తన కోసం
గతించిన కాలాన్ని
భావాల త్రాడుతో కట్టి
వెనక్కి లాక్కురావాలని వుంటుంది
భూత, భవిష్య, వర్తమానాలపై
తనకోసం యుద్ధం చెయ్యాలని వుంటుంది..!!
కలతల మానసపు మహా సముద్రంలో మున్కలేస్తూ
సమ సమాజం వెదజల్లే వెన్నెల వెలుగుల్లో
ఊపిరి పీల్చుకుంటూ
నిరాశా నిస్పృహల చీకట్ల హృద్గగనంలో
కన్నీటి తరంగాలు తన నుంచి
ఎగసెగసి పడుతున్న ప్రతీ సారి
నాలో ఓ నిర్లిప్తత..!!
కానీ
పిడికెడంత మనసు
ఆకాశమంత అల్లరి తనది..!
మనసు నెమ్మది లేనప్పుడు
గాలికి కొట్టుకొచ్చిన వేద మంత్రం
చెవిలో పడినంత హాయిగా
స్పృశిస్తుందామె గాత్ర మాధుర్యం..!
సిలువలోని స్వచ్ఛతను
నమాజ్ లోని సత్యమును
ఓంకారపు పవిత్రతను
కన్నార్పకుండా తనలో తానె
దర్శించగలిగే తాత్వికత తనది..!!
తనని హత్తుకున్న పిల్లగాలి సైతం
పరువపు గాలై గుబాళిస్తుంది
తనని చూసిన చెట్ల కొమ్మలు
ఊయలలూపే పువ్వారులై వర్షిస్తుంటాయి
తనని తాకిన వర్షపు జల్లు
తమకమపు తన్మయత్వమును పొందుతుంటాయి
ఆకాశపు నీలి మేఘాలు
చూపుల్ని పారేసుకుని ఓరకంటితో తననే చూస్తుంటాయి
పుడమి తన పాద స్పర్శకు
అమ్మతనపు అనురాగభావమై మురిసిపోతుంటుంది..!!
తనని చూస్తుంటే ఊపిరి కూడా భారమైపోతుంది
తను దగ్గరకు వస్తే గుండె కూడా వేగం పుంజుకుంటుంది
నిజంగానే తానో మంత్రించి విడిచిన మహా సుగంధము
కవ్వించి సమ్మోహపరిచే మన్మధుని నాళీకము..!!
తానో అద్బుతం అంతే ..!!
Writtn by: Bobby Aniboyina
Mobile : 9032977985
Nice nani
ReplyDelete