Saturday, September 1, 2018

లలన..


లలన..
*******

ఈ సుదిన ఉదయాన 
నా సదన ఉద్యాన వనములో 
మెల్లని గమనముల 
ఒయ్యారముల చిలుకు 
సింధూర తిలకముల ముదిత 
హాసముల నెన్నెన్నో చూచితిని
సందేహము లేదు
ఆమె లలనే..!!

ఓ లలనా..!!
వెన్నెల వేళ 
తీయని ఏలపదాలూదు గాలిలో, 
గంధర్వుల గానకళా కౌసల్యము 
నీకోసమే నేర్చితిని..
వెన్నెలైతే వచ్చింది కానీ 
నీవే ముంగిట లేవు..!!

చైత్రములో “వసంతము” వై,
వైశాఖమున “అక్షయము” లా,
జ్యేష్ఠములో “ఏరువాకము” వై, 
ఆషాడమున “ఏకాశి ఎడబాటు” లా, 
శ్రావణంలో “వరలక్ష్మి” వై, 
భాద్రపదమున “చవితి చంద్రోదయం” లా,
ఆశ్వయుజములో “దుర్గ” వై, 
కార్తీకమున “దీపము” లా 
మార్గశీర్షములో “తులసీ దళము” వై,
పుష్యమున “సంగీత నాదము” లా,
మాఘములో “భగ భగల భోగిణి” వై, 
ఫాల్గుణమున “చలి కౌగిలి”లా, వచ్చి వెళుతుంటావు.. 
చేమంతి విరులు విదజల్లు అల్లుకొను రీతిన 
చంద్రికలు రాలిన పచ్చికలనేలపై పరుండిన
తళుకుజిలుగులుజేయు మిణుగురులవలె 
నీ పద్మపు పాదాలకు బంగారు మువ్వల్లా కనపడుతున్నాయి..!!

ఏమాటకామాటే కానీ 
అసలు ఏముంటావో, 
లేత మంచు బిందువుల ముసుగులో మల్లె మొగ్గ వలె,
నును లేత దుకూలముల జలతారు విరులవలె,
జల జలా రాలు వేవేల చేమంతి రెబ్బల వలె,
పాలకడలి కెరటాల తరకల వలె 
పూర్ణిమా చంద్రికా తరంగములు ఉప్పొంగి పారును 
నీ రూప లావణ్యముల సౌందర్య నాయనా వీక్షణములకు..!!

Written by: Bobby Nani

No comments:

Post a Comment