Saturday, December 15, 2018

సరసజాక్షి..


ఓ కాంతా...!
అందమైన కలువలతో ఆ విధాత నీ 
కళ్ళను కాంతివంతంగా సృజించాడు 
చల్లని పరిమళాలు వెదజల్లే పద్మాలతో నీ 
ముఖాన్ని మనోహరంగా మలిచాడు 
తెల్లని మల్లె మొగ్గతోటి తీరైన నీ 
పలువరసను నిర్మించాడు 
సుతారమైన ఎర్రటి నవపల్లవాలతో నీ 
అధరములను రసరమ్యముగా చేసాడు 
సుకుమారమైన చంపక దళాలతో నీ 
అనువైన సొగసులను లావణ్యంగా శిల్పీకరించాడు
ఇలా సుకుమార కుసుమ పేశలమైన వస్తు సంపదతో నీ 
దేహ నిర్మితి చేసిన ఆ విధాత, నీ 
ఉల్లమును మాత్రం కఠిన శిలతో చేశాడెందుకే..!!

ఓ ముదితా 
నీ దేహమొక సౌందర్యభరిత సరోవరం 
సరస బాహువులే తామరతూళ్ళు 
లక్ష్మీ కళ వుట్టిపడే ఆ ముఖమే కమల సంపద 
యౌవన కాంతుల... శృంగార లీలా విలాసాలే 
నీలోని శీతల జలాలు 
అందమైన కటి ప్రదేశమే అభ్యంగన స్నాన ఘట్టం 
చంచలాలైన సోగ కన్నులే బేడిస చేపలు 
ముచ్చట గొలిపే ఆ వయ్యారాల వాలుజడే 
అందాల శైవాలం 
వట్రువలైన స్తనాలు మన ప్రేమకు ప్రతిరూపాలై 
విహరించే చక్రవాకాలు..
ఓ సరసజాక్షి.. నీ 
సంయోగ శృంగార సాధన సంపదలు 
కామోత్సవ కాసార మన్మధ మహా తీర్థంగా 
అందుకోవాలనుందే..!!

పూల ఋతువు పరిమళించే జాముకు 
ఒళ్లో వాలి, కౌగిట్లో కరిగిస్తానన్నావు 
కానీ వాటితోపాటు వస్తానన్న నీవు మాత్రం రాలేదు..
నీ విరహంతో నా మదిలో కదిలే ఊహలు కరిగిపోయాయి 
ఓ విధాత నాకు పునర్జన్మ నిమ్ము 
మానవ జన్మనిస్తే 
నేను కరకుబోయనౌతాను 
కుహూ, కుహూ నాదాలతో 
నన్ను విరహంలో విసిగించిన ఈ నీచ కోకిలను బంధిస్తాను..
గ్రహ జన్మ లభిస్తే 
రాహువుగా పుడతాను 
నన్ను తన శీతల కిరణాలతో 
వేధించిన తననీ పట్టి పీడిస్తాను..
దైవంగా జన్మిస్తే 
పవిత్రమైన ముక్కంటి మంట నౌతాను 
అలా కాక నన్ను మన్మధునిగా సృజిస్తే మాత్రం 
మాట తప్పి నన్ను దుఃఖ పెట్టినందుకు 
నా చెలికి మన్మధబాధ నధికం చేస్తాను 
ఓ విధాతా..!!
నాకు పునర్జన్మ ప్రసాదించు..!!
లేదా 
నా చెలిని 
బాహులతికల మధ్యన చేర్చు..!!

Written by : Bobby Nani

Friday, December 7, 2018

కక్షావైక్షకుడు


కక్షావైక్షకుడు 
*********

ప్రభాతాల సందేశాలను మోసుకొచ్చే 
ప్రత్యూష వార్తాహరుణ్ణి నేను 
కాంతి సంకేత ధరుణ్ణి నేను 
అంధకార నిశ్శబ్దారణ్యాలలో 
ఆరని కాగడాల వెలుగులతో నడిచే 
కక్షావైక్షకుడను నేను..!!

నందనారామంలోని మందారాలు 
సుందరోద్యానంలోని గులాబీలు 
నా అతి నవ్య లేఖినికి సంకేతాలు 
నా అభినవ చేతనకు ప్రతీకలు..!!

నా జాతిలో చైతన్యం కలిగించడానికి 
నా జాతిని జాగృతితో వెలిగించడానికి 
వ్రాస్తున్నాను కవిత్వాన్ని, 
వినిపిస్తున్నాను కవితాధ్వనిని..!! 

కళాకౌశల్యాన్ని కాపాడటం కోసం, 
రమ్య భావాల నిషాతో రాపాడడం కోసం, 
నా జీవనాది నుండి కవితా మధువును 
పిండి నా జాతికి అందిస్తున్నాను..!!

నా అనురాగ ప్రేరణ నుండి దూరమైనవారు 
తమ జీవిత గిరిశిఖరాల నుండి పతనమయ్యారు 
వర్తమాన యాత్రిక బృందం నా గమ్యం వద్ద ఆగివుంది..!!

పథం తప్పిన స్వప్నాలకు నా కలం ఆశ్రయం ఇచ్చింది 
సంస్కృతి అనే కుసుమం వికసించడానికి నేను చేయందిస్తున్నాను
చరిత్రకు నా అప్రమత్త జాగురూకనయనాలను అమర్చాను 
ఎవరి ఆకర్షణ వల్లనో దారి తప్పిన మృగ శాబకం వంటి సభ్యతకు 
ఈ కీకారణ్య మధ్యంలో మార్గం సిద్దం చేసి, కాచుకుని కూర్చున్నాను
పందొమ్మిదేళ్ళ నా కవితా ఝరిని నల్దిశలా విస్తరించాలని..!!

Written by : Bobby Nani

Monday, December 3, 2018

“వేశ్య”..!!


ఆ అచ్చొత్తిన ఓర చూపులు 
విద్యుత్కాంతులు 
చల్లని రేయిన అశాంతులు.. 
ఎరువిచ్చిన శృంగారం 
తళ తళ మెరిసే గాజులు 
గిల్టు చంద్రహారాలు 
అణా, అర్ధణా నాణాలు 
గుప్పెడు పూలు, 
గుప్పున వీచే అత్తరులు,
నలిగిన చీరలు, 
చీకటి ముసుగులు 
ఇదా నీకు జీవితమిచ్చిన బహు “మానం” ..!!

నీ సౌందర్యం ఈ ప్రపంచపు సొత్తు 
చీకటి కొలతల ఆతృత
వినిపించని మెల్లని గుసగుసలు 
క్షణ మాత్రపు చూపుల ఆవేశపు సంతోషం 
చెరగుచాటు పాపపు రుసరుసలు 
నిదురించిన ప్రపంచపు గర్భంలో 
మేలుకున్న ఆకలిలా 
మిణుకు మిణుకు మనే ఆ వీధి లాంతరుల 
నీడలా పొంచివున్న విధి శాపం 
ఆ ఆనందపు బేరగాని 
గుండెలలో ఏదో తెలియని దడ
తట్టని తలుపుల చప్పుడు 
నడువని అడుగుల సవ్వడి 
గొనుగుతాడు తడబడు మాటలతో 
వణుకుతాడు గడగడ మంటూ 
నడిరేయి పీడకలలో 
మెలకువలా, వెచ్చని చెమటారిన 
విటుని చేతిలోకి జారి 
ముత్యంలా మెరిసిపోయే 
రెండు నాణ్యాలే ఈ “వేశ్య”..!!

నీవంటే నాకు అసహ్యం 
ఎందుకనగా 
నీ కుళ్ళిన బాహ్యం 
మా చీకటి లోయల లోతుల్లో 
నీ పూజా శిఖరాలు 
మా పాపపు చీకటి శాపాలు 
నీ మిణుగురు వెలుగు వరాలు 
మా అచేతనపు మాలిన్యాల 
బురదతోడ చేసిన ఓ బొమ్మా..! 
నిన్ను చూసి కాదమ్మా నా ఈ కోపం 
నీ బ్రతుకు అద్దం ముందున 
సిగ్గులేక ప్రతిబింబించిన 
మానవ జీవితాల భీభత్సం 
నన్నాకర్షిస్తున్నది 
కానీ మరల భయపెడుతున్నది 
నీ అధఃపతనపు లోతుల్లో 
మారుమ్రోగు మానవ జాతుల
క్రుళ్ళిన మనసుల బూతులు, 
నీ బలవంతపు చిరునవ్వుల్లో 
యుగయుగాల ఉప్పని ఏడ్పులు 
నీ చల్లని నిట్టూర్పుల్లో 
బ్రతుకుటెడారుల గాడ్పులు 
ప్రపంచపు పాన్పుపైన 
నీ బ్రతుకు ఓ వ్యంగ్య చిత్రం 
ప్రేమలు, పువ్వులు, నవ్వులు 
ఉత్తరాలు, వివాహాలు 
బ్రతుకు చేదు మాత్ర పైన పంచదార 
అబద్దాల మాయలు నీ జీవిత సత్యాలు 
ఓ కులటా ..!! రూపాజీవి ..!!
అనాకారి బ్రతుకుల దౌర్భాగ్యపు 
వెక్కిరింతలు..!!

నెత్తుట తడిసిన అడుగులు 
కన్నీరుల ఉప్పు గుట్టలు 
ఒళ్ళంతా పచ్చి పుళ్ళు, 
రసికారే కురుపులు 
మూగుతోన్న ఈగలు 
ఎందుకు చీదర ??
జీవితపు కాళ రాత్రి 
గుండెలు పిండే చలి
భగభగమండే ఆకలి 
పాపపు చిరిగిన దుప్పటిలో 
గడగడ వణికే మనకెందుకు చీదర ??
జరగండింక .. రా 
ఇంకా దగ్గరగా రా ..!!

Written by : Bobby Nani

Tuesday, November 27, 2018

నీ మౌనం ఒక జ్వలనం ..


దీపమా,
నీ మౌనం ఒక జ్వలనం
నీ మరణం ఒక ఉదయం
ఎన్ని లైట్లు వచ్చినా,
మరెన్ని మిరిమిట్లు కనిపెట్టినా,
నీ ప్రస్థానం మాత్రం
నాటి నుంచి నేటి వరకు అజరామరములే..!!

పత్తి మూలంలోనించి కొత్త నెత్తురు చేదుకునే దీపం
మార్క్సిజం బళ్ళో
వర్గ సంఘర్షణ పాఠాలు నేర్చుకునే విద్యార్ధి అవుతుంది..!!

కటిక చీకటి కారడవిలో
జ్యోతిలా తుపాకీ ఎత్తిన గెరిల్లా అవుతుంది..!!

నీ చుట్టూ
పొగడ్తలు పురుగుల
మందల్లా మూగితే,
లొంగవు సరికదా
వాటి నాల్కుల రెక్కల్ని తగలేసి మరీ పంపిస్తావు..!!

పైసాలకు,
పదవీ విలాసాలకు అమ్ముడుపోని
ప్రజా ప్రతినిధివి నీవు..!!

పొత్తికడుపుల్లో కత్తిపోట్లతో
కిరణాల్లాంటి నీ బిడ్డలు గిలగిల కొట్టుకుంటుంటే
గుళ్ళోని దీపమై గుండె పగిలి ఏడుస్తావు..!
మసీదులోని దీపమై మౌనహింస అనుభవిస్తావు..!!

కర్ఫ్యూలగదిలో గాడాంధకారం ముసిరినప్పుడు
నా చూపును చూపుడు వేలై
నడిపించే నా నేస్తం నువ్వు..!!

నోరుకాలుతున్నా,
నొసలు మండుతున్నా,
నీ మౌనం ఒక జ్వలనం
నీ మరణం ఒక ఉదయం..!!

Written by: Bobby Nani

Tuesday, November 6, 2018

అందాల అలివేలు మంగ



నా అందాల
అలివేలు మంగ
నీ తలంపు మెదిలితే చాలే
మెల్లిగా ఊగే ఉయ్యాల ఊపులాగ
నా మది తేలిపోతుంటుంది
నీవు లేవని ..
పాన్పుమీది మల్లెలు,
పల్లేరులై చివుక్కుమంటున్నాయి
చంద్రుని చుట్టూ చంక్ర మించే
వేయి చుక్కలలా
నీ తలంపు చుట్టూ
నా ఊహలు లక్షల ఊసులతో
లాస్యమాడుతున్నాయి..!!
అంతెందుకు
నేల నిద్దురపోతుంది
నింగి నిద్దురపోతుంది
గాలికూడా నిద్దురపోతుంది
ఒక్క నేను మాత్రమే
చండ్ర నిప్పులవంటి నీ విరహాగ్ని
పాన్పుమీద పొరలుచూ, దొర్లుచూ, ఉన్నాను
ఓయ్ నిన్నే,
అర్ధం అవుతోందా నీకు..!!

వాడిన కొలదీ ఎక్కువయ్యే
పొగడ పువ్వు వాసనలా
రోజులు గడిచే కొలదీ నా మనస్సులో
నీ సంస్కృతి ఇంకా ఇంకా మించిపోతుంది.
అమాస, పున్నములను రెప్పార్పక చూస్తూ
కరిగిపోతున్న కాలాన్ని ఆరగిస్తూ,
జ్ఞాపకాలనే ఊపిర్లుగా శ్వాసిస్తున్నాను..!
నీకై..
నీ రాకకై ..!!

హృదయమా
నా ఈ కావ్య రచనలు నీకు ఎలానో చేరవు
చేరినా చదువబోవు
అందుకే
మంచుబిందువుల ముసుగులో మల్లెపూలవలె
చిరులేత దూకూలముల జలతారు విరులవలె
జలజలారాలిన వేవేల చేమంతి రెబ్బల వలె
సూర్య, చంద్రుల నేత్రాలతో
వెలుగు, చీకట్లను ప్రసవిస్తున్నాను..!!

Written by: Bobby Nani

Monday, October 29, 2018

నా అక్షరం




నా అక్షరం
నీ హృదయానికి తాకితే 
నీ హృదయంలో నేను ఉన్నట్లే..!! 

నా కన్నుల మీద వాలిన 
సీతాకోకచిలుకలే నా ఈ కవితలు, ప్రబంధాలు 
అందుకే 
కన్నిటిలో గుండెల్ని పిండి 
కవితా లతల మీద ఆరవేసి 
జనతా శాలువా కప్పుకొని 
చర చరా వెళ్ళిపోతుంటాను..!! 

కవిత్వం 
ఒక మత్తు 
అందుకే దాన్నుంచి దూరంగా పారిపోయి 
ధ్యానం చేసుకుందామని వుంది 
ఎక్కడికో నిశ్శబ్ద కుహరంలోకి పోయి 
ఎవ్వరూ లేని పాడుబడ్డ దేవాలయంలోకి పోయి 
చివరికి నా ఏకాంతాన్ని భంగం కలిగించే 
దేవుడు కూడా లేని దేవాలయంలోకీ పోయి 
ఈ ప్రపంచాన్ని మరిచి 
నన్ను నేనూ మరిచి మనోనేత్రంతో ధ్యానం చెయ్యాలనుంది..!! 

నా హృదయాన్ని ఆకాశమనే కాగితంలో 
బావుటంలా ఎగురవేశాను 
ఎగురుతున్న ఆ రంగుల పేలికే 
ఈ నవ యుగానికి నాలికౌతుంది 
ఏదో ఒకనాడు నా ఈ శరీరం 
అంతర్దానమౌతుంది 
అప్పుడు మీకు నా పదాలల్లోనే 
నే దర్శనమిస్తుంటాను ..!! 
ఇక వసంతం మాట ఎత్తకు 
నీ కోసం నేను మళ్ళీ కోకిలనై రాలేను..!! 

నా అక్షరం 
నీ హృదయానికి తాకితే 
నీ హృదయంలో నేను ఉన్నట్లే..!!
Written by : Bobby Nani

Thursday, October 25, 2018

నా అందాల "పెను తుఫాను"


నా అందాల "పెను తుఫాను"
********************


నీవు స్త్రీ వి కాదు 
అందాల పెను తుఫానువి 
చీరా, తారా కలిపి నేసిన రూపానివి 
నన్ను “కవి” అనకు 
నేను కలల వర్తకుడ్ని 
నా మది గదిలో నీ రెండు కళ్ళే 
విలువైన భూగోళాలు..!!


నీ శరీరపు క్రూర బంగారు కాంతులు 
నా చూపుల్ని నీ దేహపు తీరాల్లో 
ముంచి ముంచి లేపుతున్నాయి 
కనీసం నీవు తాగే కాఫీ లోకి 
ఒక పంచదార చినుకునై రాలుతాను 
నీ గుండె వాజులోకి 
ఒక పువ్వునైనా దూరుతాను 
నీవు కన్నెత్తి చూడకుంటే 
పద్యమనే పది అంతస్తుల మేడ ఎక్కి 
కాగితము మీదకు అమాంతం దూకుతాను..!!


బ్రహ్మాండమైన నక్షత్రాల ఊరేగింపులో 
వెన్నెల జెండా పుచ్చుకుని చంద్రుడు 
నడుస్తున్నాడు 
అప్పుడు గ్లాసులోని పాలు కన్నుగీటాయి 
ఆపిల్ పండు మధురంగా కోరుక్కోమని కండ చూపింది 
అంతే 
మసక చీకట్లలో మాధుర్యాలు కొల్లగొట్టాను 
ఏవో రాగాల తేనెటీగలు 
పెదవులమీద మెదుల్తుండగా 
ఒక సౌందర్య మూర్తి 
అద్దంలో మునిగి, 
స్నానం చేసొచ్చి 
ఎదుటున వచ్చి నిల్చుంది..!!


ఆమె కుచ సౌందర్య మొనలపై 
యెర్రని గులాబీలు పూస్తున్నాయి 
ఉదర నాభీయములో భగ భగ మనుచూ 
నిత్య హోమము జరుగుచున్నది 
ఏ అవ్యక్త భౌతిక ద్రవ్యాలతోనో 
ఆమె దేహం సమ్మోహన పరిమళాలను ప్రసవిస్తోంది 
తన పెదవులు పలికే గుసగుసలు 
ఇంకా నా చెవుల్లో మధురించనీ 
తామర మొగ్గలాంటి అరచేతి వీపుని 
ఇంకా నా పెదవుల దగ్గరనే ఉండనీ 
నా వెచ్చని బాహువుల మధ్యన 
వెన్నలా తనని కరిగిపోనీ..!!

Written by : Bobby Nani

Tuesday, October 23, 2018

వస్తావు కదూ..!!


అందం 
నా చెంతకొచ్చి 
తనపై ఓ కవిత వ్రాయమనడిగింది..
ఆ క్షణం 
నా ఆనందానికి అవధుల్లేవు
నిండు జాబిలి 
చంకనెక్కి కూర్చున్నట్లనిపించింది..!!

తమలపాకు నయనాలతో ఇంతింత కళ్ళేసుకొని 
నా ఎదుట నిర్మలంగా వచ్చి కూర్చుంది.. 
తననే తీక్షణంగా చూస్తూ 
కలం పట్టుకుని 
తెల తెల్లని కాగితాలలో 
భావాల సంతకాలను కుమ్మరిస్తున్నాను..!


నిశ్శబ్దంగానే,
తనూ, నేనూ ముచ్చటించుకుంటున్నాం..! 
మౌనంగానే,
కళ్ళతోనూ, ఊపిరితోనూ సంభాషించుకుంటున్నాం..! 
నిశ్శబ్దమే, మా శక్తి సంజనితము 
మౌనంగా మాటలకందని అనుభూతిని గప్చిప్గా జుర్రుకుంటున్నాం 
నేత్ర ఖడ్గాలతో ఒకర్నొకరం సున్నితంగా పొడుచుకుంటున్నాం..!!

ఇంత అందాన్ని దగ్గరగా చూసిన ప్రతీసారీ 
సిగ్గుతో నా కనురెప్పలు వాలిపోతుంటాయి 
నోరువున్నా విప్పి చెప్పలేని నిజమైన ఆనందం నాది..
అందుకే నా అనుభవాల్ని తను మౌనంగా స్వీకరిస్తుంది..!!

తన తలపుల ఒడిలో నే ప్రతీరోజూ జనియిస్తుంటాను 
చుక్కల్ని, చంద్రుణ్ణి చూసుకుంటూ, 
అదృశ్య ప్రేయసితో నా తోటలో షికార్లు చేస్తుంటాను 
ఉదయాన్నే విరిసే సూర్యోదయాన్ని 
ఎర్రగులాబిలా ఆఘ్రాణిస్తుంటాను
రాత్రి స్పర్శ కోసం మళ్ళీ మళ్ళీ ఎదురుచూస్తుంటాను
నా ఒంటరితనాన్ని తన నిత్య యవ్వనంలో నిమజ్జనం చేస్తుంటాను..!!

కానీ 

ఈ మధ్య 
నాకూ తనకీ మధ్యన 
నిప్పులు మొలుస్తున్నాయి
రెండు హృదయాలు కలిసి పాడితే 
ఆకాశంలో పౌర్ణమి ఉదయిస్తుంది 
అదే రెండు గుండెలు పోట్లాడి విడిపోతే 
చిమ్మ చీకట్లు చిందులేస్తాయి 
నీకూ, నాకూ 
మధ్య ఎంత ఆవేశం కరిగిందో 
ఎన్ని నక్షత్రాలు వెలిశాయో 
నీకూ నాకూ మాత్రమే తెలుసు 
అయినా ఈ మధ్య అకారణంగా 
నువ్వలిగి అటు తిరిగి పడుకున్నప్పుడు 
మనమెంతో ఇష్టంగా కట్టుకున్న గోడలు 
బీటలు వారడం చూస్తున్నాను. 
పట్టెమంచం నిర్దాక్షిణ్యంగా 
రెండుగా ఖండింపబడటం చూస్తున్నాను..
అయినా ఇంకా నాకు
నీళ్ళోసుకునే గదిని చూస్తే 
నువ్వే గుర్తుకొస్తావు 
వెన్నెల వీస్తూ 
వీపు రుద్దుతున్నట్లే అనిపిస్తుంది 
నాలో రగిలే జ్వాలను 
చల్లార్పుతున్నట్లే అనిపిస్తుంది..!! 

రేపే పౌర్ణిమ 
నీ కొరకై 
నీ రాకకై 
ఆకాశానికి ఓ దిక్కున కూర్చుని 
జిలుగు తారలను లెక్కించుచుంటాను..!!
వస్తావు కదూ..!!

Written by: Bobby Nani