Wednesday, September 18, 2019



ఎందుకో తెలియదు కాని చిన్నప్పటినుండి లలితకళలు అంటే మహా ఇష్టం... సాగరసంగమంలో కమలహాసన్ గారిని చూస్తున్నప్పుడు ఏదో తెలియని ఆనందం కలిగేది.. ఎన్నిసార్లు చూసానో కూడా లెక్కేలేదు.. ఆ నాట్య భంగిమలు, ఆ నృత్య రీతులు నన్ను చాలా ఆకట్టుకునేవి.. కనీసం ఓ ముద్ర అయినా నేర్చుకోవాలని ప్రయత్నించాను.. కుదరలేదు... సరస్వతమ్మ చెవి మెలిపెట్టి ఇది నేర్చుకో అని నా చేతిలో కలము పెట్టిందేమో అనిపిస్తుంది ఒక్కోసారి.. ఇది నేను నేర్చుకోలేదు.. నాకు తెలియకుండానే అలా జరిగిపోయింది.. ఆ తరువాతనే చిత్తశుద్ధితో నేర్చుకున్నాను..  నేర్చుకుంటున్నాను..

సరే విషయం ఏమిటంటే ?

సర్వకళల సమాహారం అయిన నాట్యంలో అంతర్భాగంగా పితామహుడూ సృష్టికర్త అయిన బ్రహ్మ సంగీతాన్ని సామవేదం నుండి గ్రహించి సృష్టించాడని మన దేశపు ప్రాచీన సంగీత శాస్త్రజ్ఞులందరూ విశ్వసిస్తారు ..
దేవతలూ, మునులూ కలిసి సృష్టికర్త వద్దకు వెళ్ళి సృష్టిలోని అన్నీ జాతులవారూ ఆనందించేందుకు వీలయిన “క్రీడనీయకం” ఒక వినోద ప్రక్రియను ప్రసాదించమని కోరారు..

“నాట్యవేద స్త తశ్చక్రే చతుర్వేదాంగ సంభవమ్
జగ్రాహ పాఠ్యం ఋగ్వేదాత్ సామభ్యోగీతమేవచ
యజుర్వేదాదభినయాన్ రసాధర్వణాదపి”

ఋగ్వేదం నుండి (పాత్రలు గానం చేయవలసిన) పాఠ్యమును,
సామవేదం నుండి సంగీతాన్ని,
యజుర్వేదం నుండి అభినయాన్నీ,
అధర్వణ నుండి రసాన్ని, రసప్రయోగ విధానాన్ని స్వీకరించి విధాత నాట్యవేదాన్ని సృజించాడు అని అర్ధం..

నాట్యం ఒక ఆస్వాదనలా సాగాలి
మన జీవితాన్ని వెలిగించే ఓ జ్యోతిలా ప్రకాశించాలి..
అప్పుడే అది పరిపూర్ణత.. మనకు సార్ధకత చేకూరుతుంది..!!

Bobby Nani

No comments:

Post a Comment