Friday, September 27, 2019

నాలోనేనే .. నాతో నేనే ..



వాస్తవమనే ప్రదేశంచుట్టూ దట్టంగా కమ్ముకున్న పొగమంచులా నా ప్రతీ కవితలో ఓ అక్షరం రహస్యంగా ఉండాలనుకుంటాను.. నాదొక Cultivated brain. ఎప్పుడూ మరోదారి తెరిచే వుంటుంది.. నేను ఎలాంటి స్థితిలో వున్నా కూడా ఏవో చిత్ర విచిత్రమైన ఊహలు ప్రతీ నిమిషం నాలో ఉండనే వుంటాయి.. ఉదాహరణకు అమితమైన కోపం, బాధ, దుఃఖం ఏ భావనలో ఉన్నాకూడా వాటితోపాటు మరో ఆలోచన కూడా ట్రావెల్ చేస్తూ వుంటుంది.. కొన్ని పదాలమీద ఏవగింపు, అసహ్యం అనిపిస్తుంది.. కొన్ని పదాలంటే అమితమైన అభిమానం, ప్రేమ వుంటుంది.. 

చిన్నప్పటినుంచి చిత్రమైన ఊహాప్రపంచం నాది.. అందులో భయంకరమైనవి కొన్ని, అందమైనవి కొన్ని, వింతైనవి మరికొన్ని, ఆచర్యమైనవి కొన్ని ఉండేవి.. చీకటన్నా మృత్యువన్నా చాలా చాలా ఇష్టం వుండేది.. ఏదైనా ఒంటరిగానే చెయ్యడం ఇష్టపడే వాడిని.. ఒంటరిగా చీకట్లో ఉండటం ఓ గొప్ప అనుభవం.. చీకట్లోనే నిజం ఉంటుందని గట్టిగా నమ్మేవాడిని .. నిజం అంటే నా దృష్టిలో పెళ్ళి, పేరంటాలు, పండుగలు ఇవ్వన్నీ కాదు.. నా దృష్టిలో నిజం అంటే చావు, పాడే, గుప్పు గుప్పుమనే అగరొత్తుల వాసన, పూరిస్తున్న శంఖం శబ్దం.. రోదించే కన్నీళ్ళు.. ఇవే.. వీటిల్లోనే నిజం వుంటుంది.. పెళ్ళి, పేరంటాలు, పండుగలలో అంతటా నటనే కనిపిస్తుంటుంది నాకు.. ముఖాలకు రంగులు పులుముకుని, కృత్రిమ వేషాలతో నటిస్తారు, నర్తిస్తారు.. ఎవరి స్వార్ధం వారిదే ఇక్కడ.. ప్రతీ నటనకు ఓ సముచిత స్థానం.. 

పదకొండేళ్ళ వయస్సులో మొదటిసారి స్మశానంలో అడుగుపెట్టినప్పుడే అర్ధం అయింది మనిషిస్థానం ఇదేనని.. మృతదేహాన్ని చూసినప్పుడల్లా బంధ విముక్తి కలిగిందని, ప్రశాంతత చేకూరిందని అనిపిస్తుంది..వారిని గొప్పవారిగా భావిస్తాను.. పాడే మోయడం చాలా ఇష్టం.. చివరగా మనం వారికి ఇవ్వగలిగేది అదొక్కటే.. తాతయ్య గారు చెప్పేవారు నా చిన్నతనాన.. పెళ్ళికి వెళ్ళకపోయినా మరేం పర్వాలేదు.. కానీ చావుకు మాత్రం తప్పకవెళ్ళాలి .. వారి మరణాన్ని గౌరవించాలి అనేవారు.. బహుశా అందుకేనేమో ఆయన చనిపోయినప్పుడు మేము ఊహించని దానికన్నా ఎవరెవరో తెలియనివారంతా వచ్చారు.. ఒకరికోసం బ్రతకడం అనేది ఓ అదృష్టం.. అది అందరికీ రాదు.. మొదటిసారి నాలో ఓ వాక్యం జన్మించింది నా పదకొండేళ్ళ వయస్సులో ఓ సమాధిపై కూర్చున్నప్పుడే..!! 

వేదన నుంచి కవిత్వం పుడుతుందంటారు అది నా విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది.. 
నాన్నమ్మ మరణాన్ని ఎలా ఏడ్వాలో తెలియక ఆ బాధను అక్షరీకరించాను.. 
ఇక నాటినుంచి నేటివరకు నా కలం పయనిస్తూ, నా ప్రతీ భావనలో నాకు తోడుగా వుంది.. 

గడచిన ఓ వారం నుంచి నాలో ఈ ఆలోచనల పరంపరలు కొనసాగుతూ వున్నాయి.. దానికి కారణం నేను రాస్తున్న “Socotra” The Mysterious Island కథలో కొన్ని కీలక సన్నివేశాలు..!!

అవి రాస్తున్నప్పుడు నాలో కలిగిన కొన్ని భావ ప్రకంపనలు కావచ్చు.. 
ఏదిఏమైనప్పటికీ ఈ భావాలు బహు చెడ్డవబ్బా .. వాటిని అలానే పెట్టుకుంటే మనం మనలా ఉండలేము.. అందుకే అన్నిటినీ పట్టుకొచ్చి ఇలా అక్షరాలలో పెట్టేసాను.. 

ఇది రాసాక ఓ సారి గట్టిగా ఊపిరి తీసి వదిలాక ..
మనసు చాలా తేలిక అనిపించింది.. !!



Written by: Bobby Nani