మదిలో మెదిలే అనేకానేక ప్రవాహ సంద్రంలో.... (కరుణ, శాంత, రౌద్ర, వీరాద్భుత, హాస్య, శృంగార, భయానక, బీభత్సములు, నవరసములు, రతి, శోక, నిర్వేద, క్రోధోత్సాహా, విస్మయ, భయ, జుగుప్సలు, నవ, స్థాయి, భవములు) ఇలా కొన్నిటిని ఏర్చి, కూర్చి సమాజహితానికి ఓ అక్షర ఖడ్గంగా మార్చే సంకల్పమే నా ఈ అక్షరారణ్యం ....
Saturday, October 8, 2022
మిణుగురు...
మెల్లిగా చీకటి పడుతోంది ఏదో రాద్దామని కలమును చే బూని ఆలోచించడం మొదలుపెట్టాను దట్టమైన మేఘాలు ముసురు తీస్తున్నాయి ఎక్కడినుంచో ఓ మిణుగురు మిణుకు మిణుకు మంటూ కలము పట్టిన మునివేళ్ళ మధ్యన నక్కి కూర్చుంది ఎన్ని ప్రవాహాలు దాటి వచ్చిందో ఎన్ని శిఖరాలను అధిరోహించిందో కనిపిస్తున్న ప్రపంచం కనలేని బరువై అనిపించిందేమో రెక్కలు చాస్తూ నావైపే నిస్తేజంగా చూస్తూ వుంది తన మనసుని అర్ధం చేసుకునే కవి నాలో వుంటే ఎంత బాగుండో అనిపించింది..!! నాకు తెలియకుండానే నాలోని భావోద్వేగం తారాస్థాయికి చేరుకుంది ఎవరో నన్ను ఆప్యాయంగా స్పృశిస్తున్న భావన ఇన్నేళ్ళలో ఎప్పుడూ చూడని ఓ మహా స్పర్శ చిరుపూతల వంటి వెచ్చని శ్వాస ఏమూలనుంచో తేలుకుంటూ వచ్చి నా ముఖాన్ని ఆర్తిగా తడిమింది క్షణంపాటు ఓ మైమరుపు ఒక్కసారిగా నాలో నిశ్శబ్దం..!! ఆ నిశ్శబ్దంలో ఏవో మాటలు మెల్లిగా వినిపిస్తున్నాయి..!! రాత్రి కురిసిన వర్షానికి తుంటరి తూనీగ రెక్కలు ఆరలేదట మధువును గ్రోలే తుమ్మెద మూడు దినాలనుంచి కనపడలేదట నాలా వుండే నా స్నేహితుల సమూహం ఎటో దారితప్పిందట రాత్రి ఓ పిల్లాడి కేరింతల చేయి తాకిడికి ఎడమ రెక్క నొప్పెడుతోందట రుచికరమైన ఆహారాన్ని ఆరగించి ఎన్నోదినాలు అయిందట ఆపకుండా ఎన్ని కబుర్లు చెప్తుందో ఈ మిణుగురు..!! నాకు తారసపడ్డ ఈ ఏకాంత క్షణాలలో మిణుగురుతో గడిపిన ఈ సాయంత్రపు జాడలు ఓ అద్భుతమనే చెప్పాలి..!! Written by: Bobby Aniboyina Mobile : 9032977985
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment