Thursday, July 3, 2025

పుస్తకాన్ని చదవండి..


“పుస్తకం” అంటే… మనల్ని మనం తిరిగి పరిచయం చేసుకునే దారిలో వేసే మొదటి అడుగు. అంతేకాదు "పుస్తకం” మన జీవితాన్ని మార్చగలిగే శక్తి కలిగిన సాధనం కూడా. ఒక పుస్తకం రాసే రచయిత వెనక ఎన్నో అనుభవాలు, ఆలోచనలు, కలలు, బాధలు దాగి ఉంటాయి. అది కేవలం అక్షరాల సమాహారం కాదు.. అది అతని అంతరాత్మకి ప్రతిరూపం.


ఒక పుస్తకాన్ని రూపొందించడమంటే చిన్న విషయం కానే కాదు. రచయితలో కలిగే ఆలోచన మొదలుకొని, దానిని పదాలుగా మార్చడం, మళ్లీ మళ్లీ చదవడం, సంశోధించడం, దిద్దుబాటు చేయడం, ఆ తరువాత ప్రచురణకు పంపడం.. ఇలా ఈ మార్గం అంతా సవాళ్లతోనే నిండివుంటుంది. చాలామంది రచయితలు తమ స్వంత డబ్బుతో పుస్తకాన్ని ప్రచురించాలనే సంకల్పంతో తమ జీవితాన్ని పణంగా పెట్టిన సందర్భాలు ఎన్నో. అటువంటి పుస్తకాన్ని ఓ పాఠకుడు ఆదరించకపోతే, ఆ రచయిత గుండె ఆగినట్లే అనిపిస్తుంది.

ఈ డిజిటల్ యుగంలో మనం మెల్లగా పుస్తకాల నుండి దూరమవుతుంటే, reels, shorts, videos మన సమయాన్ని లాక్కుంటున్నాయి. ఒక పుస్తకం చదవడానికి గంటలు పట్టవచ్చు, కానీ reels చూస్తే కొన్ని సెకన్లలో ఆనందం వచ్చేస్తుంది. అనే భ్రమలో మనం ఉండిపోయాము. కానీ ఆ చిన్న ఆనందం అంతే త్వరగా పోతుంది. కానీ పుస్తకం అలా కాదు.. నిశ్శబ్ధంలో కూడా మాట్లాడగల ఏకైక శబ్దం పుస్తకానిదే. ఒక పుస్తకాన్ని చదివినప్పుడు కలిగే తృప్తి, అది మనలో కలిగించే ఆలోచన, ఆలోచనల నుండి వచ్చే మార్పు, ఇవేవీ డిజిటల్ స్క్రీన్ ఇవ్వలేవు.

ఒక పుస్తకం మనకు కొత్త ప్రపంచాలను పరిచయం చేస్తుంది. చరిత్రలోకి తీసుకెళ్తుంది, అది మన మనసును లోతుగా ఆలోచించేలా చేస్తుంది. మనలో ఆత్మపరిశీలనను కలిగిస్తుంది, మన జీవన దారిని మారుస్తుంది. పుస్తకాలు మన జీవితాల్లోకి నిదానంగా వచ్చినా, అవి శాశ్వతంగా ఉండిపోతాయి. ఈ కాలంలో మనం పుస్తకాలను మర్చిపోయాం... కానీ అవి మాత్రం మన కోసం ఓ చిరునవ్వుతో ఎదురుచూస్తూనే ఉన్నాయి.

ఇప్పటి యువతలో చాలా మందికి పుస్తకాల పట్ల ఆసక్తి తగ్గిపోయింది. ఇది భవిష్యత్తు తరాల వారికి తీరని లోటు. ఒక మంచి పుస్తకం మన జీవితంలో ఒక మౌనంగా వున్న మిత్రుడు లాంటిది. అది మనతో మాట్లాడదు, కానీ మనల్ని నడిపిస్తుంది. పుస్తకాలు కేవలం సమాచారం కోసమే కాదు, మన సంస్కృతి, జీవనవేదం, విలువల భాండాగారం. పుస్తకాలను వదిలేస్తే మనం మన మూలాలనూ, మన అనుభూతులనూ వదిలేసినట్టే.

అందుకే, పుస్తకాలను తిరిగి చదవండి. పుస్తకాన్ని కొనడం అనేది కేవలం వ్యయం కాదు, అది ఒక రచయితపై మీరు చూపిన గౌరవం, ఒక కొత్త ఆలోచనపై మీరు చూపిన ఆదరణ. పిల్లలకూ పుస్తక ప్రేమను అలవాటు చేయండి. మీరు కట్టుకునే ప్రతి ఇంటిలోనూ ఓ మూల చిన్న గ్రంధాలయం ఉండేలా చూడండి. రచయిత రాసిన ప్రతి అక్షరం... అతని హృదయం రాల్చిన ఓ విలక్షణ చినుకే.

పేజీల మధ్య దాగినవి కథలు మాత్రమే కాదు... అవి మన కన్నీళ్లు, నవ్వులు, ఆశలు ఇలా ఎన్నో..భావాలు...అలాంటి వారిని దయచేసి ఆదరించండి. వారి ప్రయాసకు, ఇంకా చదివేవారు ఉన్నారనే వారు పెట్టుకున్న నమ్మకానికి ఓ ఊతమివ్వండి. కానీ ఇదంతా మొదలవ్వాల్సింది మన దగ్గర నుంచే. అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ .. ఓ సాటి రచయిత..

చివరగా.. ఒక్కమాట..

ఒక్కసారి పుస్తకాన్ని చదవండి.. ఒక్కసారి రచయిత మనసుని వినండి...

స్వస్తి..

~~ త్రిశూల్ ~~

Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:

Post a Comment