Saturday, August 6, 2022

రా.. నాతోపాటు.. !!చీకట్లో వెలుగును ఊహించుకుంటూ
కలలు కనడమే అతడి నైపుణ్యత
అదృశ్య సౌందర్యాలన్నిటినీ
అస్పృశ్యంగా అన్వేషించడమే అతని ప్రతిభ
కనురెప్పల కదలికల్లో ఆవిష్కరించబడుతున్న
అనంత సూర్యోదయాల్ని తిలకిస్తూ,
విచ్చుకుంటున్న ప్రతీ పువ్వూ
సువాసనల్ని గప్చిప్గా ఆస్వాదించడం తన అలవాటు..!!

సాహిత్యాన్ని సాన్నిహిత్యంగా భావించే
ఆ రోజులెప్పుడో పోయాయి
ఇప్పుడు ఉన్నదంతా
కాపీ కవితల ఖజానాలే..!
బూతు రాతలతో
అగౌరవ కేతనం ఎగరేస్తున్న
ఈ మానవప్రపంచాన్ని చూస్తూ నిర్జీవంగా పడిఉన్నాను..!
ఇప్పటివారికవే రుచిస్తున్నాయి మరి..!!

రా
నాతోపాటు
ఉషస్సులో కలిసిపోతున్న
మహా అక్షర ప్రవాహాన్ని చూడ్డానికి
హృదయాన్ని దోసిలి చేసుకొని
గుండెనిండా నింపుకోవడానికి..!!

చుట్టూ కనిపిస్తున్న ఈ ప్రపంచాన్ని
మనసు విప్పి మౌనంగా స్పృశించు
వాటి అనుభవాలను నిశ్శబ్దంగా స్వీకరించు
చూస్తున్నావా ?
గాలికి ఎగిరొస్తున్న ఏకాంత ఉత్తరమేదో
తియ్యని వార్తలను మోసుకొస్తోంది ..!!

వింటున్నావా ?
రాత్రి కురిసిన వర్షానికి
కొమ్మ కొమ్మకు విచ్చుకున్న చివుర్లు
సంగీతాన్నాలపిస్తున్నాయి..!!

శ్వాసిస్తున్నావా ?
బొండు మల్లెలు, సన్నజాజులు
ఒకదాన్నొకటి పిండుకొని
అత్తరు చుక్కలను ఆరబెట్టుకుంటున్నాయి..!!

ఆస్వాదిస్తున్నావా ?
వాలు కుర్చీ చొక్కా విప్పుకొని
గాలి పోసుకుంటూ,
కలల్ని వొంపుకుంటోంది ..!!

పచ్చని పైరుగాలి కిటికీలోంచొచ్చి
ఒళ్ళంతా తడిమి కబుర్లాడుతోంది
కళ్ళాపి జల్లిన వాకిళ్ళు
పళ్ళు తోముకుంటున్న వేపకొమ్మలూ
పూ మాలలు అల్లుకుంటూ కూర్చున్న పరిమళాలు
అరమోడ్పు కళ్ళతో రేయంతా నిరీక్షించిన పూ రెమ్మలూ
రేతిరి మరకలింకా ఆకాశపు పంచె అంచులకు
అంటుకొనే వుండటం నువ్వు గమనిస్తున్నావా..!!

ఆకుల నిండా వర్షపు తుంపర్లు ఒక్కొక్కటిగా నేల రాలుతుండడం
చుక్కల ప్రేయసితో రేయంతా షికార్లు తిరిగి అలసిన చంద్రుణ్ణి చూడటం
తోటలో ఉదయాన్నే విరిసే సూర్యోదయాన్ని
ఎర్ర గులాబి ప్రేమగా ఆఘ్రాణించడం
రాత్రి స్పర్శ కోసం చీకటి మళ్ళి మళ్ళి నిశ్శబ్దంగా ఎదురుచూడడం
చూస్తున్నావా..!!

ఇవన్నీ చూడాలంటే బూతులు ఎతికే రాతలను కాదు
సాన్నిహిత్యం కోరే సాహిత్యాన్ని ఆశ్రయించు
మానుష కళ్ళతో ఎవరైనా చూస్తారు
మనో నేత్రాలతో చూసేవాడే అరుదు
రోజు నీ కళ్ళముందు కనపడే
సర్వసాధారణమైన వాటిల్లోనే
నువ్వు సాహిత్యం చుడగలిగినప్పుడే
అక్షరాలు నీకు సన్నిహితులై నీ నేస్తాలు అవుతాయి..!

“కవి” దేహం కలిగిన ఓ విధాతైతే
“సాహిత్యం” పురుడుపోసే మంత్రసాని
“కవిత” తన నుంచి జనియించే పసిబిడ్డ..!!

Written by: Bobby Aniboyina
Mobile : 9032977985

No comments:

Post a Comment