Friday, June 26, 2020

జీవితంలో కొన్ని క్షణాలు


జీవితంలో
కొన్ని క్షణాలు 
రాత్రిని రంపంపెట్టి కోసినట్లుగా 
వేకువ పొట్టులా రాలిపోతుంటాయి..!!

కళ్ళముందు కనిపించే 
రంగురంగుల ఇంద్రధనుస్సులన్నీ 
నిజమనే భ్రమలో బ్రతికేస్తుంటాము
మనం గిరిగీసుకున్న గీతే 
మన ప్రపంచాన్ని చిన్నది చేసేస్తుంటుంది
మనం ఎన్నో కోల్పోయేలా చేస్తుంది..

అయినా నా వద్ద ఏముంది కనుక 
ఇప్పుడు కొత్తగా కోల్పోవడానికి 
అమాస పున్నములు నా నేస్తాలే కదా 
ఎంత అందంగా ఉంటాయో అవి రెండూ
దేని అందం దానిదే.. 
దేని విశాలత్వం, విశృంఖలత్వం దానిదే..
కానీ నేనే అమాసలో పున్నమిని 
పున్నమిలో అమాసను వెతుక్కుంటుంటాను..!!

ఒక్కోసారి మనసు పసిదై పోతుంటుంది 
చిన్న సంతోషం పొరపాటున గాలికి కొట్టుకొచ్చి 
నాకెదురొస్తే చాలు గాలికి ఊగే గులాబీ అప్పుడే మొలిచిన 
ఆకును అడ్డుపెట్టుకున్నట్లు, 
సంతలో పీచుమిఠాయి చేతికందినట్లు
నాకు నేనే సంబరపడిపోతుంటాను..! అవన్నీ క్షణాలే..మరి!!
వెంటనే మరోవార్త నన్ను పాతాళానికి ఈడ్చుకెళ్ళి పడేస్తుంది..!!

నాపై 
పుడమికెంత కోపమో 
కొన్ని కన్నీటి చుక్కలను కూడా నన్ను దాచుకోనివ్వదు 
చెప్పుల్లేని పాదాలతో ఎండలో నడుస్తున్నా బాధ అనిపించదు 
ఇసుకలో ఇనుము కాలినట్లు పాదాలు బొబ్బలెక్కినా నొప్పి పుట్టదు 
కానీ ఇక్కడ అందరి దృష్టిలో నేనో ఇసుకలో మొలుస్తున్న గడ్డిపరకను అదే బాధ..!!

నేను ఒంటరిగా వున్నప్పుడు గాలి కూడా నన్ను పలకరించదు 
కనీసం నా జీవితపు గుహలోకి ఒక సూర్య కిరణమైన ప్రవేశించదు.
పదే పదే వినిపించే నా నిశ్శబ్ద తరంగాల మధ్య 
నా చుట్టూవున్న గులకరాళ్ళు పోగుచేసుకుంటూ ఉంటాను..
కానీ ఎక్కడికో హడావిడిగా పోతున్న పాదాలు 
నా గుండెల్ని నిర్లజ్జముగా తొక్కుకుంటూ వెళ్తాయి 
ఊపిరాడని ఉలిపిరి కాగితంలా ఇలా 
నా అక్షరాలు పారబోసుకుంటూ ఉంటాను..!!

Written by: Bobby Nani

1 comment:

  1. చిన్న సంతోషం పొరపాటున గాలికి కొట్టుకొచ్చి - nice బాబీ - అక్కడక్కడ శేషేంద్ర, తిలక్ పదాలు తలపిస్తున్నాయి నానీ.🐝🌈

    ReplyDelete