ఓ అసురసంధ్య వేళలో..!!
వీధిగుమ్మానికి వ్రేలాడు
ఎండిన మావిడాకులా
స్తబ్దుగా నే నిలబడి చూస్తున్నా..!!
చూరుకింద
చినిగిన పడకలమీద
జానడు డొక్క .... లోన కెళ్ళి
ఎనిమిది పదులు దాటిన ముసలమ్మ
అర్ధాకలితో పడివుండటం నే చూస్తున్నా..!!
ఇంకా జీవితం చూడని
పసి మనస్సు ఖటినమైన తన
దినచర్యలో భాగంగా
ఒళ్ళంతా కమిలిన గాయాలతో
గుక్కెడు పాలకోసం ప్రాణం పోతుండడం నే చూస్తున్నా..!!
చిరిగిన చొక్కా తగిలించుకుని
బాధ్యతల తువ్వాలు భుజానేసుకొని
బ్రతుకుదెరువు కోసం,
నాల్గు మెతుకులకోసం,
కన్నీరుని అదిమిపెట్టి వీధినెక్కిన తండ్రిని నే చూస్తున్నా..!!
ఆమె బ్రతుకు
ఉషోదయమెరుగని విషాద జీవచ్చాయ
మల్లెలెన్ని తురిమినా పరిమళం చిందని జీవచ్ఛవం
కన్నీటి తెరల చాటున, కామాందుల కబంధ హస్తాలలో
విటుల కౌగిట నలుగుతున్న ఆ ఆడతనాన్ని నే చూస్తున్నా..!!
అన్నం ముద్ద
నోట్లోకి దిగనంటూ,
గొంతున అడ్డం పడుతూంది..!
రుధిరం
నా నరాల తీగల్లోకి
వేగంగా ప్రవహించి
నిశ్శబ్దంగా మరుగుతూంది..!!
స్పందించని పీనుగుల హృదయాలు
ముఖాలపై అందమనే కంబళి కప్పుకుని
కాళ్ళు బారసాచి కులాసాగా వాలుకుర్చీలో
ఊగుతూ ఉన్నంత కాలం వారి జీవితాలు మారుతాయంటావా..!!
ఈ రాతలు వారిలో వెలుగులు పుట్టిస్తాయంటావా ..!!
Written by: Bobby Nani
ఎండిన మావిడాకు, బాధ్యతల తువ్వాలు, మల్లెలెన్ని తురిమినా పరిమళం చిందని జీవచ్ఛవం--. ఈ పదచిత్రాలు చాలా బాగున్నాయి బాబీ.
ReplyDeleteఅయితే స్పందించని వాళ్లంతా పీనుగులు అనడం తప్పు. ఈ సమాజంలో ఎవరి పోరాటం వారిదే. అయితే తోటివారి తోడ్పాటు ఎంతో కొంత అయినా ఉంటుంది.
హాయ్ నాని.....ఎలా ఉన్నారు..
ReplyDeleteనేను గుర్తున్నాన....
చాలా బాగా రాసారు.... 👌👌👌