Friday, February 26, 2021

అభిసారిక


వచనాన్ని ఉత్ప్రేక్షతో జోడించి స్వల్ప వర్ణన వ్రాయడం అంటే ఇదే.. చాలా మటుకు అర్ధం కాకపోవచ్చు నోరు కూడా తిరుగక పోవచ్చు.. కానీ ప్రయత్నించండి.. ఎందుకంటె.. శరీరానికే కాదు వ్యాయామం నాలుకకు, బుద్దికి కూడా కావాలి.. ఇలాంటి పదాల వల్ల జిహ్వ ఉత్తేజితమౌతుంది.. అంతే కాదు బద్దకాన్ని విడనాడి వేగం పుంజుకుంటుంది.. మాంసాహారాల వల్ల మందపడిన జిహ్వకు ఇలాంటి పదాల అల్లిక వ్యాయామమే అని చెప్పొచ్చు.. గుర్తుంచుకోండి వ్యాయామం శరీరానికే కాదు.. బుద్దికి కూడా వుండాలి.. చదివి అభిప్రాయలు చెప్పండి మరి..!!


అభిసారిక
*********

తమ్మి పూదేనె తెగ ద్రాగి
జుమ్మనుచు పారిపోయెడి
తుమ్మెద సమూహము గాంచు
చెలియ పుష్కలాక్షి కై
సింగారించు ఝణ ఝణల మ్రోయు
పసిడి మొలనూలు శోభన కాంతుల
నళినీ లత తమ్ములతో వెలు గున్
చెలగున్ లత పువ్వుల గుత్తుల తోన్
వెల యున్ కవితల్ విమలాత్ములన్..!!

లలితము,
మధురాక్షర సంకలితము,
లలనా హృదబ్ద గలితము,
రససం కావ్య చలితము,
కర్పూరగంధి నమోస్తుతే..! నమోస్తుతే..!!

నింగికి నీలిమవై,
కడలికి కెరటమువై,
పడతికి పరువానివై,
పారాణికి పసుపువై,
కావ్యానికి కథానికవై,
నాట్యానికి భంగిమవై,
రమణీయ కుసుమానికి
రస రమ్య పరిమళానివై,
హిమగానానికి పడిశమువై,
మధువుకు మధురిమవై,
హృదయానికి స్పందనవై,
కనుదోయికి కాటుకవై,
కనుపాపకు కమనీయ దృష్టివై,
ఎడారి పుడమికి
ఎడలేని ఇసుకవై,
అధరాలకు మృదుహేలవై
జన్మకు మరుజన్మవై,
ప్రేమకు ప్రణయాలింగవై,
మాధవునికి రాధవై,
నీ ఆత్మను నేనై,
నా ఆత్మవు నీవై,
అందాల అలివేలివై
నర్తించు నా హృదయవేధికపై
అంగనాభిసారికవై..!!

నీ
సమ్మోహన తలంపుతో
పులకరించును రేయి చలువ వెన్నెలలు
జలదరించు సరస్సు కలికి తామరలు
అలరించు లే దీవె తలిరాకు ననలలు
తొలకరించు శరత్తు తెలి యంచగములు..!!

Written by: Bobby Aniboyina

1 comment:

  1. మంచి ప్రయత్నమే. అయితే ఏమనుకోకండి గానీ మీ కవితకు దాని పేరుకి సంబంధం లేదు. "అభిసారిక" అంటే "ప్రియుని గూర్చి సంకేతస్థలమునకుఁ బోవు నాయిక, ప్రియుని సంకేతస్థలమునకు రప్పించుకొను నాయిక" అని నిఘంటువులోని అర్ధం. మీ కవితలో అటువంటి సారాశం ఏమీ లేదు. ఆ బొమ్మ కూడా నేర్పరురాలైన అభిసారిక కన్నా ఒక బేల లాగా ఉంది.

    // " హిమగానానికి పడిశమువై" // అంటే మీ భావం ఏమిటండి? పడిశెం అంటే జలుబు అని మీకు తెలుసుననే అనుకుంటున్నాను. అలాగే "హిమగానం" అంటే?

    12వ లైనులో "హృదబ్ద గలితము", చివరి పాదంలో "తెలి యంచగములు" అంటే అర్ధం ఏమిటండి? నిఘంటువులో దొరకలేదు లెండి.

    "వ్యాయాయం శరీరానికే కాదు, బుద్దికి కూడా వుండాలి" అని మీ ఈ పోస్ట్ మొదట్లో మీరన్నది మీ కవిత వ్రాయడంలోనే తుచ తప్పకుండా మీరే పాటించినట్లున్నారు. కానీ తేలికపాటి పదాలతో వ్రాయడం ఎప్పుడూ మంచి పని అని, అటువంటి సరళమైన శైలే వ్రాతలకు శోభనిస్తుందనీ నా అభిప్రాయం. మరీ క్లిష్టమైన పదాలు వాడడం కొంత గొప్పగా అనిపించుతుందేమో గానీ చదువరులు పెద్దగా హర్షించరు.
    ఉ.బో.స ఇచ్చినందుకు ఏమనుకోకండి.

    ReplyDelete