SOCOTRA
-The Mysterious Island-
మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...
మెల మెల్లగా తెల్లవారుతోంది… అందరిలో అసహనం తాండవిస్తోంది…. అనవసరంగా మనమంతా ఇక్కడకు వచ్చామేమో అనే ఒత్తిడి వారిలో తారాస్థాయికి చేరుకుంది.. ఆ సమయంలో వారి ఆలోచనా ధోరణి మొద్దుబారిపోయింది.. గత కొన్ని రోజులుగా నిద్ర, ఆహారం లేని కారణంగా, అలసిన దేహంతో చెయ్యి కూడా కదుపలేని స్థితిలో వారు ఉన్నారు..
తరువాత ఏంటో చూద్దాం పదండి..
18th Part
మొత్తానికి తెల్లవారిపోయింది.. లేలేత సూర్య కిరణాలు వారి పాదాలను ముద్దాడుతూ వారిని నిద్ర లేపుతున్నాయి.. చుట్టూ వున్న పక్షులు సుప్రభాతములు ఆలపిస్తూ వారిని పలకరిస్తున్నాయి .. ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు ఆకాష్.. కళ్ళు నులుముకుంటూ చంద్రవదన వంటి ఆమె మోమును మొదటగా చూస్తాడు.. తరువాత ఒక్కొక్కరుగా అందరూ లేచారు.. ఇక లేచిందే తడువుగా ఆ బింబం కోసం మళ్ళి అందరూ గాలిస్తూ వుండగా దూరాన ఆటవికుల గుంపు ఒకటి వీరికంట పడింది.. టక్కుమని అందరూ ఆ రాతి వెనుకన నక్కి చూస్తారు.. వారి గుంపు నేరుగా వీరివైపే వస్తుంది.. దగ్గరకు వచ్చాక కాని తెలియలేదు.. వారు అఘోరాలు అని… అందరిలో భయం.. అఘోరాలకు ఇక్కడ పనేంటి అని.. మోహన్ కు అసలు విషయం అప్పుడు అర్ధం అవుతుంది.. వీరెందుకు ఇక్కడకు వస్తున్నారో నాకు అర్ధం అయింది అని అంటాడు మోహన్..
అది తరువాత సంగతి ముందు వారి నుంచి మనకు ఏదైనా హాని వుందా అది చెప్పండి అని అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. లేదు లేదు ఇది సంతోషించాల్సిన విషయమే.. వారంతా మా గురువుగారి సేవకులు అయివుంటారు. అని మోహన్ అంటాడు .. అంత ఖచ్చితంగా మీరెలా చెప్పగలరు అని అడుగుతాడు ఆకాష్.. వారు ధరించిన కంఠ భూషణములు, వారి చేతిలో వున్న విచిత్ర వస్తుసామాగ్రి, వారిదేహంపై రాసుకున్న భస్మపు ఆకృతులు. ఇవి చాలు వారు నిస్సందేహంగా మా గురువుగారికోసమే ఇక్కడకు వచ్చారని…. చెప్తాడు మోహన్.. ఇంతలో ఆ అఘోరాలు వారున్న చోటుకు వచ్చి వారి మొలకు కట్టివున్న భస్మాన్ని ఆ ప్రదేశమంతా చల్లుతూ మోహన్ కు ఒక సందేశాన్ని చెప్తారు..
“నేటికి రెండో రోజు మూడవ జామున మొదటి వాడే తీయగలడు .. దారి తెల్పగలడు ..
ఐదవ దిక్కున సూర్య చంద్రులు వుండరు. గాలి, వెలుతురు, వుండదు” ..ఆ ప్రదేశమే మీ మార్గం.. వెళ్ళండి అంతా శుభం అంటూ వెళ్ళిపోయారు..
వారు చెప్పిన ఏ ఒక్క అక్షరమూ ఎవరికీ అర్ధం కాక తర్జనభర్జన పడుతుండగా.. వారితోపాటు వున్న ఆ అమ్మాయి నాకు కొంచం అర్ధం అయ్యి కానట్లు అనిపిస్తుంది నే చెప్పనా అని అడుగుతుంది.. మీకు తెలిసింది చెప్పండి అంటూ మోహన్ మిగతావారు కోరుతారు..
నేటికి రెండో రోజు అంటే మనం వచ్చి ఇది రెండో రోజు
మూడవ జాము అంటే ఇవాళ రాత్రి
మొదటి వాడు అంటే మొదటగా పుట్టినవాడు అంటే ఆకాష్
అతడే మనల్ని నడిపించగలడు అని నాకు అర్ధం అయింది..
మరి ఐదవ దిక్కున అంటే అసలు దిక్కులు నాలుగే కదా అని మోహన్ ప్రశ్నిస్తాడు..
కొన్ని శతాబ్దాలనాటి ప్రస్తావన పూర్వులు ఆరు దిక్కులుగా చూసేవారు.. మనచుట్టూ వున్నవి నాలుగు దిక్కులు అయితే మన క్రింద పైన వున్నవి మరో రెండు దిక్కులు. ఇకపోతే ఐదవ దిక్కున సూర్య చంద్రులు వుండరు అంటే పాతాళములో సూర్యచంద్రులు వుండరు కదా.. గాలి వెలుతురు కూడా.. ఇలా నాకు తోచింది, అనిపించింది చెప్పాను అని చెప్తుంది..
ఇదంతా వింటున్న ప్రసన్నకుమార్ భాటియా అమ్మా నువ్వు మామూలు స్త్రీ వి కాదు.. నీలో ఏదో అద్బుతమైన జ్ఞానం ఇమిడివుంది అని ప్రశంసించారు..
అంటే మనం వెళ్ళాలనుకున్న నేలమాళిగ నిజం అన్నమాట అని అంటాడు మోహన్..
ఇక ఆలస్యం ఎందుకు ఇవాళ రాత్రిలోపు మనం ఆ మార్గం కనిపెట్టాలి తలొక దిక్కుకు వెళ్ళి బయటనుంచి కూడా వెతుకుదాం పదండి అని ఆకాష్ అంటాడు.. లేదు సూర్యకిరణాలకు ఈ రాతికి ఏదో సంబంధం వుంది అని ఆ అమ్మాయి చెప్తుంది.. నాకు ఎందుకో ఏటవాలుగా కాకుండా పైనుంచి సూర్యకిరణాలు రాతిమీద పడతాయనిపిస్తుంది .. మన నెత్తి పైనే ఏదో మతలబు వుంది అని ఆమె విశ్వసిస్తుంది.. ఆకాష్ వెంటనే ఆ రాతి గుట్ట పై కప్పు మీదకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు.. చాలా సేపటి తరువాత మోహన్ సాయంతో ఎలాగోలా పైకప్పు మీదకు చేరుకుంటాడు.. అప్పటికి సరిగ్గా సమయం మిట్టమధ్యాహ్నము కావస్తున్నది ... అక్కడ నేత్రం ఆకారం గల ప్రతిమలు అక్కడక్కడా వున్నాయి.. వాటిని ఎంత కదిల్చినా ప్రయోజనం కనపడలేదు..
ఐదవ దిక్కున సూర్య చంద్రులు వుండరు. గాలి, వెలుతురు, వుండదు..ఆ ప్రదేశమే మీ మార్గం.. అని ఆ అఘోరాలు చెప్పింది జ్ఞప్తికి వచ్చి అన్నిటినీ క్రింది వైపుకు తిప్పుతాడు.. రాతికి సరిగ్గా పైనగల ఒక ద్వారం తెరుచుకుంటుంది.. ఆ ద్వారం గుండా సూర్యుని కిరణాలు అక్కడ వున్న రాతిపై సన్నని గీతలాపడివున్నాయి.. అందరూ ఆ గీతనే చూస్తూ ఏమీ కనపడుటలేదే అని అనుకుంటుండగా రెండవ వాడు అయిన లోకేష్ మాత్రం వెనుకన పడుతున్న ఆ రాతి బింబాన్ని చూస్తున్నాడు..అది ఎలా వుందంటే రెండు పెద్ద పెద్ద కొండల మధ్యన సన్నని ద్వారము ఆ రెండు కొండలను చీలుస్తూ భూమి లోపలకు వెళ్ళినట్లుగా కనపడుతుంది.. అది గమనించిన మిగతా వారు అందరూ ఆశ్చర్యంగా అలానే చూస్తూ వుండిపోయారు..
ఇక ఆలస్యం ఎందుకు మన చుట్టూరు చాలా కొండలు వున్నాయి.. వాటిల్లో ఈ నమూనా గల కొండలు ఎక్కడ ఉన్నాయో మనం కనిపెట్టాలి అని ప్రసన్నకుమార్ భాటియా అంటాడు..
కనిపెట్టబల్లేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పెద్ద నది ప్రవహిస్తుంది .. అలాగే ఈ బింబంలో ఆ నది సూర్యుడు అస్తమించే దిక్కుకు ప్రవహిస్తున్నట్లుగా ఆకారం వుంది.. అంటే పశ్చిమం వైపున మనం కనిపెట్టగలిగితే చాలు ఆ ప్రవహించే నది.. ఆ నది దగ్గర వున్న కొండలు ఆ కొండలు మధ్యన మార్గం అన్నీ మనకు కనిపిస్తాయి.. అని మోహన్ అంటాడు..
అయితే … దారి ఇక్కడ నుంచి లేదన్నమాట ఆ నేలమాళిగ వున్న ప్రదేశం ఆ కొండచర్య మధ్యన ఉందన్న మాట అని ఆ అమ్మాయి అంటుంది..
ఎడారిలాంటి ఈ ప్రదేశంలో నది ఉండటం చాలా ఆశ్చర్యంగా వుంది అని ఆకాష్ అంటాడు.. ఇక్కడ ఆటవికులను మనం కనుక అడిగితే వారు మనకు ఏదైనా సాయం చెయ్యొచ్చు.. ముందు ఇక్కడ నుంచి వెళ్దాం పదండి అంటూ ఆకాష్ అంటాడు..
ఇక అందరూ వారి వారి వస్తువులు తీసుకొని పశ్చిమానికి కదలడం మొదలుపెట్టారు ..
అయిదు గంటలుగా వారు ప్రయాణిస్తూనే వున్నారు. మెల్లిగా చీకటి పడటం మొదలైంది.. రాత్రికి పడుకోవడానికి ఏదైనా అనువైన ప్రదేశం ఉందేమో అని గాలించసాగారు … అక్కడ ఒక పెద్ద డ్రాగన్ వృక్షం కనిపించింది.. దానికింద ఒక పరదాలాంటిది కట్టుకొని అందరూ ఆ పరదా కింద చేరారు..
జంతువులనుంచి, కఠినమైన చలి ప్రభావం నుంచి రక్షణ కోసం మోహన్ ఓ వెచ్చని మంటను మండించాడు ..
అక్కడి ఉష్ణోగ్రతలు పగటిపూట విపరీతమైన వేడిగాను, రాత్రివేళ తట్టుకోలేనంత చలిగాను మార్పు చెందుతూ వుంటాయి..
శిరస్సు పై నల్లని ఆకాశ వస్త్రము ..
ఆ వస్త్రముపై మెరుస్తున్న కళ్ళు పట్టనన్ని నక్షత్రాలు ..
మేఘాలతో దోబూచులాడే అంబుజుడు ..
మంచుతెమ్మెర ఎదురుగా కూర్చుని తన నోటితో ఊదుతున్నట్లు వణికే దేహం..
భగభగ మను మండే మంట నుంచి వచ్చి మేనును తాకే వెచ్చని స్పర్శ..
ఎదురుగా మనసైనోడి వాడి చూపు .. అబ్బా ఎంత బాగుందో అనుకుంటూ ఆ అమ్మాయి ఆకాష్ ను క్రీగంట గా చూస్తూ వలపుల బాణాలను సంధిస్తోంది…
ఆకాష్ తన కళ్ళతోనే ఆమెతో మాట్లాడుతున్నాడు.. అలా వారి ప్రణయ ప్రత్యుత్తరాలు మధ్యరాత్రి వరకు సాగాయి..ఎప్పుడు పడుకున్నారో తెలియదు .. పొద్దు పొద్దున్నే సూర్యభగవానుడు అందరి చెక్కిల్లను ముద్దాడుతూ లేపాడు…
గడచిన రెండు రోజులుగా సరైన ఆహారం లేనందున అందరూ చాలా నీరసంగా అలసటగా కనిపిస్తున్నారు.. ఇక ఈరోజు మాత్రం ఎలా అయినా వంట చేసుకొని తినాలని అందరూ నిశ్చయించుకున్నారు..
ఆ డ్రాగన్ వృక్షం కిందనే మోహన్ కాస్త గుంట త్రవ్వి మంట రాజేసాడు.. మీరు ఉండండి నేను ఒకటి చేస్తాను అంటూ ఆ అమ్మాయి ఓ పాత్ర పెట్టి నౌక నుంచి తీసుకొచ్చిన కొన్ని ఆహార పదార్ధాలతో ఆహారం తయారుచెయ్యడం ప్రారంభించింది…
ఓ ముప్పై నిమిషాల అనంతరం ఆ ఆహారాన్ని అందరూ కమ్మగా కడుపునిండా ఆరగించి అన్నీ సర్దుకొని బయలుదేరారు…
కొన్ని గంటల ప్రయాణం అనంతరం వారికి ఓ సమస్య వచ్చి పడింది…
To be continued …
Written by : BOBBY
No comments:
Post a Comment