస్త్రాలు కట్టిన
సీతాకోకచిలుకలు ముచ్చట్లాడుతున్నాయ్
గానభజానాతో గొంతు సవరిస్తూ
కోకిలలు పాటకచ్చేరికి సన్నద్దం చేస్తున్నాయ్
పువ్వుల పుప్పొడి మనసులను కొల్లగొట్టి
తేనెటీగలు వయ్యారాలు పోతున్నాయ్
ఝంఝామారుత జోరీగలై
తుమ్మెదలు సరాగాలాడుతున్నాయ్..!!
వేకువనే ఆహారం కోసం
దూర తీరాలకు వెళ్ళిన తల్లిపక్షి
రాత్రి కురిసిన వర్షానికి
ఎక్కడో తలదాచుకున్నట్లుంది
ఈ హంగామాతో మేల్కొన్న
గుడ్డులోని ఒంటరి పసి పిల్ల
పిగిలడానికి సిద్దమౌతోంది..!!
ఆ రెండు చెట్ల మధ్యన విశ్రమిస్తున్న
చిట్ట చివరి చంద్రుని కిరణం
ఏదో చెప్పాలని రేయంతా ఆరాటపడింది
రెప్పలు మూసుకుపోయే పాడు నిద్ర
తనకి ఆ అవకాశం ఇవ్వలేదు..!
అలిగిన చంద్రుడు ప్రక్కరోజు
అమాసై మౌనంగా ముసిఱాడు..!!
రాత్రంతా పహారా కాసిన చెట్ల కొమ్మలు
పొద్దున్నే చేతులు చేతులు కలుపుకొని
ప్రేమగా కబుర్లాడుతున్నాయి
ఒకే మట్టిని తిన్న చెట్ల వేర్లు
రుచికరమైన ఎన్నో ఫలాలను పంచుతున్నాయి
ఒకే గాలిని నింపుకున్న వేణువు
సప్త రాగాలను పలుకుతాయి
విభ్రమ నేత్రాలతో
తలచి తలచి చూడాలే కాని
కనిపించే ప్రతీది ఓ అద్బుతమే..!!
లోకబాంధవ్యుని కోట్ల వీర్య కిరణాలతో
ప్రకృతి కాంత పులకరించి పోతుంది
సమస్తమూ పచ్చదనముతో మురిసిపోతుంది..!!
Written by: Bobby Aniboyina
Mobile: 9032977985