Friday, June 5, 2020

హంసయాన


తను ఎప్పుడు పుట్టిందో నాకు తెలియదు కానీ 
నన్ను చూసి .. గోముగా చిరునవ్వు చిందించిన ప్రతీక్షణం 
నేను మళ్ళి మళ్ళీ పుడుతూనే వున్నాను
ఇక తన గురించి చెప్పాలంటే 
ఆమె దంతదవళ కాంతిలో పట్టపగలే నే
నక్షత్రాలను దర్శిస్తుంటాను
ఆమె అంతరంగం ఎటు చూసినా పద్మవ్యూహమే
కానీ ఆమె అంతరంగ పాతాళ లోతులను సైతం నే చదవగలను 
తన రెండు కనుబొమ్మల మధ్యన ప్రతీ క్షణం 
నేను అస్తమించని సూర్యోదయాన్ని చూస్తుంటాను
అద్దంలో నా ముఖం నే చూడటానికి భయపడతాను కానీ 
నన్ను చూసిన ఆమె ముఖ కాంతులలో 
నా అందాన్ని నేను వెతుక్కుంటుంటాను..!!

తన మాటలు నాకు ప్రశ్నలను సంధిస్తే 
తన భావాలు మాత్రం నాకు సమాధానాలను అందిస్తాయి
తనలోని అంతర్గత విషయాలను నా 
మనసెప్పుడూ వెలికితీస్తూనే వుంటుంది
తన జీవిత రహస్యాలను ఛేదిస్తూనే ఉంటుంది..!!

తన అల్లరి 
గాలి చేసే పిల్ల చేష్టల మల్లె 
తన ఆనందం 
ఆకాశాన్ని తుడిచే తుంటరి మబ్బు పరుగు మల్లె 
తన కోపం 
మూతి ముడుచుకున్న నల్లని మేఘ మల్లె 
తన బాధ 
వర్షించే వర్షాగమ పన్నీటి గల గలల మల్లె 
తన నడకలో, నడతలో నర్మగర్భమైన ఒక
అవ్యక్తమైన సంగీతమేదో నను అలరిస్తూ వుంటుంది. 
తనతో గడిపే ప్రతీ క్షణంలో అది నేను అనుభూతిస్తూనే ఉంటాను.
ఒక్క మాటలో చెప్పాలంటే 
తానో అద్బుతం అంతే.. !!

Written by: Bobby Nani

1 comment:

  1. మీ కవిత్వం లో అద్భుత భావరాశి కలిగి ఉంటుంది.

    అయితే..
    అద్దంలో నా ముఖం నే చూడటానికి భయపడతాను అని ఎందుకు వ్రాశారు

    ReplyDelete