Saturday, October 12, 2019

జీవంలేని స్పటికం...


జీవంలేని స్పటికం
************

ఓ.. 
ఒంటరి మేఘమేదో 
నడినెత్తిన వాలి 
తన విరహ బాధలన్నీ నాతొ చెప్పి, 
నను నిలువెల్లా ముంచెత్తి.. నా లోలోని
జ్ఞాపకాలని ప్రేరేపించి వెళ్ళింది..!!

జ్ఞాపకం అంటే మొదట జ్ఞప్తికొచ్చేది 
నీ శ్వాస తేమలోని వెచ్చదనం 
ఆ పెదవుల ముద్దులోని తియ్యదనం 
చిలిపి కౌగిలింతలోని తన్మయత్వమే ..!!

నిశ్చల నిశీధిలో 
నిశితంగా వినాలేకాని 
నీ నిశ్శబ్దపు పలుకులు 
అనుక్షణం నాకు వినిపిస్తూనే వుంటాయి..!!

కాలాలు కరిగిపోతున్నా 
అప్పుడెప్పుడో నీ 
నుంచి నేల రాలిన 
జ్ఞాపకాలన్నీ పోగేసుకొని 
తనివితీరా తడిమి అతి జాగ్రత్తగా 
వాటిని నా చొక్కా జేబులో 
పొదువుకుంటుంటాను...!!

ఒంటరిగా కూర్చుని 
పాత పుస్తకాల్లోంచి
ఎండిన ఆకుల్ని 
ఒక్కొక్కటి బయటకు తీసి 
దుమ్ముపట్టిపోయిన మన 
జ్ఞాపకాల తోటల్లో .. 
ఏనాటికైనా ఓ పువ్వు పూస్తుందనే 
ఎదురుచూస్తూ దోసేళ్ళ కొద్దీ 
గతించిన మన గతాన్ని నెమరేసుకుంటున్నాను..!!

నా చుట్టూ 
శబ్ధమయంగా అనిపించే
నిశ్శబ్ద ప్రపంచమే వుంది...
అందులో అర్ధమయ్యే మాటలుండవు,
నెలవంక నవ్వులుండవు 
అందుకే ఓ నవీన నిశ్శబ్ధం కోసం పరితపిస్తున్నాను..!!

నవ్వడం మర్చిపోయానే
ఏడవడం చేత కావట్లేదు...!!
కానీ నిరంతర కన్నీటి ధార నా 
చెంపపై చారను ఎర్పరిచింది.. 
కల్తీ నవ్వులతో.. 
ముఖానికి రంగులను పులుముకుని .. 
అందరితో బ్రతికేస్తున్నా.. 
జీవంలేని ఓ స్పటికం లా..!!

Written by: Bobby Nani

2 comments: