Saturday, February 16, 2019

వెన్నెల ఒడిలో ఓ రాత్రి..!!


వెన్నెల ఒడిలో ఓ రాత్రి..!!
*******************

వినీలాకాశంలోని తారలు పారిజాతాల్లా వికసిస్తున్నాయి 
వెన్నెలలో కొబ్బరిమట్ల మధ్య నా మనసు 
గాలి తెరకి కదుల్తున్న తరణిలా ఊగుతోంది 
ఈ వెన్నెల వెలుగులలో నేన... నా జ్ఞాపకాలను 
నెమరేసుకుంటూ అక్షరాల్ని ముద్రిస్తూ, 
వెన్నెల ఒడిలో నే తలపెట్టి నా ఆశల్నీ, ఆశయాల్నీ బుజ్జగిస్తున్నా
శ్వేతనీల పల్లకిలో నా స్వప్నం దేశమంతటా ఊరేగుతోంది
ఓ అల్లరి నక్షత్రం నా చుట్టూ తిరుగుతూ, 
నా ఎదపై రంగుల్ని గుమ్మరిస్తోంది 
ఆ కాంతి నా దేహంలోకి చొచ్చుకొని నాలో సన్నని కోరిక రగిలిస్తోంది..!!

ఓ వెన్నెలా 
నేనీరోజు నీ ఒడిలో తలపెట్టి ఉన్నాను 
నాలోని ఊసులు నీతో చెప్పాలనిపిస్తోంది 
మానవత్వమే లేని మా ఈ నేల మీది ప్రపంచంలో 
జీవితం... నిప్పుల్ని విరజిమ్ముతూ వుంటుంది 
అంతటా కరంకములు మండుతూనే వున్నా, 
పొగముసిరిన గుడిసెల్ని కూడా 
ఇక్కడి మా రాజకీయం పట్టి పీడిస్తూనే ఉంటుంది 
కులం బూడిదలో బంగారాన్ని ఏరుకోవాలని ప్రయత్నిస్తూనే వుంటుంది 
చీకట్లో రాక్షసత్వం మరణాన్ని కూడా అమ్ముకుంటూ వుంటుంది 
దుఃఖంతో గొంతు పెగలక ఈ మధ్య నా నుంచి 
ఒక్క వాక్యం కూడా రాలి పడట్లేదు..!

కానీ ఓ వెన్నెలా
ఇవాళ నువ్వు నా గాయాలకు వెన్న పూస్తున్నావు 
పువ్వులూ, పున్నమీ లేని జీవితం ఎంత దుర్భరమో 
నాకీనాడు అర్ధమౌతోంది..!!

పత్రికల్లో, వార్తల్లో మాత్రం 
ప్రజా పోరాటాలు, నీతి, నిజాయితీలు 
అంతిమంగా విజయం సాధిస్తాయని అంటున్నారు.. 
నాటి నుంచి నేటివరకు ఈ మాటలు వింటూనే ఉన్నాను..!!

నా కళ్ళముందు కనిపించే ఆకాశంలోని నక్షత్రాలు 
వెలిగి వెలిగి అలసిపోయి 
మబ్బుతెర దించేసుకొని నిద్రలోకి జోగుతున్నాయి 
కళ్ళార్పకుండా వెన్నెల్ని ఆరగిస్తూ తెల్లారకూడదని 
కోరుకుంటున్న నాకు 
నిద్ర ఎప్పుడు పట్టిందో తెలియదు 
రేపటి రాక్షస ప్రపంచానికి మళ్ళీ వాకిలి తెరుచుకునేందుకు..!!



Written by: Bobby Nani

No comments:

Post a Comment